ఆంధ్రప్రదేశ్‌

ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రబీకి విత్తనాలు సిద్ధం చేయండి
* అధికారులకు సీఎస్ ఆదేశాలు
* నీరు-ప్రగతి పురోగతిపై సమీక్ష

****************************
అమరావతి, సెప్టెంబర్ 24: ఈ-క్రాప్ నమోదు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. నీరు-ప్రగతి పురోగతిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు జిల్లాల్లో సగటు వర్షపాతం 40 శాతం తక్కువ నమోదైందని, కోస్తాంధ్రలో రెండు శాతంతో కలుపుకుని రాష్టవ్య్రాప్తంగా సరాసరిన 14 శాతం తక్కువ నమోదయిందని వివరించారు. ఇన్‌పుట్ సబ్సిడీ పెంపు, పత్తికి మద్దతుధరను ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో ఈ-క్రాప్ నమోదు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. రబీకి ముందస్తుగా విత్తనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సెనగ, వేరుసెనగ విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పంట రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టంచేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందించి రబీలో పెట్టుబడికి ఇబ్బందులు కలుగకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్వారంగం అభివృద్ధి పనులు వేగవంతం కావాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఆక్వా రైతాంగానికి విద్యుత్ సబ్సిడీ అందించాలన్నారు. కౌలురైతులకు కూడా ప్రయోజనం కల్పించాలని, ఆక్వా నాణ్యత పెంచి కాలుష్యాన్ని నియంత్రించటంతో పాటు యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించేలా రైతులను చైతన్య పరచాలన్నారు. రెండు నెలల్లో చెరువుకట్టలను పటిష్టం చేయాలన్నారు. గత సెప్టెంబర్ కంటే ప్రస్తుతం భూగర్భజలాల మట్టం 0.6 మీటర్ల దిగువన ఉన్నాయని 12.19 మీటర్ల లోతున లభ్యమవుతున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య లోపం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డ్రెయిన్లలో పూడికతీతను ఎప్పటికప్పుడు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం వైద్య,ఆరోగ్యం, మునిసిపల్, పంచాయతీరాజ్‌శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాంటీ లార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని నిర్దేశించారు. డెంగీ, మలేరియా, ఇతర వైరల్ జ్వరాలు అదుపులో ఉంచాలన్నారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పనులు ఈ నెలలో మందకొడిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు 13వేల ఇళ్ల నిర్మాణమే జరిగిందని, 25 నుంచి 30వేల లోపు నెలకు టార్గెట్ ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. బిల్లుల మంజూరులో జాప్యం చేయవద్దన్నారు. వచ్చేనెల 2 నాటికి రెండులక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించే యోచనతో ప్రభుత్వం ఉందని అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలన్నారు. నరేగాలో మెటీరియల్ కాంపొనెంట్ నిధుల వినియోగం పెరగాలని సూచించారు. రూ 880 కోట్ల మేర వినియోగించాల్సి ఉందని, వీటిని జనవరి నాటికి పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. అంగన్‌వాడీ భవన నిర్మాణంలో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తంచేశారు. శరవేగంతో నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతిగ్రామంలో ఘన, ద్రవ, వ్యర్థాల నియంత్రణ, జలసంరక్షణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామీణ జీవనప్రమాణాల మెరుగుదలకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు రాజశేఖర్, మురళీధర్‌రెడ్డి, జవహర్‌రెడ్డి, గోపాలకృష్ణ ద్వివేది, రాంశంకర్ నాయక్, పూనం మాలకొండయ్య, కాంతీలాల్ దండే, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్‌సిటీలపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ పట్టణ వౌలిక సదుపాయాలు స్థిరాస్తి నిర్వహణ సంస్థ (ఏపీయూఐఏఎంఎల్) సమావేశంలో స్మార్ట్‌సిటీలపై దినేష్‌కుమార్ సచివాలయంలో సమీక్ష జరిపారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాల అభివృద్ధితో పాటు ఇటీవల ప్రకటించిన ఏలూరు స్మార్ట్‌సిటీ, ఇతర పట్టణ ప్రాంత ప్రాజెక్టులపై సమీక్షించారు. విజయవాడలో ఏర్పాటవుతున్న జక్కంపూడి ఎకనామిక్ సిటీ తొలిదశ పనులపై చర్చించారు. విజయవాడ నగరంలో రూ. 90కోట్ల అంచనాతో 24గంటల మంచినీటి సరఫరాకు నిర్దేశించిన స్మార్ట్ రిలయబుల్ వాటర్ సప్లయి గురించి సీఎస్ ఆరాతీశారు. పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక అంశా లు ప్రస్తావనకు వచ్చాయి.