అనంతపురం

ఒక్కటే ముసురు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 2 : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమవడంతోపాటు చిరుజల్లులు పడుతుండటంతో ముసురు కమ్ముకుంటోంది. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం బుక్కరాయసముద్రం (మండలంలో) 8.9 (మిల్లీమీటర్లలో), పెనుకొండలో 7.7, ఆమడగూరులో 7.8, నార్పలలో 8.8, గార్లదినె్నలో 4.2, యల్లనూరులో 10.7, కంబదూరులో 8.4, నంబులపూలకుంటలో 8.3, గాండ్లపెంటలో 2.2, గుమ్మగట్టలో 2, రొద్దంలో 2, చిలమత్తూరులో 3.7 ఎంఎం వర్షపాతం నమోదైంది. మొత్తం 15 మండలాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మాత్రమే కురవగా 14 మండలాల్లో 2.5 ఎంఎం నుంచి 5 ఎంఎం వరకూ, మరో ఆరు మండలాల్లో 5 ఎంఎం నుంచి 10 ఎంఎం వరకూ వర్షపాతం నమోదైంది. ఒక్క యల్లనూరు మండలంలో మాత్రమే 10 ఎంఎం వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మరో 24 గంటల పాటు ఇదే రకమైన పరిస్థితి కొనసాగనుండగా 10 ఎంఎం వరకూ వర్షపాతం నమోదు కావచ్చని అధికారుల ద్వారా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న జిల్లాలోని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 6, 7వ తేదీల్లో జిల్లాలో మరోమారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ముసురు పట్టుకోవడంతో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. తాజాగా రెండు రోజుల పాటు వర్షం పడటంతో ఉన్న పంటలు సైతం దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పనుల వేగం పెంచండి
* హంద్రీనీవా రెండోదశ పనులు మార్చి 15లోపు పూర్తి చేయాలి
* కలెక్టర్ కోన శశిధర్
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, డిసెంబర్ 2 : హంద్రీనీవా రెండవ దశ కాలువ పనుల వేగాన్ని పెంచి నాణ్యతతో మార్చి 15వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం హంద్రీనీవా ఎస్‌ఈ సుధాకరబాబుతోపాటు ఇఇలు, డిఈలతో కలసి సికెపల్లి హైవే పక్కన ఉన్న ఏడవ ప్యాకేజీ నుంచి సికె పల్లి, కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం, ముదిగుబ్బ మండలాల పరిధిలోని 7,8,9,10,11,13వ ప్యాకేజీల పనులు, అక్విడెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలోగా సాగునీటితోపాటు చెరువులకు, ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇక నుంచి ప్రతి పది రోజులకు ఒకమారు ఒక్కొక్క ప్యాకేజీ పనులకు విడివిడిగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయనట్లయితే సదరు కాంట్రాక్టర్‌పై నివేదికలను ప్రభుత్వానికి పంపుతామని స్పష్టం చేశారు. సికెపల్లె దగ్గర ఏడవ ప్యాకేజీ వద్ద 310 కిమీ.. 303 కిమీ వద్ద జరుగుతున్న అండర్ టనె్నల్స్, అక్విడెట్లను తనిఖీ చేశారు. ఇందులో డిజైన్స్ పెండింగ్‌లో ఉన్నాయని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు తెలుపగా అక్కడి నుంచే హంద్రీనీవా సిఈతో ఫోన్లో మాట్లాడి డిజైన్స్ అప్రూవల్‌ను చేయించాలని ఆదేశించారు. అలాగే 314 316, 319 కిమీ వద్ద అండర్ టనె్నల్‌ను పరిశీలించి ఆశించిన విధంగా పనులు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే యంత్రాలను పెంచి వారంలోపు పనుల ప్రగతిని చూపాలన్నారు. అలాగే తలమర్ల వద్ద 8వ ప్యాకేజీ, 321 కిమీ వద్ద సింగిల్ లెవల్ రోడ్డు బ్రిడ్జి, 323 కిమీ వద్ద మరోబ్రిడ్జి నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. అలాగే కొత్తచెరువు మండలం మరవకుంట వద్ద పనులను పరిశీలించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వారిని ఆదేశించారు. కొత్తచెరువు మండలం పోతులకుంట 326 కిమీ వద్ద ఎర్రవంకపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, 328 కిమీ కొత్తచెరువు, పెనుకొండ ప్రధాన రహదారిపై బైరాపురం వద్ద డీప్ కట్‌తో నిర్మిస్తున్న రోడ్డు, బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. అలాగే బుక్కపట్నం చెరువుకు ప్రధాన వనరులుగా ఉన్న వంగతేరుపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ 329 కిమీ వద్ద నిర్మిస్తున్న డబుల్ లెవల్ రోడ్డు బ్రిడ్జి, గుంటుపల్లె వద్ద భూసేకరణ పనులను పరిశీలించారు. ఈ నిర్మాణం పూర్తయితే బుక్కపట్నం చెరువుకు హంద్రీనీవా నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఫలితంగా 150 గ్రామాలకు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. జానకంపల్లె వద్ద 110 కిమీ సైపనింగ్ పనులు, బుక్కపట్నం కొండ చుట్టూ రెండున్నర కిమీల ప్రధాన కాలువ పనులను తనిఖీ చేసి నిధానంగా పనులు జరుగుతుండటంతో వెంటనే ఎక్కువ యంత్రాలు తెప్పించి త్వరిగతిన పూర్తి చేయాలని హెచ్‌ఇఎస్ కంపెనీ ఎండిను ఆదేశించారు. అలాగే ప్యాకేజీ నెం 10 పనుల్లో 10 రోజుల్లోపు ప్రగతి చూపాలన్నారు. 11వ ప్యాకేజీ, కొట్టాలపల్లి, చండ్రాయునిపల్లి వద్ద పనులను పరిశీలించారు. ఈ ప్యాకేజి కింద పాముదుర్తి, అగ్రహారం వంకపై అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. ఇప్పటికైనా ఆయా పనుల్లో వేగాన్ని పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
హెక్టారుకు రూ.15 వేలు పరిహారం
* జిల్లాలో లక్ష ఫారంపాండ్లు
* మార్చిలోగా హంద్రీనీవా పూర్తి
* మంత్రి పల్లెరఘునాథరెడ్డి
పుట్టపర్తి, డిసెంబర్ 2:ఇటీవల కురిసిన తుఫాను వర్షం తాకిడికి దెబ్బతిన్న పంటలు ప్రతి హెక్టారుకు రూ.15వేలు పరిహారం ప్రభుత్వం అందజేస్తుందని సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. బుధవారం పుట్టపర్తి మండల పరిధిలోని వెంగలమ్మచెరువు గ్రామంలో జరిగిన జనచైతన్య యాత్రలో పాల్గొని ఆయన ప్రసంగించారు. వర్షం తాకిడికి తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న 18మండలాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను సేకరిస్తున్నామన్నారు. ప్రతి హెక్టారుకు రూ.15వేల వరకు పంటనష్ట పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. జిల్లాలో భూగర్భజలాల పెంపుకోసం లక్ష ఫారంపాండ్లను నిర్మించ తలపెట్టినట్లు తెలిపారు. ప్రతి 10హెక్టార్లకు ఒక ఫారంపాండు నిర్మిస్తారన్నారు. 2016 మార్చిలోగా హంద్రీనీవా కాలువను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేశామన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ, ఓడిసి, అమడగూరు మండలాలకు సాగునీరు అందించేందుకు సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సిసిరోడ్లు వేస్తామన్నారు. వచ్చే జనవరిలోగా అర్హులందరికి రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. మార్చిలోగా 20లక్షల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఐఏవై కింద జిల్లాకు 13వేలకు పైగా గృహాలు మంజూరు కానున్నాయన్నారు. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే జనచైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను 16నెలల వ్యవధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడమే కాక సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా 84లక్షల మంది రైతులకు రూ.24వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.13వేల కోట్ల మూలధనం సమకూర్చడం జరుగుతోందన్నారు. రూ.200ల నుండి రూ.1000లకు పెంచి రాష్ట్రంలో 44లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. జనచైతన్య యాత్రలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారన్నారు. తద్వారా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగడానికి వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బొమ్మయ్య, తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఆంజనేయులు, నాయకులు శ్రీరామిరెడ్డి, శ్రీరామ్‌నాయక్, అత్తర్‌బాషా పాల్గొన్నారు.

సంస్థాగతంగా బిజెపిని బలోపేతం చేయాలి
* ఎపి వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్
అనంతపురం సిటీ, డిసెంబర్ 2:్భరతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడాని ముఖ్యనాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సప్తగిరి బల్లా కాన్ఫరెన్సు హాల్‌లో బిజెపి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, ఫైనాన్స్ కమిటీ ఛైర్మెన్ ఎంఎస్.పార్థసారథి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సి.విష్థువర్థన్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దార్థనాథ్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీలు కలసి పనిచేస్తున్నాయని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే బిజెపిని సంస్థాగతంగా ప్రతి గ్రామ పరిధి నుండి రాష్ట్ర స్థాయిలో ఓటరు స్థాయి రేటను పెంచడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలను పర్యటన చేస్తున్నానని తెలిపారు. నాయకులు జిల్లాలో ప్రజలకు అవసరమైన సమస్యను తీసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనధన్, నీతిఅవాస్ యోజన, ఉపాధి అవకాశాలు కల్పినకై ముద్ర లోన్సును, పరిశ్రమలకు ఏర్పాటు యువతకు ప్రోత్సహాకాలు లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ఫ్యాకేజితో పాటుగా 2500కోట్లతో జిల్లాలో బెల్ కంపెనీ, 1500కోట్లతో సెంట్రల్ ఎక్సజ్ అకాడమిని ఏర్పాటు చేస్తూ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో గృహల నిర్మాణంలో భాగంగా జిల్లాకు పేదలకు 20వేల పైగా గృహాలను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవ్సరాలలో చేయని పనులలను బిజెపి ప్రభుత్వం 18 నెలలలో చేసి జిపిఎను పెంచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి 2014 ఎన్నికల్లో వచ్చిన ఓటరు శాతం కన్నా వచ్చే ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచడానికి ప్రతి కార్యకర్తల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత్‌కుమార్, అంబటి రామకృష్ణారెడ్డి, లక్ష్మిదేవి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఎన్‌టి.చౌదరి, నాయకులు సందిరెడ్డి శ్రీనివాసులు, గౌని విశ్వనాథ్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఓలేటి రత్నమయ్య, ఫయాజుద్దీన్, శ్యామ్‌సుందర్, సుబ్బరాజుగుప్తా, జగన్‌మోహన్‌రెడ్డి, మల్లీశ్వరి, మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, పెద్దన్న, అశ్వర్థ, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టిడిపి పురోభివృద్ధికి కృషి
* బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి * అభినందనల వెల్లువ
హిందూపురం, డిసెంబర్ 2 : తనపై ఎంతో నమ్మకం ఉంచి రెండుమార్లు ఎమ్మెల్యేగా, ఆఫ్కో చైర్మన్‌గా పదవులు కట్టబెట్టడంతోపాటు తాజాగా బిసి కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించడాన్ని బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పామిశెట్టి రంగనాయకులు పేర్కొన్నారు. బిసి కార్పోరేషన్ చైర్మన్‌గా రంగనాయకులును నియమించడంతో బుధవారం ఆయన ఇంట్లో సందడి నెలకొంది. నియోజకవర్గవ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి చంద్రబాబు, బాలయ్య నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినదించారు. ముద్దిరెడ్డిపల్లి నుంచి ర్యాలీగా వచ్చి తెలుగుతల్లి, ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు తప్పకుండా లభిస్తుందన్నారు. చంద్రబాబు ఆశీస్సులు, బాలకృష్ణ సహకారంతో ఈ పదవి లభించిందన్నారు. తమ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలకు అవకాశం లేదన్నారు. పార్టీ తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బిసి కార్పొరేషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో చొరవ చూపుతున్నారన్నారు. టిడిపికి 1983 నుంచి కంచుకోటగా ఉంటున్న హిందూపురం నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఐకమత్యంతో కృషి చేద్దామని కోరారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కనుమూరి శేఖర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి, వైస్ ఛైర్మన్ రామ్మోహన్, మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, టిడిపి నాయకులు ఏ.నాగరాజు, షఫీవుల్లా, డిఇ రమేష్‌కుమార్ మాట్లాడుతూ టిడిపిలో చురుగ్గా ఉంటున్న పామిశెట్టి రంగనాయకులుకు రాష్ట్ర స్థాయి పదవి రావడం హర్షణీయమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి తప్పకుండా సిఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పటికైనా తగిన గుర్తింపు ఇస్తారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు నీలూరి వెంకట్రాముడు, దేమకేతేపల్లి అంజినప్ప, నెట్టప్ప, బండారు బాలాజీ, నంబూరి సతీష్, అమర్‌నాథ్, పామిశెట్టి శేఖర్, జయసింహ, ముద్దరంగప్ప, కెవి తిమ్మారెడ్డి, ఎంపిపి సుభద్రమ్మ, జడ్‌టిపిసి ఆదినారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, చౌడేశ్వరి పవర్‌లూమ్ మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంచాల మారుతీ, చెన్నా రాధాకృష్ణ, పల్లా లక్ష్మీకుమార్, వెంకటస్వామి, నాగేంద్ర తదితర నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

మనిషికి మనోనిగ్రహానిచ్చేవి ఆలయాలు
* పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి
డి.హీరేహాల్, డిసెంబర్ 2 : మనిషిలోని శక్తిని పెంచుతూ మనోనిగ్రహానిచ్చే పవిత్ర క్షేత్రాలే ఆలయాలని పంపాపతి క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని డి.హీరేహాల్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం బుధవారం లక్షదీపోత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం, మహ మంగళహారతి, సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర నామాలు, పుష్పార్చన నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి అమ్మవారికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తులసి మాతను పూజించాలన్నారు. నేటి పరిస్థితుల్లో ఆలయాలు ధనాన్ని ఆర్జించే కేంద్రాలుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలు శిథిలమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆలయాల్లో అత్యంత శక్తివంతమైన దైవశక్తి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థం లేకుండా మెలగాలని సూచించారు. అనంతరం మహిళలు లక్ష దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, కల్యాణదుర్గం ఆర్‌డిఓ రామారావు, రాయదుర్గం మార్కెట్‌యార్డ్ చైర్మన్ చంద్రహాస్, కర్నాటక, ఆంధ్ర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
సుపరిపాలనే టిడిపి లక్ష్యం
* మంత్రి పరిటాల సునీత
రాప్తాడు, డిసెంబర్ 2:ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. కరవు జిల్లాలో బుధవారం మండల పరిధిలోని గొల్లపల్లిలో జనచైతన్య యాత్రలు మంత్రి ప్రారంభించారు. ఎంపిపి దగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మరూరు, చెర్లోపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో జన చైతన్య యాత్రలు ప్రారంభించి తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి లేకుండా ప్రజలను మభ్యపెడుతున్న తరుణంలో దివంగత నేత ఎన్‌టిఆర్ తెలుగు ప్రజలకు అండగా నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200లు పింఛన్ ఇచ్చి ఆర్భాటంగా గొప్పలు చెప్పుకుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదురెట్లు పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి కానుకగా నూతన రేషన్‌కార్డులు అందజేస్తామని, చంద్రన్న కానుకల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలకు దీపం పథకం కింద 20లక్షల గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని వెల్లడించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కరవు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలూ కృషి చేస్తున్నారని, 2016మార్చి లోగా హంద్రీనీవా పనులు పూర్తి చేసి ఆ నీటితో చెరువులను పూర్తిగా నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మండలంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు గ్రామాల్లోని ప్రజలను చైతన్యవంతులను చేసి అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా గొల్లపల్లిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త ధర్మవరపు మురళి, సర్పంచులు ఆకుల వెంకటరాముడు, దగ్గుబాటి శ్రీనివాస్, హంపాపురం గోపాల్, వెంకటేష్, రామాంజనేయులు, మండల కన్వీనర్ నారాయణస్వామి, తెలుగుదేశం నాయకులు గంగులకుంట రమణ, హంపాపురం నాగరాజు, నారాయణస్వామి, ఉప ఎంపిపి గవ్వల పరంధామా తదితరులు పాల్గొన్నారు.
హంద్రీనీవా పనులు పూర్తి చేయండి
* కలెక్టర్ కోన శశిధర్
కొత్తచెరువు, డిసెంబర్ 2:హంద్రీనీవా పనులు త్వరితగతిన పూర్తి చేస్తే త్వరగా రైతులకు సాగునీరు, తాగునీరు అందించడానికి వీలవుతుందని కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. మండలంలో హంద్రీనీవా కాలువకు సంబంధించి 8వ ప్యాకేజీ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. బంగారుచెనే్నపల్లి, మీర్జాపురం, మరకుంటపల్లి, పోతులకుంట గ్రామాల వద్ద జరుగుతున్న పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 8వ ప్యాకేజీకి సంబంధించి భూసమీకరణ ఓ కొలిక్కి వచ్చిందని, ఇక పనులు పూర్తి చేయడమే కాంట్రాక్టర్ల బాధ్యతగా ఆయన కాంట్రాక్టర్లు దేవినేని వెంకటేష్, మహిధర్‌రెడ్డిలకు సూచించారు. హంద్రీనీవా కాలువ పనులకు సంబంధించి ఇంకా కల్వర్టుల పనులు పెండింగ్‌లో వున్నందున త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం హంద్రీనీవా కాలువపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిందని, నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ డిఈ శుభచంద్రారెడ్డి, తహశీల్దార్ వసంతకుమార్, విఆర్‌ఓలు పాల్గొన్నారు.
అభివృద్ధి నిరోధకుడు జగన్
* ఎమ్మెల్యే బికె పార్థసారధి
సోమందేపల్లి, డిసెంబర్ 2 : నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా అడ్డుతగులుతూ అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యాడని పెనుకొండ ఎమ్మెల్యే బికె పార్థసారధి విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని నాగినాయనచెరువు గ్రామంలో జరిగిన జన చైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు సంక్షేమ పథకాలు, రుణమాఫీ, పెన్షన్ల పెంపు, సాగు, తాగునీటి పథకాలు, నూతన రేషన్‌కార్డులు, విద్యుత్ వంటి ఎన్నో పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కరవు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం హంద్రీనీవా పథకాన్ని, పెనుకొండ నియోజకవర్గంలో ఎన్నో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సీమ జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తున్న తరుణంలో జగన్ పట్టిసీమ ప్రాజెక్టు, నూతన రాజధాని అమరావతి పనులపై విమర్శించడం తగదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సీమకు నీరందిస్తే వారి పప్పులు ఉడకవని జగన్ కుయుక్తులు పన్నుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి పనుల వివరాలను ధైర్యంగా ప్రచారం చేసుకునేందుకు గ్రామ గ్రామాన తిరుగుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓట్ల వర్షం, వైఎస్‌ఆర్ పార్టీకి రాళ్ల వర్షం కురుస్తుందని జోస్యం చెప్పారు. హంద్రీనీవా పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నీటిని నింపిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు అశ్వర్థప్ప, కన్వీనర్ సిద్దలింగప్ప, సింగిల్‌విండో అధ్యక్షులు ఆంజనేయులు, నాయకులు వెంకటేశులు, చంద్రశేఖర్, భానుకీర్తి, సిద్ద, సూరి పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
గుత్తి, డిసెంబర్ 2 : పట్టణ శివార్లలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం గుర్తు తెలియని ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తి చెందాడు. పెద్దవడుగూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు(46) వయస్సు ఉంటుందని, చామన ఛాయ, తెల్లపంచె, అంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బెంగళూరులో రోడ్డు ప్రమాదం..
గోరంట్ల వాసి మృతి
గోరంట్ల, డిసెంబర్ 2 : మండల పరిధిలోని ఉగ్రరాంపల్లికి చెందిన వ్యక్తి బుధవారం బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బతుకుదెరువు కోసం వడ్డె రంగప్ప (43) భార్యతో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. బుధవారం ఉదయం పని కోసం వెళ్తుండగా జీపు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శవ పరీక్ష ముగిసిన తర్వాత మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో విషాదం నెలకొంది.
వృద్ధుడి ఆత్మహత్య
గార్లదినె్న, డిసెంబర్ 2 : మండల పరిధిలోని కొప్పలకొండ గ్రామంలో మాల సిద్ధయ్య (70) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బుధవారం ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు తెలిపారు.
పోలీస్‌స్టేషన్ ఎదుటే
యువకుడి ఆత్మహత్యాయత్నం
హిందూపురం, డిసెంబర్ 2 : పోలీసుల వైఖరితో మనస్థాపం చెందిన ప్రైవేట్ ఫొటో గ్రాఫర్ కిరణ్ స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నివాసం ఉంటున్న కిరణ్‌కు తన చిన్నాన్న అశ్వర్థప్పతో స్థలం విషయంలో గత కొంతకాలంగా వివాదం ఉంది. దీంతో అన్ని హక్కులు, డాక్యుమెంట్లు ఉన్నా పోలీసులు పట్టించుకోకుండా కిరణ్‌ను వేధించారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పోలీసులు పూర్తి స్థాయిలో విచారించకుండా ఎస్పీ ఆదేశాలంటూ రెండు రోజులుగా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై వన్‌టౌన్ పోలీసులను అడగ్గా ఇటీవల అశ్వర్థప్ప ఎస్పీకి ఫిర్యాదు చేయగా తమకు అందిన ఆదేశాల మేరకు పిలిపించి తగాదాను పరిష్కరించుకోవాలని సూచించామే తప్ప ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు.
దొంగ అరెస్టు
* 12 తులాల బంగారం, 4 పట్టుచీరలు స్వాధీనం
అనంతపురం సిటీ, డిసెంబర్ 2:జిల్లాలో పలు నగరల్లో ఇళ్ళలో చోరీలకు పాల్పడే దొంగను అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి, 12 తులాల బంగారం, 4పట్టు చీరలు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ రాఘవన్ తెలిపారు. బుధవారం వన్ టౌన్‌లో సిఐ కె.రాఘవన్ దొంగకు సంబందించిన వివరాలను విలేఖరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల తాళం వేసిన ఇళ్ళకు తాళం పగలగొట్టి దొంగతనాలకు చేస్తున్న హిందూపురం టౌన్‌కు చెందిన దొంగ సయ్యద్ మహబూబ్ బాషాను ధర్మవరం రోడ్డులోని ఆర్‌డిటి ఆఫీసు ముందు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుండి 12తులాల బంగారం, 12తులాల వెండి వస్తువులు, 4 పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసిన ఎస్‌ఐలు వెంకటరమణ, నాగమధు, హెడ్ కానిస్టేబుళ్లు సూరి, రాజకుళ్ళాయప్ప, శేషాచలపతి, రమేష్, ఖాజామోహిద్దీన్, శీనానాయక్, జయరామ్‌లును అభినందించారు.