ఆంధ్రప్రదేశ్‌

నేరస్తులకు రాచమర్యాదలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో శాంతిభద్రతలు నశిస్తున్నాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నేరస్తులు, నిందితులకు పోలీసుస్టేషన్లలో కుర్చీలు వేసి కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నారన్నారు. అనంతపురంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆలూరులో ఓ ఎస్‌ఐపై దాడి జరిగితే ఫిర్యాదు చేయలేని దౌర్భాగ్యస్థితి నెలకొందన్నారు. పోలీసులకు వెనె్నముక లేదని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. అంటూ ప్రశ్నించారు. సామాన్యుడు దెబ్బతింటున్నా న్యాయం జరగదని, దేవుడికైనా దెబ్బే గురువని, తప్పు చేసిన వారికి దెబ్బపడాలని అన్నారు. పోలీసుల్లో చేవ తగ్గడానికి రాజకీయాలు కారణమా.. పోలీసుల అసమర్థతా అని ప్రశ్నించారు. ప్రతి దానికీ లాఠీ ఉపయోగించాల్సిన పనిలేదని, అయితే అవసరమైన చోట వాడాల్సిందేనని అన్నారు. పోలీసుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. నిక్కచ్చిగా పనిచేయడానికి ఎందుకు భయపడుతున్నారు, ఎవరి కోసం భయపడుతున్నారు అని అన్నారు. అనంతపురంలో జిల్లాలో పోలీసులు పూర్తిగా దిగజారిపోయారన్నారు. ఇంతగా పోలీసులు నిర్వీర్యమై పోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. అనంతపురంలో దందాలు, దాదాగిరీలు సాగుతున్నాయని, ప్రభుత్వ ఆస్తుల ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు కాజేస్తున్నారని, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. నగరంలోని పీస్ మొమోరియల్ హాల్ పురావస్తుశాఖ పరిధిలో ఉందని, అయితే ప్రైవేటు వ్యక్తులు హోటల్ నిర్వహిస్తూ ఆదాయాన్ని కాజేస్తున్నారన్నారు. తపోవనంలో ప్రభుత్వ స్థలం కబ్జాచేశారని, నగర పాలకసంస్థ భవనాలు, అపార్ట్‌మెంట్ల అద్దెల ఆదాయం దోచేస్తున్నారని అన్నారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు రాతమూలకంగా ఫిర్యాదు చేస్తే మొక్కుబడి సమాధానం ఇస్తూ రాజకీయ నాయకులకు దాసోహం అంటున్నారని జేసీ ఆరోపించారు. వీరిపై ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఎంపీ అన్నారు. అనంతపురం అభివృద్ధిని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి అడ్డుకుంటున్నారని, పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా తన వంతు పాత్ర పోషించడం లేదని, బాధ్యతల్ని విస్మరించిందని అంటూనే అక్రమాలను బయటపెట్టాలని దివాకర్‌రెడ్డి అన్నారు.