ఆంధ్రప్రదేశ్‌

రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 2721 పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: రాష్ట్రంలో మొత్తం రూ.16,12,316 కోట్ల పెట్టుబడులతో 2,721 పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయి. ఈ యూనిట్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 36,40,068 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికి మొత్తం 706 పరిశ్రమలు ఉత్పత్తి దశలో ఉన్నాయి. ఇవి 1,47,566 కోట్ల పెట్టుబడులతో 2,99,078 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించాయి. గ్రీస్, రెడ్ కేటగిరీలుగా రెండు రకాల వర్గీకరణతో పరిశ్రమల ట్రాకింగ్ జరుపుతున్నారు. మొత్తం 1041 పరిశ్రమలు గ్రీస్ కేటగిరి దశకు చేరుకున్నాయని, మరో 1680 యూనిట్లు రెడ్ కేటగిరిలో ఉన్నాయని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, అమరనాధ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీస్ కేటగిరికి చేరుకున్న 18 ప్రభుత్వ శాఖలకు చెందిన 1041 పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తి దశకు చేరుకుంటే రూ.4,76,111 కోట్ల పెట్టుబడులతో 8,45,401 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఇందులో 27 పరిశ్రమలు ట్రయల్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 64 యూనిట్లు యంత్రం బిగింపు దశకు చేరుకున్నాయి. రూ.2,10,625 కోట్లు పెట్టుబడులతో మరో 198 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే మరో 2,88,196 మందికి ఉద్యోగ, ఉపాధి దక్కుతుంది. ఇవిగాక, రూ.23,971 కోట్ల విలువ చేసే 46 పరిశ్రమలు పునాదిరాయి వేసుకోబోతున్నాయి. ఇక, రెడ్ కేటగిరిలో ఉన్న మొత్తం 1680 పరిశ్రమలలో రూ.16,529 కోట్ల పెట్టుబడులతో వచ్చిన 51 పరిశ్రమలకు భూకేటాయింపులు, ఇతర అనుమతులను పూర్తి చేసుకున్నాయి. రూ.76,911 కోట్ల పెట్టుబడులతో వచ్చే మరో 429 యూనిట్లకు భూకేటాయింపులు జరగగా, ప్రస్తుతం అవి ఇతర అనుమతుల సాధన దశలో ఉన్నాయి. రూ.2,36,128 కోట్ల మేర పెట్టుబడులతో వచ్చే మరో 300 పరిశ్రమలు భూకేటాయింపులు, అనుమతుల దశలో ఉన్నాయి. ఇంకో 900 యూనిట్లు రూ.8,06,557 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి డీపీఆర్ అందించడానికి సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మాన్ ఆరోఖ్యరాజ్ చెప్పారు. 629 యూనిట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ప్రథమ స్థానంలో నిలవగా, పరిశ్రమల శాఖ 510 పరిశ్రమలతో రెండో స్థానంలో ఉంది. 480 సంస్థలతో ఐటీ మూడవ స్థానంలో నిలిచింది. ఐడీబీ మొత్తం 413 పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చింది. పర్యాటక రంగంలో 194 సంస్థలు ముందుకొచ్చాయి. సీఆర్డీఏ పరిధిలో 98 సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.
చిత్రం..రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పరిశ్రమల పురోగతిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు