ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 9: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదివాసీలంతా అందిపుచ్చుకుని ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పాడేరు సమీపాన అడారిమెట్టలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన మహిళలతో ముఖాముఖి చర్చించిన సీఎం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు ఏమేరకు ఉపయోగపడతున్నాయన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో ఆదివాసీలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. అయితే పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండే జీవన ప్రమాణాలు, సదుపాయాలు పాడేరు వంటి మారుమూల గిరిజన ప్రాంతంలో కూడా ఉండాలన్నదే తన ఆశయమన్నారు. గిరిజన ప్రాంతంలో సాంకేతిక రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత వాసులకు మరిన్ని సౌకర్యాలను కల్పించాలని యోచిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మారుమూల గిరిజన గ్రామాలలో ఉండే వారు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు ఉండాలని, ఇందుకోసం ఫైబర్ గ్రిడ్‌ను ప్రవేశపెట్టినట్టు ఆయ చెప్పారు. గిరిజనులు తమ టెలివిజన్ సెట్లకు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ పెట్టుకుంటే ప్రపంచాన్ని చూడవచ్చన్నారు. గిరిజన ప్రాంతాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు సెల్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ప్రకృతి సహజ సిద్ధ అందాలు కలిగిన మన్యంలో ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పటికీ మారుమూల ప్రాంత కావడంతో కొన్ని ఇబ్బందులు ఉత్పన్నవౌతున్నట్టు ఆయన అన్నారు. అయితే ఈ ప్రాంతం పర్యాటక రంగానికి ఎంతో అనువైనదని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో పండిస్తున్న కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది తానేనని ఆయన అన్నారు. విశాఖ ఏజెన్సీలో కాఫీతో పాటు పసుపు, జీడిమామిడి వంటి అనేక పంటలను సాగు చేసేందుకు ఎంతో అనుకూలమైనదని, వీటి సాగు పట్ల గిరిజనులు దృష్టి సారించి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న గిరిజనులలో చైతన్యం పెరగాల్సి ఉందని, చాలా సమస్యల పరిష్కారానికి చైతన్యమే దారి చూపిస్తుందని ఆయన అన్నారు. గిరిజన గ్రామాలలో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మిస్తున్నామని, గిరిజనులకు వౌళిక వసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజన బాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో గురుకుల పాఠశాలలను నెలకొల్పినట్టు ఆయన అన్నారు. తమ పిల్లలను బాగా చదివించుకునేందుకు గిరిజనులు ముందుకు రావాలని, చదువుకుంటే జ్ఞానం పెరిగి ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో పథకాలు అమలు చేసి పేదరిక నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గిరిజనులకు ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తున్నామని, ఆదిమజాతి గిరిజనులకు అదనంగా లక్ష రూపాయలు ఇళ్ల నిర్మాణానికి చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ద్విచక్ర వాహనాలతో ఫీడర్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టినట్టామన్నారు. తమ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 1986లో ఆడారిమెట్ట గ్రామానికి వచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ పంచకర్ల రమేష్‌బాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, పలువురు ఉన్నత అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేస్తున్న దృశ్యం