ఆంధ్రప్రదేశ్‌

పింఛన్ ఇక.. రూ.2 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 11: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు వరాల జల్లు కురిపించారు. జనవరి నెల నుండి సామాజిక భద్రతా పింఛన్ల కింద ఇస్తున్న రూ.వెయ్యిని రూ.2వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో ఇవ్వబోయే పింఛన్లలో జనవరి నెలలో ఇవ్వాల్సిన రూ.వెయ్యి కలిపి మొత్తం రూ.3వేలు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 54లక్షల మంది దీని వలన లబ్ధిపొందుతారని తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలులో శుక్రవారం జరిగిన 6వ విడత జన్మభూమి-మా ఊరు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ఫోన్ ఇవ్వబోతున్నామని, ఆ దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల భద్రత కోసం తాను పింఛను నగదు మొత్తాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎన్‌టీఆర్ వైద్యసేవ కింద అందించే వైద్యచికిత్సల మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచుతానని, ఏప్రిల్ నుండి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మహిళలకు రక్ష పథకాన్ని ఈ సందర్భంగా ఆయన బోగోలులో ప్రారంభించారు. 8,9,10 తరగతులకు వెళ్లే 6లక్షల మంది బాలికలకు శానిటరీ నాప్‌కిన్లు అందచేస్తున్నామని, మహిళలకు కూడా రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ కింద నాప్‌కిన్‌లను అందించబోతున్నామని వెల్లడించారు. గోదావరి-పెన్నా అనుసంధాన రెండో విడత పనులకు కూడా త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని తెలియచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేస్తానని హామీనిచ్చారు. రుణమాఫీ కింద రైతులకు ఇవ్వాల్సిన మిగిలిన మొత్తాన్ని ఈనెలలోనే 10శాతం వడ్డీ వేసి మరీ అందచేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నీటిపైపు లైను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 2వేలు జనాభా దాటిన అన్ని గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రం మొత్తం సిసి కెమెరాల గుప్పిట్లో ఉందని, ఎక్కడ ఏ నేరం జరిగినా సత్వరమే నిందితులను పట్టుకునే వ్యవస్థ నెలకొల్పామని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం కష్టపడి, సంపద సృష్టిస్తానని, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెల్లూరు - తిరుపతి - చెన్నై కారిడార్ భవిష్యత్తులో ఒక పారిశ్రామిక జంక్షన్‌గా మారబోతోందన్నారు. నెల్లూరు జిల్లాలో సుమారు 65వేల మంది సి జె ఎఫ్ ఎస్ భూముల రైతులకు 66,272 ఎకరాలకు సంబంధించి డికెటి పట్టాలు ఒకే రోజు ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, ఇందులో అధికారుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. పొట్టిశ్రీరాములు జన్మస్థలమైన జువ్వలదినె్నను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేశామని, అందులో భాగంగానే రూ.4కోట్లతో నిర్మించిన పొట్టిశ్రీరాములు స్మారక భవన సముదాయాన్ని ప్రారంభించానన్నారు. రూ.110కోట్లతో ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
దేశ ప్రధాని నరేంద్రమోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సి బి ఐ, ఇడి, ఆర్ బి ఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ప్రతిపక్షపార్టీలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు దిగుతున్నారని ఆయన మోదీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చేపట్టే ప్రతి పనికీ ప్రధాని మోదీ అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. చివరకు ప్రతిపక్ష నేతల ఫోన్‌కాల్స్‌ను కూడా ట్యాపింగ్ చేస్తున్నారని, రాష్ట్ర కంప్యూటర్లలోకి చొరబడే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ రాజకీయవాదిగా దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావించే తాను ఇతర ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని, ఇదే సమయంలో కొందరు మాత్రం తమ కేసుల రాజీ, ఇతర లాలూచీల కోసం బిజెపితో జతకడుతున్నారని విమర్శించారు. ముగ్గురు మోదీలు తనపై గురిపెట్టారని, వారిలో ఒకరు ఢిల్లీ మోదీ కాగా, మరొకరు జగన్ మోదీ అని, ఇంకొకరు తెలంగాణలో కేసీఆర్ మోదీ అని ఎద్దేవా చేశారు. తాను ఎవరికీ భయపడనని, తనకు ప్రజాబలం ఉందని, తనను కాపాడుకునే బాధ్యత కూడా వారిదేనని పిలుపునిచ్చారు. అండగా ఉండే బాధ్యత ప్రజలదని, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఎన్ డీ ఏకు మద్దతునిచ్చానని, చివరకు మోసం చేశారని ఆరోపించారు. జయప్రకాష్ నారాయణ, పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీలు కూడా కేంద్రం రాష్ట్రానికి రూ.80వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నాయని గుర్తుచేశారు. అమరావతికి మోదీ మట్టి, నీళ్లు ఇచ్చారని, మీరు కూడా అవే ఇస్తారా.. అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. నిరుపేద అగ్రవర్ణ వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు స్వాగతించాల్సిన విషయమని, తమ పార్టీ కూడా మద్దతు పలికిందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రం తీర్మానం చేసి పంపిన కాపులు, వాల్మీకులు, మత్స్యకారుల రిజర్వేషన్ల గురించి ఎందుకు కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
నమ్మకమే ప్రధానం
విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి తనలాంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందనే నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారని అన్నారు. ప్రతి పనికీ నమ్మకమే ప్రధానమని, అదే నమ్మకంతో పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని అన్నారు. ఒకే రోజు లక్ష కోట్ల పెట్టుబడి పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఎం ఓ యూలు కుదుర్చుకున్నామన్నారు. రామాయపట్నం సమీపంలో దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడిగా ఇండోనేసియా కంపెనీ పేపర్ పరిశ్రమ పెడుతోందన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ గెలిస్తాడనే భయంతో కొందరు పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. తన కష్టాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో సమర్థుడైన నేతను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, ప్రపంచంలో పలు దేశాల్లో సంక్షోభాలు తలెత్తిన సమయంలో సమర్థుడైన నేతలకు పలుసార్లు ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు.
విమానాశ్రయానికి శంకుస్థాపన
జిల్లాకేంద్రానికి సమీపంలోని దగదర్తి వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించారు. అంతక్రితం జువ్వలదినె్నలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు. అదే గ్రామంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ, స్మారక భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.