ఆంధ్రప్రదేశ్‌

సిట్ నివేదికలో క్రిమినల్ కేసుల సిఫార్సును అంగీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 11: విశాఖ భూ కుంభకోణంలో దోషులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సిఫారసులను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదంటూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీఆర్‌ఎస్‌ఏ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం జరిగిన ఏపీఆర్‌ఎస్‌ఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించినట్టు ఆయన వెల్లడించారు. రెవెన్యూలో భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, వాటిని ఐఏఎస్‌లు మాత్రమే పరిశీలించి తప్పొప్పులు నిర్ధారించగలరన్నారు. అయితే విశాఖ భూ కుంభకోణంలో దర్యాప్తు క్రిమినల్ కోణంలోనే జరిగిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సిట్ దర్యాప్తు కూడా పూర్తిగా ఐపీఎస్ కనుసన్నల్లోనే జరిగిందని, అందుకే వారు ఈ వ్యవహారాన్ని క్రిమినల్ దృక్పథంతోనే పరిగణించి, క్రిమినల్ కేసులను సూచించారన్నారు. భూ వ్యవహారాల్లో తప్పిదాలుంటే శాఖా పరమైన దర్యాప్తు, అదే కోణంలో శాఖాపరంగా షోకాజు నోటీసులు, సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, పదోన్నతుల నిలుపుదల వంటి చర్యలను మాత్రమే సూచించాలన్నారు. క్రిమినల్ చర్యలు అంగీకారం కాదన్నారు. న్యాయపరంగా కూడా సిట్ సూచించిన క్రిమినల్ చర్యలు రెవెన్యూ వర్గాలను ఇబ్బంది పెట్టలేవన్నారు. క్వాజీ జుడీషియల్ అధికారం రెవెన్యూ విభాగానికి మాత్రమే ఉందని బొప్పరాజు గుర్తు చేశారు. కిందిస్థాయి అధికారి తప్పిదం చేస్తే ఉన్నతాధికారి వరకూ అంచెలంచెలుగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్ దర్యాప్తు చేసిన వాటిలో అత్యధికం అప్పీల్‌కు వెళ్లినవేనని, వీటిలో రెవెన్యూ చట్టాలను అనుసరించే చర్యలు ఉంటాయన్నారు. రెవెన్యూలో దస్త్రాల మాయం, చిన్న తప్పుల సవరణ, కొట్టివేతలను కూడా తీవ్రంగా తీసుకుని క్రిమినల్ కేసులకు సిఫారసు చేయడం దారుణమన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిని ఉపేక్షించమని తాము డిమాండ్ చేయట్లేదని చెప్పుకొచ్చారు. సిట్ దర్యాప్తులో రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసుల సిఫారసు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో విచారణ జరిపించేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఏపీఆర్‌ఎస్‌ఏ భవన నిర్మాణానికి 25 సెంట్లు భూమిని కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు