ఆంధ్రప్రదేశ్‌

ఏపీ కేబినెట్ @26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తరించారు. మంత్రివర్గంలో కొత్తగా మరో ఇద్దరు సభ్యులు చేరారు. కొత్త మంత్రులుగా ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్ పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అట్టహాసంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా తొలుత కొత్త మంత్రుల పేర్లు చదివి వినిపించారు. అనంతరం ఫరూక్, శ్రావణ్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రివర్గ సభ్యుల సంఖ్య 26కి చేరింది. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా ఉదయం 11.45 గంటలకు గవర్నర్ కొత్త మంత్రులతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్ చిన్ననాటి నుంచి రాజకీయ రంగంలో అపారమైన అనుభవం గడించారు. ఇంతకాలం రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఆయనకు వైద్యవిద్య, ఎన్టీఆర్ వైద్యసేవ, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఫుడ్ సేఫ్టీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. మరో మంత్రి శ్రావణ్‌కుమార్ విశాఖపట్నం జిల్లా అరకు మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు తనయుడు. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఐఐటీ పూర్తి చేశారు. అతిచిన్న వయస్సులోనే మంత్రి పదవి పొందారు. ఆయనకు గిరిజన సంక్షేమ శాఖ, ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిధాన పరిషత్, డ్రగ్ కంట్రోల్, ఆయుష్ శాఖలను ముఖ్యమంత్రి కేటాయించారు. కాగా ఇప్పటివరకు గిరిజన, సాంఘిక సంక్షేమ బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా ఆనందబాబుకు గిరిజన సంక్షేమ శాఖను తప్పించిన ముఖ్యమంత్రి అదనంగా సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు.
ప్రమాణస్వీకారోత్సవానికి ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఆదినారాయణరెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి ఫరూక్ అల్లాపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించగా, కిడారి శ్రావణ్ ఆంగ్లంలో ప్రమాణపత్రం చదివారు. తెలుగులో ప్రమాణం అనే పదంతో పాటు మధ్యలో కొన్ని పదాలు పలికే విషయంలో మంత్రి ఫరూక్ తడబడ్డారు.

చిత్రాలు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్