ఆంధ్రప్రదేశ్‌

విభజన బీజాలు నాటుతున్న టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 20: అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రెండు ప్రాంత ప్రజల్లో విభజన బీజాలు నాటుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో గురువారం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా పార్టీ జాతీయ ప్రథాన కార్యదర్శులు వారణాసి రాంమాధవ్, అరుణ్‌జైన్ ప్రభృతులు హాజరయ్యారు. మీడియాకు దూరంగా జరిగిన ఈ సమావేశంలో ముసాయిదా తీర్మానం, రాజకీయ తీర్మానాలను ఏపీ బీజేపీ నేతలు ప్రవేశపెట్టారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున యువత, రైతులు, నిరుద్యోగులు వలస పోతున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానంగా నీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహించారని, ఎన్నికల సమయంలో గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ-వెలుగొండ తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నేడు అరకొర నిధులు మంజూరుచేసి సీమ ప్రాజెక్టులపై శీతకన్ను వేసిందని బీజేపీ విమర్శించింది. నదుల అనుసంధానకర్తగా చెప్పుకునే ముఖ్యమంత్రి తను పుట్టిన ప్రాంతానికే ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించింది. దక్షిణ భారతదేశంలో వరదలు వెల్లువెత్తుతుంటే, రాయలసీమ మినహా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుంటే, సీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ ఎండిపోవడంతో 80 శాతం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం అధికారికంగా అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలను మెజార్టీ కరవు జిల్లాలుగా ప్రకటించిందంటే ఏ రకంగా కరవు పరిస్థితులున్నాయో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సీమ జిల్లాల్లో 30 శాతం గ్రామాలకు తాగునీరు లేక ట్యాంకర్ల ద్వారా తాగునీరందిస్తున్నారని, పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఉపాధి హామీ పథకం కింద 100 పని దినాలను అమలుచేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 150 రోజులకు పెంచి ఆదుకుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం పేదల నోళ్ళు కొట్టి ఈ నిధులను కాంట్రాక్టర్లకు దారి మళ్ళిస్తోందని సమావేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. సీమలో అన్ని డైరీలను చంద్రబాబు హయాంలో మూసివేశారని విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలకు 10వేల వంతున నష్ట పరిహారం ఇవ్వాలని, వలస వెళ్తున్న కూలీలకు విభజన చట్టం 46, 94 ప్రకారం కేంద్రం నిధులు ఇస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. హైకోర్టు విషయంలో రాయలసీమకు శాసన సభ సాక్షిగా చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ప్రాంతాల మధ్య సమతుల్యం దెబ్బతినకుండా రాయలసీమలో కొన్ని ప్రధానమైన కార్యాలయాలు నెలకొల్పి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రానికి సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా మోకాలడ్డుతోందన్నారు. ఉత్తరాంధ్రలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్-2 పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. మన్యం మరణాలు అరణ్యరోదనగా మారాయని, కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణం ఆయా ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలను నిలువరించలేని పక్షంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలతో కలసి బీజేపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని, 2019 ఎన్నికల్లో ప్రజాగ్రహాన్ని ఓట్ల రూపంలో తెలుగుదేశం చూడటం తథ్యమని బీజేపీ హెచ్చరిస్తున్నట్టు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు తీర్మానించారు. సమావేశంలో బీజేపీ జాతీయ సహాయ కార్యదర్శి జీ సతీష్, జాతీయ కార్యదర్శి మురళీధరన్, పార్టీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్ దేవదార్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, మహిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎంపీలు డాక్టర్ కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ