అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఆగస్టు 31: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలు సమష్టిగా పోరాడాలని , ప్రమాదకరంగా తయారైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను గుర్తించి జవాబుదారీ చేయాలని బంగాళాఖాతం తీరంలో ఉన్న దేశాల కూటమి (బిమ్స్‌టెక్) పిలుపునిచ్చింది. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భంగం కలిగించే ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పరస్పర సహకారం అందించుకోవాలని ఈ కూటమి నిర్ణయించింది. ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు ఆర్థిక దన్ను కల్పించే మూలాలను దెబ్బతీయాలని బిమ్స్‌టెక్ దేశాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఇక్కడ నాల్గవ బిమ్స్‌టెక్ దేశాల కూటమి రెండు రోజుల సదస్సు ముగిసింది. ఈ సదస్సు ఉగ్రవాదం నిర్మూలనకు ఖాట్మండు డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తిలేదని, పరస్పరం సమాచారం అందించుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. భారత్, బంగ్లాదేశ్, మియాన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఉగ్రవాదానికి ఎల్లలు లేవని, భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న అణచివేయాలన్నారు. బిమ్స్‌టెక్ దేశాలు ఉగ్రవాదం దాడులకు గురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అన్ని దేశాలు ఈ డిక్లరేషన్‌కు కట్టుబడి ముందడుగు వేయాలన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను కంట కనిపెట్టి ఉండాలన్నారు. ఉగ్రవాదం నెట్‌వర్క్ విస్తరించి ఉందని, ఈ విభాగం కార్యకలాపాలపై నిఘా వేయాలన్నారు. అన్ని దేశాలు ఉగ్రవాద సంస్థల రిక్రూట్‌మెంట్‌పై వేటు వేయాలన్నారు. ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసే సంస్థలపై వేటు వేయాలన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా, భద్రతా బలగాల మధ్య సమన్వయం ఉండాలని, విలువైన సమాచారాన్ని పై స్థాయిలో పంచుకునే విధంగా శాశ్వతవిధానం ఉండాలన్నారు.
ఖాట్మండు డిక్లరేషన్‌తో బిమ్స్‌టెక్ సదస్సుకు ఊపు వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఈ ప్రాంత జనాభా 22 శాతం ఉంది. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 2.8 ట్రిలియన్ డాలర్లు ఉంది. పారదర్శక విధానాలతో పరస్పరం సహకరించుకోవాలని, ఆర్థికాభివృద్ధికి టెక్నాలజీని మార్చుకోవాలని ఈ దేశాలు పేర్కొన్నాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఈ సదస్సు వారథిలా పనిచేస్తుందని డిక్లరేషన్‌లో తీర్మానించారు. ఆయా దేశాల్లో పేదరికం నిర్మూలనకు, ఉపాధి అవకాశాలు మెరుగుదలకు, వౌలిక సదుపాయాల ఏర్పాటుకు, శాంతి భద్రతలపరిరక్షణకు కట్టుబడి పరస్పరం సహకరించుకోవాలని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.