ఆంధ్రప్రదేశ్‌

కడపలో ‘ఉక్కు’ నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 14: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కడప నగరంలో వామపక్షాలు, టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు తగులబెట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడించారు. ఆందోళనలతో కడప నగరం అట్టుడికింది. రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ నేతలు బీజేపీ నేత కందుల రాజమోహన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కోటిరెడ్డి సర్కిల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు మానవహారం ఏర్పాటుచేసి వాహనాలను అడ్డుకున్నారు. టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పాతబస్టాండులో శవయాత్ర నిర్వహించారు. వైసీపీ నేతలు ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమపై కేంద్రం, ప్రధాని మోదీ జిల్లా వాసులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి కేంద్రం తోడైందని ధ్వజమెత్తారు. జిల్లాను అనాథగా వదిలేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. కరవుకు నిలయంగా ఉన్న కడప జిల్లాలో నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, 10 వేల ఉద్యోగాలు వస్తాయంటూ నిరుద్యోగులు ఆశలు రేపి తీరా మొండిచేయి చూపారని విద్యార్థి సంఘాల నేతలు ధ్వజమెత్తారు. పలువురు నేతలు పోలీసులు అరెస్టుచేసి అనంతరం విడిచిపెట్టారు. కాగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఎలాంటి త్యాగాలకైనా టీడీపీ వెనుకాడదన్నారు. శుక్రవారం జరిగే అఖిలపక్ష సమావేశంలో దీక్షలు తేదీలు ఖరారు చేస్తామన్నారు.

చిత్రం..కడప నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న టీడీపీ నాయకులు