ఆంధ్రప్రదేశ్‌

రెండు సీజన్లలో డయాఫ్రం వాల్ పూర్తిచేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంలో అంతర్భాగమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రెండు సీజన్లలో వరద ప్రవాహాలను కూడా దారి మళ్లిస్తూ 414 రోజుల్లో 1396 మీటర్ల పొడవు, 1.50 మీటర్ల వెడల్పు, 93.50 మీటర్ల లోతులో పూర్తిచేసి రికార్డు సృష్టిస్తే ఇదంతా సినిమా అంటూ వ్యాఖ్యానిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ మానసిక రోగిలా కన్పిస్తున్నారంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్సీ, బీటెక్ చదివిన తనకే వింతగా ఉందంటూ అసలు ఆయనేమి చదివాడో ఒక్కసారి ప్రజలకు వివరిస్తే బాగుంటుందన్నారు. జగన్ ఏదో ఉద్దరిస్తాడని తండ్రి వైఎస్ అమెరికాకు పంపిస్తే తిరుగు టపాలో వచ్చేశాడంటూ తనకు లభించిన సమాచారం ప్రకారం కొందరు బీకాం అని, మరికొందరు ఎంబీఏ కోర్సు పూర్తిచేశారని చెబుతున్నట్లు మంత్రి అన్నారు. దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు పారదర్శకత, నిష్టతో వారానికోసారి చొప్పున 63వారాల పాటు ఆన్‌లైన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షిస్తూ అన్ని రకాల వివరాలను తెలియజేస్తున్నారంటూ త్వరలో అక్కడ జరుగుతున్న పనులను కెమెరాల ద్వారా గ్రామాల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూపబోతున్నామన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజక్టుకు 9వేల మంది దేశ, విదేశీ ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, కూలీలు రాత్రి, పగలు పనిచేస్తుంటే బాధ్యతారాహిత్యంతో, దురహంకారంతో జగన్ మాట్లాడుతున్నారంటూ ఒకసారి సైటికెళ్లి చూస్తే బాగుంటుందని మంత్రి సలహానిచ్చారు. 13 జిల్లాల నుంచి 22వేల మంది రైతులు బస్సులో వచ్చి చూశారని ఇక ప్రైవేట్ వాహనాల్లో వేలాది మంది వచ్చి వెళుతూ ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదంటున్నారన్నారు. దీనివల్ల 194 టీఎంసీల నీటి నిలువతోపాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు రాదని తెలుగుదేశంలో చేరకుండా.. అమిత్‌షా జోక్యంతో వైకాపాలోకి వెళ్లలేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం సొమ్ము తమది.. సోకు టీడీపీ ప్రభుత్వానిది అంటారాఅని ఆగ్రహించారు. తాను సీఎం అయి ఇడుపులపాయలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనుకున్న జగన్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుతం రూ.8619 కోట్ల ఖర్చుతో పోలవరం ప్రాజెక్టు, 24వేల కోట్లతో రాజధాని అమరావతి నగర నిర్మాణం జరుగుతుండటం చూసి ఓర్వలేక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు, హైకోర్టులలో కేసులు వేయిస్తే తమ అధికారులకు కోర్టుల చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం పడుతున్నదన్నారు. ఈ విషయాలన్నీ అడుగుతామని భావించే శాసనసభలను బహిష్కరించారని అన్నారు. తొలుత గోదావరి జిల్లాలో నారుమళ్ల కోసం ఈనెల 1వ తేదీ 7500 క్యూసెక్కుల నీటిని వదిలామని, గోదావరి ప్రవాహం పెరిగిన తర్వాత పట్టిసీమ ద్వారా నీటిని తెచ్చి త్వరలోనే కృష్ణాడెల్టాకు నీరు వదలుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 53.33 మిమీ కాగా కృష్ణాలో 91 మిమీ, విశాఖలో 96 మిమీ, తూగో జిల్లాలో 96 మిమీ నమోదు కాగా ఇతర 10 జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్రంలోని నీటి నిల్వలు, వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తే మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో నిత్యం ఏ రాష్ట్రంలో లేని విధంగా బులిటెన్ విడుదల చేస్తున్నామన్నారు.