ఆంధ్రప్రదేశ్‌

ఉప రాష్ట్రపతి పదవి కోరుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జనవరి 9: భారత ఉప రాష్ట్రపతి పదవి తాను కోరుకోలేదని, చివరి నిమిషంలో అంగీకరించాల్సి వచ్చిందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ శ్రీరామపురం గ్రామంలో బుధవారం జరిగిన తన అత్త అల్లూరు కౌసల్యమ్మ దిశదిన కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కౌసల్యమ్మ సంతాప సభలో వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికల తరువాత రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పి స్వర్ణ్భారత్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ఉన్నానని, అనుకోని తప్పని పరిస్థితుల్లో తాను ఉప రాష్ట్రపతిని అయ్యానన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నదే తన లక్ష్యమన్నారు. తాను అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగిందన్నారు. తన జీవితంలో అనుకున్నవి, అనుకోనివి అన్నీ సాధించానన్నారు. ఒక్క తల్లి ప్రేమ తప్ప జీవితంలో తనకు ఏ లోటూ లేదన్నారు. అమ్మ ప్రేమను అత్త కౌసల్యమ్మ, అమ్మమ్మలు తీర్చారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ వదులుకోలేదన్నారు. పార్టీ ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే అంచెలంచలుగా ఎదిగి దేశంలో రెండో రాజ్యాంగ అత్యున్నతమైన పదవి అయిన ఉప రాష్ట్రపతి అయ్యానన్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు మంచి ప్రాముఖ్యం ఉందన్నారు. కుటుంబ వ్యవస్థలో ఉన్న మాధుర్యం వెలకట్ట లేనిదన్నారు. తాను ప్రపంచాన్ని, దేశాన్ని లోతుగా పరిశీలించానని, అతి కొద్దిమంది మాత్రమే కౌసల్యమ్మ లాంటివారు ఉంటారన్నారు. ఆదర్శమైన మాతృమూర్తి, కుటుంబ పెద్ద ఎలా ఉంటారో ఆమే నిదర్శనమన్నారు. అత్యవసర పరిస్థితి విధించిన రోజుల్లో తాను జైల్లో ఉంటే తన కుటుంబాన్ని ఆమె బాగా చూసుకున్నారన్నారు. తన అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఆమె పాత్ర ఉందన్నారు. ఆమె పంచిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనంటూ వెంకయ్యనాయుడు ఉద్విగ్నభరితంగా చెప్పారు. తాను జీవితచరిత్ర రాస్తే అందులో కౌసల్యమ్మ పేరు తప్పక ఉంటుందని ఆయన వెల్లడించారు. తాను అన్నీ సాధించినా పడిపోతున్న ప్రమాణాలు, గ్రామాలకు, పట్టణాలకు పెరుగుతున్న అంతరం, కుటుంబ వ్యవస్థ బలహీనం కావటం, రైతులు వ్యవసాయాన్ని వదలి పట్టణాలకు వలసలు వెళ్లటం, పెరుగుతున్న పాశ్చాత్య వ్యామోహం వంటివి తనకు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. అయితే ఈ అంశాల్లో మార్పు తేవాలంటే తన ఒక్కడి వల్ల సాధ్యం కాదన్నారు. ప్రజలంతా సత్ప్రవర్తనతో సమాజానికి మేలు చేసే విధంగా మెలగాలని ఆయన ఆకాంక్షించారు. సంతాప సభలో ఉప రాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, కుమారుడు హర్షవర్ధన్, కోడళ్లు రాధమ్మ, కుమారై దీపావెంకట్, అల్లుడు వెంకట్, బావమరిది అల్లూరు భాస్కర్‌నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఉన్నారు.

చిత్రం..సంతాప సభలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు