ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి వ్యవసాయంలో ఏపీ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై రైతులకు, వ్యవసాయాధికారులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు రోజైన మంగళవారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 3.30 లక్షల మంది రైతులు 3.33 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. 2018 సంవత్సరాన్ని ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించామన్నారు. 2024 నాటికి 60 లక్షల మంది రైతులు 2 కోట్ల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతులు ప్రకృతి వ్యవసాయంలో కొత్త ఆలోచనలకు నాంది పలికి విజయం సాధించారని అభినందించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులే నిజమైన శాస్తవ్రేత్తలని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మాత్రమే తినే రోజులు ఎంతో దూరంలో లేవని, కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టి, వాటిని అమలు చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉన్న 9 లక్షల డ్వాక్రా సంఘాలు, ప్రకృతి వ్యవసాయం పంటలను విక్రయించే బాధ్యతను తీసుకోవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో 2 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. రైతుల సంక్షేమం కోసం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 24 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పంటల్లో క్రిమి సంహారక మందుల వాడకం ఎక్కువైందంటూ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రసాయనాల ద్వారా పండించిన పంట తినడం వలన ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని, భూసారం తగ్గుతోందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వినియోగదారులకు నిజమైన దేవుళ్లని కీర్తించారు. భూమికి ఎనలేని సేవ చేస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతులకు సంక్రాంతికి అవార్డులు ఇస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఇప్పటివరకు 10 లక్షల పంటకుంటలు, లక్ష చెక్‌డ్యామ్‌లు నిర్మించామని తెలిపారు. 57 ప్రాజెక్టులు చేపట్టి 45 పూర్తిచేసే క్రమంలో ఉన్నామని, 40 నదులను అనుసంధానం చేయడానికి శ్రీకారం చుట్టామని, ఈ విషయంలో భారతదేశానికే మనం ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న విజయాలు చూసే ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందిందని, అందరూ గర్వపడేలా ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర రైతులు సాధించిన విజయాలపై అక్కడ ప్రసంగిస్తానని ప్రకటించారు. 2022 నాటికి దేశంలో మూడు ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా 2029 నాటికి ప్రథమస్థానంలో ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఉండేలా కృషిచేస్తానని చంద్రబాబు తెలిపారు. సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రకృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తొలుత ప్రకృతి వ్యవసాయంలో రైతులు సాధించిన విజయాలను అడిగి తెలుసుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చిన రైతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా 13 జిల్లాల నుండి శిక్షణా తరగతులకు సుమారు 10 వేల మంది రైతులు హాజరయ్యారు.
చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు