ఆంధ్రప్రదేశ్‌

అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడనుంది. పాలనా నగరంలో ప్రధానమైన సచివాలయ నిర్మాణ పనులు ఈనెల 17వ తేదీ నుంచి వేగిరం కానున్నాయి. ఐదు టవర్లుగా నిర్మిస్తున్న ఈ సచివాలయం కోసం అదేరోజు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌గా ఇది అరుదైన రికార్డు సృష్టించనుంది. మొత్తం 12వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరుగుతుందని, దేశంలోనే ఈ తరహా భారీ నిర్మాణం ఇదే అని బుధవారం సాయంత్రం ప్రజావేదికలో జరిగిన సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యంత భారీ భవంతులకు దీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించి ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా అంతే స్థాయిలో చేపడుతున్నామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్ ఫోస్టర్‌కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ సచివాలయం కోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను సీఆర్డీఏకు అందించింది. ఈ ఐదు టవర్లను ఒకే ర్యాఫ్ట్ ఫౌండేషన్‌పై నిర్మిస్తున్నామన్నారు. అందుకోసం వేలమంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్దీ నిర్మాణ సామాగ్రిని వినియోగిస్తున్నామని చెప్పారు. ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ అద్భుత ప్రణాళిక, సీఆర్డీఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏకధాటిగా పూర్తిచేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని వివరించారు. హ్యాపీనెస్ట్‌కు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి స్పందన వస్తోందని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. ఇదే తరహాలో మరో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమత్రి అనుమతించారు. హైకోర్టు నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని అధికారులు వివరించారు. నేలపాడు రెవెన్యూ పరిధిలో 24 గంటలు పనులు జరుగుతున్నాయి. నిత్యం 16 వందల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. భవనం లోపల 23 కోర్టు హాళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో పోస్ట్ఫాస్, బ్యాంక్ ఏర్పాటు కానుందని చెప్పారు. అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్ట్‌ను నీరుకొండలోని ఎత్తయిన పర్వత ప్రాంతంపై నిర్మించనున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనలపై ఎల్ అండ్ టీకి చెందిన డిజైన్స్ అసోసియేట్స్ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పరిశీలించారు. మొత్తం ప్రాజెక్ట్‌కు రూ 406 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలా వరకు విరాళాలు సేకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్ట్‌ను పర్యాటకంగానే కాకుండా ఈ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్య కూడలిగా రూపొందించడం ద్వారా సొంత ఆదాయం సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్థసారధికి సూచించారు. ఎన్టీఆర్ కాంశ్య విగ్రహం ఏర్పాటుకు సమావేశంలో పలువురు ప్రతిపాదించారు. కాంక్రీట్ విగ్రహం కంటే ఇది 30 శాతం ఎక్కువ ఖర్చు అయినప్పటికీ దీర్ఘకాలం మన్నిక ఉంటుందని తెలిపారు.
విగ్రహ నిర్మాణానికి రూ 155 కోట్లు ఖర్చవుతుందని పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే నిర్మిత ప్రాంతానికి మరో 112.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. విగ్రహం లోపలిభాగంలో పై వరకు వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. లోపల ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు కానుంది. ప్రాజెక్ట్‌లో భాగంగా వాటర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ప్రత్యేక రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఆడిటోరియం, ఫెర్రీ, సెల్ఫీపాయింట్, కేఫ్, యాంఫీ థియేటర్, ఆహ్లాదాన్ని అందించే రైలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అక్కడే స్టార్ హోటల్, షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లు, రిసార్టులు నెలకొల్పుతారు. ఇప్పటి వరకు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఎత్తయిన విగ్రహంగా ఉందని, ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహం 253 అడుగుల ఎత్తుతో పటేల్ విగ్రహాన్ని మించుతుందని అధికారులు వివరించారు. కొండపై ఏర్పాటుచేసే విగ్రహం కనుక ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్ట్‌కు వాటిని మించిన ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. 46 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తిచేయగలమని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. నీరుకొండను ద్వీపం తరహాలో అభివృద్ధి చేయాలని, విగ్రహం కోసం 14 ఎకరాలు, రిజర్వాయర్ అభివృద్ధికి మరో 70, 80 ఎకరాలతో పాటు మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాంతం మొత్తాన్ని పర్యాటక ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఆర్డీఎ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. సీఆర్డీఏ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు* నీరుకొండలో నిర్మించనున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నమూనా చిత్రాలు