ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంటులో చట్టం తెచ్చినా అమలులో నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంకొండ, నవంబర్ 21: గతంలో కాంగ్రెస్ హయాంలో పార్లమెంటులో చట్టం తెచ్చిన అంశాలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ, గుర్రంకొండలో ఆయన పర్యటించారు. గుర్రంకొండలోని కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, అత్మీయులు పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో చట్టం తెచ్చిన అంశాలు అమలు చేయకపోవడంతో పార్లమెంటుపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితులు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో బీజేపీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం చేసిందని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న 11 జాతీయ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఆరు మాత్రం ఇచ్చారన్నారు. సంస్థలకు రూ.11,700 కోట్లు ఇవ్వాల్సి వుండగా కేవలం రూ.600 కోట్లు మాత్రం ఇచ్చిందని ఆయన తెలిపారు. విభజన హామీలు అమలు చేస్తారనే నమ్మకంతో బీజేపీని గుడ్డిగా నమ్మి టీడీపీ పూర్తిగా మోసపోయిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ అమలు, బంగారుతల్లి పథకం, హంద్రీ నీవా సుజల స్రవంతి చిత్తూరు జిల్లా తాగునీటి వర ప్రదాయని అయిన కండలేరు పథకాన్ని పక్కన పెట్టారని ఆయన అన్నారు మహిళలు, రైతులుకు పావలా వడ్డి రుణాలతోపాటు రుణమాఫి అమలు కావడం లేదని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాకు రానున్న 50 సంవత్సరాల తాగునీటి ఇబ్బందులును దృష్టిలో పెట్టుకుని కండలేరు జలాశయం నుంచి 6.5 టిఎంసిల నీటిని వాడుకునే విధంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కండలేరు పథకాన్ని రూపొందించి జివోను విడుదల చేసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో హైదరాబాదులో చికిత్స తీసుకున్న వారు అనర్హులు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని, పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో చికిత్స పొందడం తప్పెలా అవుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ప్రాంతీయ పార్టీలు పనిచేయాలని, ఆ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి చంద్రబాబునాయుడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపిఎ కూటమితో పని చేయాలనుకోవడం స్వాగతించదగిన పరిణామమని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్నాయని, నవ్యాంధ్రలో పొత్తుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. తాను ప్రస్తుతం ఒక సామాన్య కార్యకర్తలా నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపెతానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పార్టీ కార్యాలయాన్ని కలికిరిలో ఏర్పాటు చేస్తానని, త్వరలో ప్రతి గ్రామాన్ని పర్యటించి అందరిని కలుసుకుంటానని ఆయన తెలిపారు.

చిత్రం..తరిగొండలో పర్యటిస్తున్న మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి