ఆంధ్రప్రదేశ్‌

కోడెల సైకిల్ యాత్రలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా గురువారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోట నుండి కోటప్పకొండ వరకు చేసిన సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నరసరావుపేట దాటి మండలంలోని యల్లమంద గ్రామ శివారులో స్పీకర్ కోడెల సైకిల్‌పై నుండి ఒక్కసారిగా కిందపడిపోవటంతో పక్కనే ఉన్న కార్యకర్తలు, పోలీసులు, రోప్‌పార్టీ కంగుతిని, వెంటనే ఆయనను కింద నుండి పైకి లేపారు. కోడెల తలకు, మోకాలికి, మోచేతికి గాయాలై, రక్తం వచ్చింది. కార్యకర్తలు, పక్కనే ఉన్న ఆయన తనయుడు కోడెల శివరామ్ ఆయనకు సపర్యలు చేశారు. అయితే కోడెల తిరిగి మరలా సైకిల్ ఎక్కి కోటప్పకొండ వరకు సైకిల్ యాత్ర కొనసాగించారు. కోటప్పకొండ మెట్ల మార్గం వరకు వచ్చిన స్పీకర్ కోడెల సైకిల్ దిగలేని పరిస్థితి ఏర్పడడంతో పక్కనే ఉన్న పోలీసులు, కార్యకర్తలు ఆయనను సైకిల్ పై నుండి దించారు. అప్పటికే స్పీకర్ కోడెలకు ఎండ దెబ్బ తగలటంతో అక్కడే కుర్చీ వేసి కూర్చోబెట్టారు. కొంతసేపు శ్వాస తీసుకుని, మంచినీరు తాగిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి వెళ్ళారు. వేదికపై కూడా కొద్దిసేపు సేదదీరారు. గాయాలకు ఆయన కుమారుడు ఫస్ట్ ఎయిడ్ చేశారు.
ఏడు పదులు దాటిన
కోడెల సైకిల్ యాత్ర
ఏడు పదుల వయస్సు దాటిన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేయడం ఓ విశేషం. అందులో కోట నుండి కోటప్పకొండ వరకు అంటే 20 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం మరీ విశేషం. భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఏ మాత్రం జంకకుండా సైకిల్ యాత్ర కొనసాగించారు. ఇలాఉంటే కోడెలకు 102 డిగ్రీల జ్వరం ఉంది. బుధవారం విరోచనాలతో కూడా బాధపడ్డారు.
స్పీకర్‌కు చికిత్స
సైకిల్ యాత్రలో భాగంగా మండలంలోని యల్లమంద వద్ద సైకిల్‌పై నుండి కింద పడిన స్పీకర్ కోడెల గురువారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలోని సాయి తిరుమల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఎక్స్‌రేలు తీసి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
చిత్రం.. కోడెల కాలి గాయానికి ప్రథమ చికిత్స చేస్తున్న ఆయన తనయుడు శివరామ్