ఆంధ్రప్రదేశ్‌

గడువు తరుముకొస్తున్నా సాగని పుష్కర పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: ప్రజల సొమ్ము కృష్ణానది పాలవుతోంది. పుష్కరాల పేరుతో రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయో? అవి ఎలా జరుగుతున్నాయో? నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో? పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయో, లేదో? అని తెలుసుకునేవారే కరవయ్యారు. నగరంలో జరుగుతున్న పుష్కర పనులను చూసిన వారెవ్వరైనా ముక్కున వేలేసుకోవలసిందే. అధికారులు, ప్రజాప్రతినిధుల నిఘా, పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. నాణ్యతాలోపం ఓపక్క పుష్కర పనులకు శాపంగా మారితే, మరోపక్క నిర్ణీత సమయానికి పనులు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడం అందరినీ కలవరపెడుతోంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. ఈలోగా పనులు పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సుమారు 1200 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఇందులో మూడోవంతు నిధులను కూడా అధికారులు ఖర్చుచేయలేదు. అలాగే పనులు కనీసం 50శాతం కూడా పూర్తికాలేదంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. పుష్కరాల సమయం ముంచుకు వస్తున్నా ఏ శాఖలోనూ 50శాతం పనులు కూడా పూర్తికాలేదు. దుర్గగుడికి సమీపంలో ఉన్న దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీనికితోడు వర్షాలు కురుస్తున్నాయి. పుష్కర ఘాట్లను కృష్ణానది వైపునకు పెంచి నిర్మిస్తున్నారు. ఇవి చాలా నాశిరకంగా ఉన్నాయి. మెట్లు ఒక పద్ధతిలో లేవు. వాటిపై టైల్స్‌ను మొక్కుబడిగా అతికిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల టైల్స్ లేచిపోగా, కొన్నిచోట్ల విరిగిపోయాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడికి టైల్స్ అన్నీ శిథిలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే దుర్గాఘాట్ దగ్గర మోడల్ గెస్ట్‌హౌస్‌ను కంట్రోల్ రూంగా మార్చేందుకు కొద్దిరోజుల క్రితమే పనులు మొదలుపెట్టారు. ఓపక్క నుంచి కూల్చివేత పనులు జరుగుతుంటే మరోపక్క నిర్మాణం, దానికే రంగులు అద్దే పని శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాణ్యత ఎంత ఉంటుందో అధికారులే చెప్పాలి. ఇదిలావుంటే, పుష్కరాలకు నదిలో నీరుండే పరిస్థితి కనిపించకపోవడంతో ఘాట్ల వద్దకు నీటిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా బ్యారేజ్ నుంచి నీటిని వదిలి ఘాట్ వద్దకు మళ్లించనున్నారు. ఇందుకోసం నదిలోనే ఒక బెడ్ నిర్మిస్తున్నారు. ఇది నెలరోజుల్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే దుర్గాఘాట్‌ను ఆనుకుని నాలుగు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇది పుష్కరాల నాటకి పూర్తవుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తవౌతోంది. మరోపక్క పుష్కరాలకు ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తామన్నారు. అది సాధ్యం కాకపోవడంతో దాన్ని పక్కన పెట్టేశారు. నగరంలో రోడ్ల నిర్మాణం అత్యంత దారుణంగా మారింది. ఇందులో కూడా ఏమాత్రం నాణ్యత లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా విజిలెన్స్ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారో అంతుచిక్కటం లేదు.
దుర్గఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్ పక్కనే హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. నదిలో స్నానాలు చేసిన వారంతా ఆ స్తంభం వద్దనే ఉంటారు. ఇది ప్రమాదమని అధికారులింకా గుర్తించలేదు. పుష్కర పనుల పరిశీలనకు నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి నియమించారు. కృష్ణా జిల్లాకు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, గుంటూరు జిల్లాకు ప్రత్తిపాటి పుల్లారావు, కర్నూలుకు సిద్దా రాఘవరావును నియమించారు. మిగిలిన మంత్రులు మాటెలా ఉన్నా, కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు మాత్రం పుష్కర పనులపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి పదేపదే పుష్కర పనులపై సమీక్షలు జరుపుతున్నారు. స్వయంగా ఘాట్లకు వచ్చి పరిశీలిస్తున్నారు. కానీ ఏమాత్రం ప్రగతి లేకపోడానికి అధికారులు, మంత్రులే కారణమని చెప్పకతప్పదు.
అక్కడ హారతి ఏంటి?
గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి నదికి నిత్యహారతి ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కృష్ణానదికి కూడా నిత్యహారతి ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఈ హారతిని ఇబ్రహీంపట్నం దగ్గరున్న కృష్ణా, గోదావరి నదీసంగమ ప్రాంతంలో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 19 నుంచి హారతిని ఇవ్వాలనుకున్నారు. కానీ ఘాట్ల నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇబ్రహీంపట్నం విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది విజయవాడ, లేదా గుంటూరుకు వెళతారు. దుర్గాఘాట్, పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్‌లో ఎక్కడైనా నిత్యహారతి ఇస్తే సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. దుర్గాఘాట్ వద్ద కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నిత్యహారతిని కొనసాగించడానికి కూడా బాగుంటుంది. ఇబ్రహీంపట్నం ఘాట్ దుర్గగుడి వెనుక భాగంలో వస్తుంది. అక్కడ హారతి ఇవ్వడం సరికాదని పండితులు చెపుతున్నారు. హారతి విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.