అంతర్జాతీయం

చైనాది పక్షపాత వాణిజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 13: చైనా పక్షపాతంతో కూడిన వాణిజ్య విధానాలను అనుసరిస్తోందని, అందువల్లే తన పాలనా యంత్రాంగం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆ దేశంపై ఆంక్షలు విధించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా అమెరికాకు ఎగుమతి చేసే సరుకులపై ట్రంప్ ప్రభుత్వం జూన్ నెల నుంచి క్రమంగా సుంకాలను పెంచుతూ వస్తోంది. అమెరికా, చైనా మధ్య బిలియన్ల డాలర్ల మేరకు ఉన్న వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అమెరికాలోకి చైనా సరుకుల దిగుమతులపై ఆయన అసాధారణ స్థాయిలో ఆంక్షలు విధించారు. చైనాతో వాణిజ్యంలో అమెరికా సుమారు 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును కలిగి ఉంది. ఇంత భారీగా వాణిజ్య లోటును అమెరికా భరించజాలదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓహియోలో శుక్రవారం జరిగిన ఒక ఎన్నికల సభలో ట్రంప్ మాట్లాడుతూ ‘చైనా అనుసరిస్తున్న పక్షపాతపూరితమయిన వాణిజ్యానికి వ్యతిరేకంగా మేము గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకున్నాం’ అని చెప్పారు. చైనానుంచి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. దీంతో దిగుమతి సుంకాలు 250 బిలియన్ డాలర్లు పెరిగాయి. చైనాతో అణు సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యంపైనా కొత్త ఆంక్షలను విధించింది. చైనా తన మేధోసంపత్తిని దొంగిలిస్తోందని అమెరికా ఆరోపిస్తూ, దానికి వ్యతిరేకంగా కూడా చర్యలు తీసుకుంటోంది. చైనా విధానానికి సంబంధించి తన ప్రభుత్వం సాధించిన విజయాలను ట్రంప్ ఓహియో సభలో ఏకరువు పెట్టారు. చైనా దిగుమతులపై ముఖ్యంగా ఉక్కుపై దిగుమతి సుంకాలను పెంచడం వల్ల ఓహియో ఉక్కు పరిశ్రమ, అమెరికా ఉక్కు పరిశ్రమ తిరిగి పుంజుకున్నాయని, త్వరలోనే అత్యంత విజయవంతమయిన సంవత్సరాల స్థాయికి తిరిగి చేరుకుంటాయని ఆయన అన్నారు.