ఆంధ్రప్రదేశ్‌

రైతుల నడ్డి విరిచిన ‘పెథాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/గుంటూరు: పెథాయ్ తుపాను కృష్ణా, గుంటూరు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యంగా పంట చేతికందే దశలో దాదాపు లక్ష ఎకరాల్లో వరి రైతులకు భారీ దెబ్బ తగిలింది. చేతికందుతున్న పంట అకాలవర్షంతో చేజారుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు దైన్యంగా చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన పెథాయ్ ముప్పు ఈ జిల్లాలకు తప్పినా రైతాంగం మాత్రం తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. ఇతరత్రా నష్టం లేకున్నా కోతకు వచ్చిన, పనల మీద ఉన్న వరి పంట దెబ్బతింది. పంట నష్టం మినహా ఇతరత్రా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. గడిచిన 24 గంటలుగా పెథాయ్ తుఫాన్‌తో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురిసాయి. రెండు జిల్లాల్లో లక్షకు పైగా ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా డెల్టాలో 46 వేల హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. కోతకోసిన 7,316 హెక్టార్లలో ఓదెలు నీటమునగగా, 38,664 హెక్టార్లలో వరిపంట ఈదురుగాలులు, భారీవర్షాలకు నేలవాలింది. గుంటూరు జిల్లాలో చుండూరు మండలంలో అత్యధికంగా 92.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వేమూరులో 87.8, పిట్టలవానిపాలెంలో 86.4, కొల్లిపరలో 81.4, అమృతలూరులో 78.4, నిజాంపట్నం 70.8, రేపల్లెలో 67.8, నగరంలో 66.6, తెనాలిలో 65.2, దుగ్గిరాలలో 61.8, కొల్లూరులో 61.2, చెరుకుపల్లిలో 58.6, మంగళగిరిలో 58.4, కర్లపాలెంలో 53.6, భట్టిప్రోలులో 52.7, రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో 50.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇలా ఉండగా పల్నాడు ప్రాంతంలోని ముప్పాళ్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో భారీవర్షాలతో కల్లాల్లో ఎండబెట్టిన మిర్చి తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. వర్షానికి చలిగాలులు తోడవడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాలోని 14 మండలాల్లో 8 వేల 231 హెక్టర్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల ప్రభావంతో 3 వేల 984 ఎకరాల పంట నేలకొరగగా, 4 వేల 247 ఎకరాల్లో పనల మీద ఉన్న పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖాధికారులు గుర్తించారు. అధిక శాతం మచిలీపట్నం, గూడూరు, బంటుమిల్లి, ముదినేపల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లో వరి పనలు నీట మునిగినట్లు సమాచారం. అయితే దీని వల్ల ఎటువంటి పంట నష్టం ఉండదని అధికారులు తెలుపుతున్నారు. నీట మునిగిన పంటను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 38 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 4 వేల 942 మంది బాధితులకు పునరావాసం కల్పించి భోజన వసతి కల్పించారు. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి 60 నుండి 70 కిలో మీటర్ల మేర ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతోనే పంట నేలకొరిగింది. నష్టం అంచనాల్లో వ్యవసాయ శాధికారులు తలమునకలయ్యారు. గ్రామాల వారీగా నీట మునిగిన పంట వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేశారు. రాత్రి పూట కూడా కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వీరు ఇరువురు బందరు, గూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంటను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.
చిత్రాలు.. గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో నీళ్లలో నానుతున్న వరి ఓదెలు, వర్షాలకు నేలవాలిన వరి చేను, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పత్తిచేలోకి చేరిన వర్షపు నీరు