అంతర్జాతీయం

అమెరికా నిర్బంధ కేంద్రాల్లో 100మంది భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 22: అమెరికాలో అక్రమంగా ప్రవేశించి అరెస్టయిన వారిని రెండు నిర్బంధ కేంద్రాల్లో ఉంచారని, వీరిలో దాదాపు వంద మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అమెరికాలోని ఇండియన్ మిషన్ ప్రకటించింది. వీరిలో చాలామంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారున్నారు. న్యూ మెక్సికో సరిహద్దుల్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో 40 నుంచి 45 మంది భారతీయులు, ఆరిగాన్ డిటెన్షన్ సెంటర్‌లో 52 మంది సిక్కులు, క్రైస్తవులు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. నిర్బంధ కేంద్రాల్లో ఉన్న భారతీయులను సంప్రదించామని భారత్ ఎంబసీ అధికారులు తెలిపారు. ఎంబసీ అధికారి ఈ రెండు నిర్బంధ కేంద్రాలను సందర్శించారు. పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. న్యూమెక్సికో సెంటర్‌లో గత కొన్ని నెలలుగా వీరు నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉన్న వారు ఆశ్రయం అడుగుతున్నారని, తమ సొంత దేశాల్లో హింసను, నిర్బంధ కాండను తట్టుకోలేక వచ్చామని చెబుతున్నట్లు సమాచారం. ఉత్తర అమెరికా పంజాబ్ అసోసియేషన్‌కు చెందిన సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ అమెరికా జైళ్లలో మగ్గుతున్న వారిలో పంజాబీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 2013 నుంచి 2015 వరకు మూడేళ్లలో అమెరికా సరిహద్దుల్లో 27వేల మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 4వేల మంది మహిళలు, 350 మంది బాలబాలికలు ఉన్నారు. ఈ వివరాలను ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ చట్టం ద్వారా సేకరించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నారనే అభియోగంపై 2015లో 900 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఫెడరల్ జైళ్లలో ఉంచారు. మానవ అక్రమ రవాణాదారులకు, అధికారులు, రాజకీయ నేతల మధ్య ఉన్న చట్టవ్యతిరేక సంబంధాల వల్ల పంజాబీ యువకులు భారత్‌ను వదిలి అమెరికాకు వస్తున్నారని ఉత్తర అమెరికా పంజాబీ సంఘం ప్రతినిధి సత్నామ్ సింగ్ చౌహాల్ తెలిపారు. వీరు ఒక్కొక్కరు రూ.35 నుంచి రూ.40 లక్షలు చెల్లించి అమెరికాకు వస్తున్నారన్నారు. మానవ అక్రమ రవాణాకు పంజాబ్‌కుచెందిన వారు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.