అంతర్జాతీయం

ఉగాండాలో హెరిటేజ్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంపాలా, జూలై 25: ఉగాండాలో మహాత్మాగాంధీ అంతర్జాతీయ హెరిటేజ్ సెంటర్‌ను నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని ఇక్కడ నిమజ్జనం చేశారని, ఇందుకు గుర్తుగా ఇక్కడ హెరిటేజ్ సెంటర్‌ను నిర్మించి ప్రపంచానికి గాంధీ త్యాగనిరతి, అహింసామార్గాన్ని చాటి చెబుతామన్నారు. బుధవారం ఇక్కడ ఆయన ఉగాండా పార్లమెంటులో మాట్లాడుతూ, మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటం దక్షిణాఫిక్రాలోనే ప్రారంభమైందన్నారు. ఆఫ్రికన్ల హృదయంలో గాంధీజీకి సుస్థిర స్థానం ఉందన్నారు. వచ్చే ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. భారత స్వాతంత్య్ర సమరపోరాటాన్ని మహత్తర దిశ వైపు తీసుకెళ్లి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన గొప్ప మహనీయుడు గాంధీ అన్నారు. ఆఫ్రికా విముక్తి పోరాటాలకు బీజం వేసిన గాంధీకి ఘనంగా నివాళులు అర్పించేందుకు భారత్ సమాయత్తమవుతోందన్నారు. మోదీ ప్రతిపాదించిన హెరిటేజ్ సెంటర్ ప్రదేశం కంపాలకు 85 కి.మీ దూరంలో జింజా అనే పట్టణం వద్ద ఉంది. ఇక్కడ మహాత్మాగాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఉగాండా పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోదీగా రికార్డు సృష్టించారు. ఆయన మాట్లాడుతూ ఆఫ్రికాలో మహాత్మాగాంధీ 21 సంవత్సరాలు గడిపారన్నారు. మొదటి శాసనోల్లంఘన కార్యక్రమాన్ని ఇక్కడే చేపట్టారన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, జీవన యానం ప్రపంచంలో స్వాతంత్య్ర సాధనకు పోరాడిన ప్రతిదేశానికి మార్గమని చెప్పారు. ఆఫ్రికా విముక్తి కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటం ఉద్వేగభరితమైందన్నారు. భారత్‌కు ఒక్కటే స్వాతంత్య్రం లభిస్తే ఏమి ఉపయోగమని, ఆఫ్రికాతో పాటు ప్రపంచంలో వలసవాదుల పాలనలో ఉన్న అన్ని ప్రాంతాలకు విముక్తి కలగాలని ఆకాంక్షించేవారన్నారు. ఆఫ్రో, ఆసియా దేశాల మధ్య బలమైన సంబంధాలు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయన్నారు. జింబాబ్వే విముక్తికి భారత్ అండగా నిలిచిందన్నారు. గాంధీ అహింసా మార్గం అనేక మంది గొప్ప నేతలకు స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. నెల్సన్ మండేలా, దేస్మండ్ టూటు, ఆల్బర్ట్ లుథిలీ, జూలియస్ నైరీ, వామే నికృమహ్ తదితర గొప్ప మహనీయులు గాంధీ పోరాటంతో ఉత్తేజితులయ్యారన్నారు. గాంధేయ మార్గాన్ని ఆచరించినందు వల్ల కొన్ని అద్భుతమైన విజయాలను ఆఫ్రికా సాధించినట్లు చరిత్ర రుజువు చేసిందన్నారు. ఆఫ్రికా, భారత్ దేశాల ప్రజలు వలస ప్రభుత్వాల్లో తీవ్రమైన ఇక్కట్లకు లోనయ్యారని ఆయన అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఉగాండా పార్లమెంటులో ప్రసంగించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.