ఆంధ్రప్రదేశ్‌

యావత్ ప్రపంచం చూపు.. నవ్యాంధ్ర వైపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 11: నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, స్వయం కృషి, పట్టుదలతో ఇది సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన రోజు నాటి దిక్కుతోచని పరిస్థితి నుంచి ఇపుడు అద్భుత ప్రగతి దిశగా దూసుకెళుతున్నామని ఉద్ఘాటించారు. జన్మభూమి - మావూరు కార్యక్రమంపై శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నడూలేని సంతృప్తి సాధించామన్నారు. అధికార యంత్రాంగం ప్రజలతో మమేకమై ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవటంలో కృతకృత్యులయ్యారని ప్రశంసించారు. ఇదే నిజమైన సంక్రాంతి అని, ఇది అభివృద్ధి, పేదల సంక్రాంతిగా అభివర్ణించారు. యావత్ ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని, మన వినూత్న ఆవిష్కరణలను అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు మన నమూనాలు మార్గదర్శకాలన్నారు. 2014లో కొందరు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదని, కొంతమంది మాత్రమే వచ్చారని, ఏపీని బలహీన బృందమని విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. నాలుగేళ్లలో 670 అవార్డులు రావటం మన కృషికి నిదర్శనమన్నారు. ‘మీ త్యాగఫలితం వల్లే రాష్ట్రం ఈ దశకు చేరుకుంది. మీ కష్టార్జితం, సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యపడింది. అధికార, ఉద్యోగ బృందాన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ‘గతంలో తొమ్మిదేళ్లు నేను ఒంటరిగా పరుగెత్తా. ఇప్పుడు కలసి పయనిస్తున్నాం. అందుకే ఉత్తమ ఫలితాలు సాధించాం’ అని ఆయనన్నారు. 16వేల గ్రామసభలు నిర్వహించటం ఓ చరిత్ర అన్నారు. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికలను అప్‌లోడ్ చేయటం మరో రికార్డు అని, పోలవరం పనుల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని ఉదహరించారు. ఎల్‌ఈడీ బల్బులు, నరేగా నిధులు, ప్రకృతి వ్యవసాయంతో నూతన ఒరవడి సృష్టించామన్నారు. ఏపీ ఆర్టీజీఎస్‌ను బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రశంసించారంటూ, సింగపూర్‌లో కూడా ఇలాంటి వ్యవస్థ అందుబాటులో లేదన్నారు. 1100 పరిష్కార వేదిక ప్రపంచానికే ఓ నమూనాగా నిలుస్తోందని, పేదల సమస్యల సత్వర పరిష్కారానికి కేంద్రంగా మారిందన్నారు.
మనకంటే ఇతర రాష్ట్రాలు ముందుకుపోతే అసూయ కలిగినా దాన్ని కసిగా మార్చుకుంటానని, మరింత పట్టుదలతో పనిచేస్తానని, అనుకున్నది సాధించేందుకే అసూయ దోహదపడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అది మన ప్రగతికి ఉపయోగపడాలి తప్ప ఇతరులకు హాని కలిగించేదిగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఒక్కరోజు లక్ష కోట్ల పెట్టుబడులు, 30వేల మందికి ఉపాధి లభించనుండటం ఓ చరిత్రగా పునరుద్ఘాటించారు. అదాని గ్రూపు రూ. 30వేల కోట్లతో ఐటీ పార్క్‌లు, రూ. 40 వేల కోట్లతో సోలార్ పార్క్‌లు విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో కాగితం గుజ్జు పరిశ్రమ ద్వారా 50వేల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వయాడక్ట్ మన తారకమంత్రమని, సులభతర వాణిజ్యంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. భవిష్యత్‌లో మన డేటా సేవలపై ప్రపంచం దృష్టి సారించే అవకాశాలున్నాయని అభిలషించారు. 7 మిషన్లు, ఐదు గ్రిడ్లు, మరో ఐదు ఉద్యమ అంశాలతో ప్రయాణం ప్రారంభమైందని, పట్టుదల పెంచేందుకే నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజల భాగస్వామ్యం కోసం జన్మభూమి, జలసిరికి హారతి, గ్రామ వికాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం దేనికీ సహకరించలేదని, అయినా కష్టంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. శనివారం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని నిర్దేశించారు.
ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో ఇప్పటివరకు 4,57,007 వినతులు అందాయని ముఖ్యమంత్రి తెలిపారు. అందులో 3,10,000 అర్జీలు పరిశీలించామని, 35వేల వినతులు మాత్రమే తిరస్కరించామన్నారు. తొలి విడత జన్మభూమిలో 40లక్షల వినతులు రాగా, ఈసారి 4లక్షలు మాత్రమే అందాయన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని, అందుకే ఫిర్యాదులు తగ్గాయన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఇదే స్ఫూర్తితో దేశం, ప్రపంచంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పమని చెప్పారు.
ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతం
ఎన్టీఆర్ కథానాయకుడు చలనచిత్రం ద్వారా మూడు దశాబ్దాల చరిత్రను మూడు గంటల్లో ప్రదర్శించటం అద్భుతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ జరిగే సంఘటనలతో రాజీపడలేకే ఎన్టీఆర్ ఉద్యోగాన్ని వదిలేశారని, మద్రాస్‌లో అష్టకష్టాలు పడినా మనోధైర్యం కోల్పోలేదన్నారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బయోపిక్ సంతోషాన్ని కలిగించిందన్నారు. దివిసీమ ఉప్పెన బీభత్స నష్టాలను ఎన్టీఆర్ కళ్లారా చూశారని, తుపానులో ఇల్లు కూలకుండా నిట్టాడుకి తన భుజం మోపి అడ్డుపెట్టారని, బాధలను ప్రత్యక్షంగా ఆనాడే అనుభవించారని తెలిపారు. రైతులు, పేదల విపత్తు కష్టాలపై చిన్ననాటి నుంచే స్పందించారన్నారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు విరాళం ప్రకటించటంతో పాటు తానే స్వయంగా జోలెపట్టి స్ఫూర్తి నింపారని తెలిపారు. లాంతర్ వెలుగులో చదువుకున్న ఆయన ఏ విద్యార్థికీ ఇలాంటి కష్టం రాకూడదని ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా జరగాలని ఆకాంక్షించారని చెప్పారు. పేదల గుడిసెల్లో జీవనం సాగించటం ఆయన్ను కలచివేసిందని, అందుకే పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారంటూ చిత్ర బృందాన్ని చంద్రబాబు అభినందించారు.