అంతర్జాతీయం

జపాన్‌ను కుదిపేసిన భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూన్ 18: జపాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, రెండు వందలకుపైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతకు పెద్దపెద్ద భవనాలు ఊగిపోవడం, నీటిపైపులు పేలిపోవడం వంటి సంఘటనలు జరిగినట్టుగా టెలివిజన్ దృశ్యాలను బట్టి స్పష్టమవుతున్నది. దాదాపు 20 లక్షల మంది నివసిస్తున్న ఈ పట్టణంలో అత్యంత జనసమర్థంగా ఉండే సమయంలోనూ భూకంపం సంభవించినట్టుగా అధికారిక కథనాలు వెలువడుతున్నాయి. అయితే, దీని తీవ్రత కారణంగా, భారీ విధ్వంసం ఏదీ జరగలేదని, అలాగే సునామీ హెచ్చరికలు కూడా జారీ కాలేదని అధికార వర్గాలు తెలిపాయి.
కానీ, దీని ప్రభావ తీవ్రత వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ భయవిహ్వలమై నిలిచిపోవాల్సి వచ్చింది. అలాగే, వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మృతి చెందిన ముగ్గురిలో తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. రెక్టార్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప తాకిడికి కూలిపోయిన ఓ గోడ కింద ఇరుక్కొని ఈ బాలిక మరణించినట్టుగా చెప్తున్నారు. అలాగే మరో ఇద్దరిలో 80 ఏళ్ల వృద్ధుడు గోడకూలి మరణించగా, మరో 84 ఏళ్ల వృద్ధుడు ఇంట్లో జరిగిన మరో సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం మీద రెండు వందలకుపైగా గాయపడినట్టు అగ్నిమాపక, విపత్త నివారణ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. భూకంపం నేపథ్యంలో మాట్లాడిన దేశ ప్రధాని షింజో అబే ప్రజలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టామని వెల్లడించారు.
కాగా, భూకంపం తీవ్రత కారణంగా, అనంతర ప్రకంపనలు సంభవించే ప్రమాదం ఉందని ప్రభుత్వ ప్రతినిధి యోషీ హిడే సుగా హెచ్చరించారు. రానున్న రెండుమూడు రోజుల్లో భారీ తీవ్రతతోనే ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భౌగోళికంగా జపాన్ ఉన్న ప్రాంతంలో అత్యంత తీవ్ర స్థాయిలో భూకంపాలు సంభవించడానికి, అగ్ని పర్వత విస్ఫోటనాలకు ఎంతైనా ఆస్కారం ఉంటుందనే విషయం ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడైంది. 2011 మార్చి 11న పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన 9.0 తీవ్రతగల భూకంపానికి వేలాది మంది మరణించడం, భారీ ఎత్తున విధ్వంసం జరగడం తెలిసిందే. అప్పట్లో ఆ భూకంప తీవ్రతకు సునామీ తలెత్తి బీభత్సమే జరిగింది.
అలాగే ఫుకుషియా అణుకర్మాగారంలో భారీ ప్రమాదానికి ఆ భూకంపం కారణమైంది. 1986లో సంభవించిన చర్నోబిల్ తర్వాత అంతే తీవ్రత గలిగిన అణు ప్రమాదంగా ఈ విపత్తును అభివర్ణిస్తారు. ఇలావుంటే, సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో, ప్రజలు విధులకు హాజరయ్యేందుకు, ఇటు రైళ్లు లేదా బస్సులు ఎక్కడానికి వీధుల్లోకి వచ్చిన సమయంలోనే భూకంపం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భూమి తీవ్రంగా కంపించిందని, దీనితో ఒక్కసారిగా భయభ్రాంతులమయ్యామని 50 ఏళ్ల కౌరీ తెలిపాడు. ఒకాసా నగరం ఉత్తర ప్రాంతంలోని మొరిగుచీ ప్రాంతంలో నివాసం ఉంటున్న అతను తన తల్లిదండ్రుల గురించి భయాందోళన చెందినట్టు చెప్పింది. సుమారు 65,000 మందిని పొట్టనపెట్టుకున్న 1995 కొబే భూకంపాన్ని తలపించిందని తెలిపాడు. తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నాడు. కాగా, భూకంపం నేపథ్యంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. అదే విధంగా ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. భారీగా ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు, నగరాన్ని మళ్లీ పూర్వ స్థితికి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.