అంతర్జాతీయం

ఉగ్రవాదమే పెను సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్కు, సెప్టెంబర్ 28: దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్‌గా పరిణమిస్తోందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. సార్క్‌దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన ఆమె పాకిస్తాన్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న అన్ని మార్గాలను మూసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె ఉద్ఘాటించారు. అనుకున్న స్థాయిలో అన్నిదేశాలు చేతులుకలిపినప్పుడు ఉగ్రవాద నిర్మూలనలో ప్రాంతీయ సహకారానికి ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. 73వ ఐరాస జనరల్ అసెంబ్లీ సదస్సులో భాగంగా సార్క్‌దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక సభ్యదేశాలుగా కలిగిన సార్క్ కూటమి ఇటీవల కాలంలో ప్రాధాన్యతను కోల్పోతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. దక్షిణాసియా ప్రాంత ఆర్థిక, ప్రజల సమగ్రాభివృద్ధి సాధ్యం కావాలంటే ప్రాంతీయ సహకారం అత్యంత కీలకమని సుష్మా అన్నారు. కాని శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగించే అనేక పరిణామాలు ఇటీవలి కాలంలో వెర్రితలలు వేస్తున్నాయన్నారు. ఉమ్మడి ప్రయత్నం ద్వారానే ఈ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని సుష్మ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎలాంటి వివక్షా లేకుండా దానిని నిర్మూలించాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో ఎంతైనా ఉందన్నారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణాత్మకమైనప్పుడే అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించగలుగుతామన్నారు. సార్క్‌కూటమి పూర్తిస్థాయిలో తన ఉనికిని చాటుకుని అభివృద్ధి సాధించాలంటే సభ్యదేశాల మధ్య నిర్మాణాత్మక సహకారం ఎంతైనా అవసరమన్నారు. ప్రాంతీయ సహకారం విషయంలో భారత్ మొదటి నుంచి పట్టుదలగా పనిచేస్తోందని, ముఖ్యంగా దక్షిణాసియా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ వస్తోందని సుష్మా అన్నారు. ముఖ్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశాలకే ప్రాధాన్యతను ఇచ్చే విధానం అమలులోకి వచ్చిందని, దీనివల్ల ప్రాంతీయపరంగా అభివృద్ధికి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతైనా వీలుంటుందని అన్నారు. సార్క్‌దేశాలకు జాతీయ విజ్ఞాన నెట్‌వర్క్‌ను విస్తరించాలన్న ఆలోచనలో భారత్ ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అన్నివిధాలుగా అన్ని రంగాల్లోనూ సార్క్‌దేశాలు సన్నిహితమైనప్పుడు అభివృద్ధి కొత్తపుంతలు తొక్కేందుకు ఆస్కారముంటుందని అన్నారు.