అనంతపురం

చెరువులో పడి వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం రూరల్, జూన్ 24 : మండల పరిధిలోని రేకులకుంట గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(85) శుక్రవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు సమీపంలో ఉన్న చెరువు వద్దకు లక్ష్మమ్మ బహిర్భూమికి వెళ్లి కాలిజారడంతో చెరువులోకి పడిపోయిందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహానంది ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
రొళ్ళ, జూన్ 24: మండల పరిధిలోని కె.బ్యాడిగెర గ్రామంలో దేవరాజు(40) అనే వ్యిక్తి శుక్రవారం మధ్యాహ్నం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దేవరాజు తన ఇంట్లో విద్యుత్ లేకపోవడంతో మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించినట్లు ఆయన బంధువులు తెలిపారు. ఈయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు విద్యుదాఘాతంతో మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
బావిలో పడి యువకుడి మృతి
నల్లచెరువు, జూన్, 24: మండల పరిధిలోని ఓరువాయి దగ్గర వున్న బోయిపల్లిలో బావిలో పడి హరీష్ (24) మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని చేలూరు సమీపంలోని ఏనుగుదలకు చెందిన తిరుపాల్ కుమారుడు హరీష్ బోయపల్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. మానసికపరిస్థితి సరిగాలేని హరీష్ రెండురోజుల నుంచి కనిపించకోవడంతో బంధువులు చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం బావిలో శవమై కనిపించారని మృతుని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లచెరువు పోలీసులు తెలిపారు.
మిద్దెపై నుంచి పడి వ్యక్తి మృతి
రామగిరి, జూన్ 24: మండలంలోని కురుకుండ్లకాలనీకి చెందిన ఓబులేసు(50) మిద్దెపై నుండి పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం మిద్దెపైకి వెళ్ళిన ఓబులేసు అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హుండీలో నగదు, ఆభరణాలు చోరీ
మడకశిర, జూన్ 24: మండల పరిధిలోని కోతులగుట్టలో వెలసిన మల్లేశ్వరస్వామి దేవాలయంలోకి దుండగులు ప్రవేశించి హుండీలో ఉన్న నగదు, ఆభరణాలు చోరీ చేసుకెళ్లారు. గత ఆరు నెలల క్రితం గ్రామంలోని మల్లేశ్వరస్వామి దేవాలయానికి దాతల సహకారంతో మరమ్మత్తులు చేయించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం రాత్రి గుర్తు తెలియని దుండుగలు ఆలయ ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్ళి హుండీని తీసుకెళ్ళి అందులో ఉన్న నగదు, ఆభరణాలు దోచుకొని హుండీని చెట్ల పొదల్లోకి పారేశారు. స్వామికి చెందిన వెండి, బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్ళినట్లు ఆలయ అర్చకులు ఉమాపతి తెలిపారు. ఈ విషయమై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మక్బూల్‌బాషా తెలిపారు.