అంతర్జాతీయం

‘ఉగ్ర’ దేశంతో చర్చలు అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 29: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంతో చర్చలు ఎలా సాధ్యమవుతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ హంతకులను ప్రశంసిస్తూ వారిని వెనకేసుకొస్తున్నందుకే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘చర్చలకు వెన్నుపోటు పొడుస్తున్నామని మమ్మల్ని నిందిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. నిజానికి పాకిస్తాన్‌తో చాలా పర్యాయాలు చర్చలు మొదలయ్యాయి. అవి అర్ధాంతరంగా నిలిచిపోవడానికి పాక్ వైఖరే ప్రధాన కారణం’ అని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. పాకిస్తాన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్ ద్వైపాక్షిక చర్చల పునరుద్ధరణ జరగాలని భారత ప్రధాని మోదీని ఆహ్వానించారని, అయితే, ఈ ప్రకటన వెలువడిన 24 గంటల్లోపే ముగ్గురు భారత జవాన్లను పాకిస్తాన్ ఆర్మీ పొట్టన బెట్టుకుందని సుష్మా గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఏవిధంగా తోడ్పడతాయని పాక్‌ను ఆమె నిలదీశారు. దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతిసారీ పాక్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తునే ఉన్నామని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారని అన్నారు. అదే తరహాలో పాకిస్తాన్‌తోనూ సత్సంబంధాల కోసం ప్రయత్నించారని తెలిపారు. 2016 డిసెంబర్‌లో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై పాకిస్తాన్‌తో చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేస్తే, జనవరి 2న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పటాన్‌కోట్‌లోని భారత ఆర్మీ బేస్ క్యాంప్‌పై దాడి చేశారని ఆమె చెప్పారు. ప్రతిసారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారత్‌ను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ మరోవైపు భారత్‌లోనే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అమాయకుల ప్రాణాలను హరిస్తున్న ఉగ్రవాదులకు మద్దతునిస్తున్న పాకిస్తాన్ ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని చెప్పారు. ఇప్పటికీ భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాక్ ప్రయత్నిస్తూనే ఉందని సుష్మా ఆరోపించారు. అలాంటి దేశంతో చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
మార్పులు అవసరం
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని భద్రతా మండలిలో మార్పులు అత్యవసరమని సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. ఇందులో శాశ్వత సభ్యత్వం కోసం బ్రెజిల్, జర్మనీ, జపాన్‌తోపాటు భారత్ కూడా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాలు ఈ విషయంలో పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అయితే, ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ స్పందించక పోవడం విచారకరమని సుష్మా అన్నారు. కీలక మార్పులు జరగకపోతే ఐక్యరాజ్య సమితి పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.
అభివృద్ధే ధ్యేయం
దేశంలోని సుమారు 130 కోట్ల మంది ప్రజల అభివృద్ధే ధ్యేయంగా భారత ప్రభుత్వం కృషి చేస్తున్నదని సుష్మా స్వరాజ్ అన్నారు. సాధించగల అవకాశం ఉన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి 17 అంశాల్లో 2030 నాటికి స్వయంసమృద్ధిని సాధించేందుకు మోదీ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నదని ఆమె పేర్కొన్నారు.