అంతర్జాతీయం

మోదీది ఆధిపత్య ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 26: పాక్, భారత్ మధ్య శాంతిచర్చలు జరపడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ లాయర్ కాదని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (74) వ్యాఖ్యానించారు. పలు ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది నుంచి దుబాయ్‌లో ఉంటూ వైద్య చికిత్స నిమిత్తం పాక్ వచ్చిన ఆయన ‘వాయిస్ ఆఫ్ అమెరికా’తో మాట్లాడారు. తాను పాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సంబంధాలు సర్దుబాటు మార్గంలో ఉండేవన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అప్పటి భారత్ ప్రధానులు అటల్‌బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్‌లతో పలు అంశాలపై చర్చలు జరిపానన్నారు. ఇద్దరు ప్రధానులు వేర్వేరు పార్టీలకు చెందిన వారయినా పాక్‌తో ఉన్న చిరకాల వివాదాలు సమసిపోవాలని కృతనిశ్చయంతో ఉండేవారని ముషారఫ్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యంగా నాలుగు వివాదాల పరిష్కారానికి కృషి జరిగిందన్నారు. వీటిలో సియాచిన్, కాశ్మీర్ సమస్యలు ముఖ్యమైనవని చెప్పారు. ఇరుదేశాలు శాంతిని కోరుకున్నాయని అన్నారు. అయితే ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పరిస్థితి వేరుగా ఉందన్నారు. మోదీ తన ఆధిపత్య ధోరణిని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శాంతిచర్చలు జరపడానికి ఆయన అడ్వకేట్ కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని, అయితే ఈ విషయంలో ఎవరూ భారత్‌ను వేలెత్తి చూపడం లేదని అన్నారు. భారత్ నుంచి పొంచి ఉన్న ప్రమాదం దృష్ట్యా పాక్ అణ్వాయుధ దేశంగా మారిందని ముషారఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా చొరవ తీసుకుని భారత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు. మొదటినుంచి భారత్‌కు అమెరికా మద్దతు ఇస్తోందని, అందుకే ఆ దేశాన్ని తన కూటమిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది తమపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌పై భారత్ పోషిస్తున్న పాత్రపై ఐక్యరాజ్యసమితి పరిశీలించాలని తాము కోరుతున్నామని ముషారఫ్ కోరారు. అమెరికా తనకు అవసరమైనప్పుడు సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వాడుకుని వదిలిపెట్టేస్తోందని, ఈ విషయమై పాక్ పాలకులు అప్రమత్తం కావాలని పాకిస్తాన్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో భారత్ పాత్రపై ఐక్యరాజ్యసమితి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ద్వంద్వ వైఖరి వల్ల పాకిస్తాన్‌కు నష్టం చేకూరుతోందన్నారు.