ఆంధ్రప్రదేశ్‌

మరింత దృష్టి పెడితే అత్యుత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: అధికారులు మరింత నిమగ్నమై, ఎక్కువ దృష్టి కేంద్రీకరించి శ్రద్ధతో పని చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గురువారం ఉదయం వెలగపూడి సచివాలయంలో విభాగాధిపతులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేగా నిధులను 22 శాఖలు ఉపయోగించుకున్నాయని, మిగిలిన శాఖలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాయని ప్రశ్నించారు. ‘మనందరిదీ ఒక బృందం, నేను బృందానికి నాయకుణ్ణి మాత్రమే, ప్రపంచానికే మనదొక నమూనా కావాలి. చరిత్ర సృష్టించే పనిలో మనం ఉన్నాం. గతంలో అధికారులను తిడితే జనం చప్పట్లు కొట్టేవారు, ఇప్పుడు ట్రెండ్ మారింది. పని చేసే అధికారిని పొగిడితే చప్పట్లు మార్మోగిపోతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ మారిన యంత్రాంగం పని తీరుకు ఇదే నిదర్శనం. ఈ ప్రభుత్వంలో అధికారులకు గౌరవం పెరిగింది, నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘పనిలో శ్రద్ధ ఉండాలి, అమలులో సామర్థ్యం చూపాలి, జన జీవన నాణ్యత పెంచాలి, ఇప్పటి వరకు చేసిన దానికి సంతోషం, కానీ చేయాల్సింది చాలా ఉందనేని గుర్తుంచుకోవాలి. మనం అమలు చేస్తున్న పథకాలపై మన పనితీరుపై ప్రజలను ఒప్పించగలిగినప్పుడు సానుకూల ఫలితాలు సాధ్యం’ అని ముఖ్యమంత్రి అన్నారు. అనేక ప్రామాణికాల్లో మన రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అందరం కలిసి సమష్టిగా పని చేయడం వల్లనే అనేక విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని, ఇందుకు అధికారులు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గతంలో పంచాయతీరాజ్ శాఖకు 17 అవార్డులు వచ్చాయని, ఇప్పుడు గృహ నిర్మాణ శాఖకు 15, ఇంధన శాఖకు 10 అవార్డులు వచ్చాయని, గత నాలుగేళ్లలో 550 పైగా పురస్కారాలు వరించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గ్రామదర్శినికి ఒకసారి వెళ్తేనే 3 శాతం సంతృప్తి పెరిగిందని, రెండుమూడు పర్యాయాలు పల్లెలను సందర్శిస్తే పది శాతానికి పైగా సంతృప్తి సాధ్యమన్నారు. ‘నాయకుడు ఎప్పుడూ ఒక నమూనాగా ఉండాలి, ప్రతికూలతకు నాయకుడు నమూనా కారాదు. సానుకూలతకు నమూనాయే నాయకుడు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ త్రైమాసికంలో 11.25 శాతం వృద్ధిరేటు సాధించామని, లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడి పని చేసి నాలుగేళ్ల క్రితం ఉన్న ఇబ్బందులను అధిగమించినట్లు తెలిపారు. గ్రామదర్శినిలో తక్కువ సంతృప్తి శాతం వచ్చిన విశాఖ, కడప లాంటి జిల్లాలు తమ పనితీరును మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. గ్రామదర్శినికి వెళ్లే ముందు మంత్రులు, కార్యదర్శులందరికీ ఎక్కడ ఎక్కువగా దృష్టి పెట్టాలో అనే అంశంపై ఒక కార్యక్రమం తయారు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రాధాన్యత, దృక్పథం ముఖ్యమని ఆయన తెలిపారు. ‘మనం అన్ని కార్యక్రమాలలో నెంబర్ 1గా ఉండాలి, ఏ రాష్ట్రం అయితే మనకంటే ముందున్నదో, నెంబర్ వన్‌గా ఉందో, అధ్యయనం చేయండి, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్వయించుకుని పని చేయండి’ అని చంద్రబాబు సూచించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ రైతుకు పంట దెబ్బతింటే రైతు నష్టపోకుండా బీమాను ఉపయోగించి ఇన్‌పుట్ సబ్సిడీని ఇద్దామని అన్నారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అమరనాథరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జీ సాయిప్రసాద్, కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..విభాగాధిపతులు, కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు