ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల నోటిఫికేషన్ లోపు మధ్యంతర భృతి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారవౌతున్నాయని, అయితే వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ జారీలోపు 3 ప్రధాన డిమాండ్లను ఆమోదించాల్సి ఉందని ఏపీ ఎన్జీఓ సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖరరెడ్డి, బండి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని, తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే ప్రత్యేక్ష పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఏపీ ఎన్జీఓ సంఘానికి నాలుగున్నరేళ్లు ప్రధాన కార్యదర్శిగా, ఐదున్నరేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన పరుచూరి అశోక్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా ఆదివారం ఇక్కడ సంఘం కార్యవర్గ సమావేశం ఉత్కంఠ భరితంగా జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సహా మొత్తం 45మంది ప్రతినిధులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా జేఏసీ చైర్మన్ ఎ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించడంతో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. చివరకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖరరెడ్డి అధ్యక్షునిగా, ఆయన స్థానంలో ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఉద్యోగుల్లో సందడి నెలకొంది. ఎన్నిక అనంతరం నేతలు ఎన్జీఓ హోంలో తొలుత చంద్రశేఖరరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తామంతా అశోక్‌బాబు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. తమకు అనుబంధంగా 105 సంఘాలతో ఏర్పాడిన జేఏసీకి మొదటి నుండి ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు చైర్మన్‌గా వ్యవహరిస్తూ వచ్చారన్నారు. ఈ సంఘాలన్నింటినీ ఏకతాటిపై నిలిపే బాధ్యతను ఇక నుండి తాను చేపట్టబోతున్నానన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో దాదాపు 20వేల మంది సచివాలయ, డైరెక్టరేట్ ఉద్యోగులు ఇక్కడకు వచ్చామన్నారు. వీరందరికీ సొంతగూడు కల్పించేందుకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని మరోసారి ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. 2018 జూలై నుంచి 11వ పీఆర్‌సీ అమలుకావాల్సి ఉండగా ఇప్పటికీ జాప్యం జరుగుతున్నందున తక్షణం 35శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి లక్షా 86వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, ఇందుకోసం ఢిల్లీ తరహాలో మన శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పెన్షన్ లేని ప్రభుత్వ కొలువు ఒక ఉద్యోగమే కాదని ఆయనన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి గత 20ఏళ్లగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆయన కోరారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు విడతల డీఏను విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ముఖ్యమంత్రి మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతన ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్భ్రావృద్ధికి, ముఖ్యమంత్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ రాత్రీపగలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది నినాదంగానే మిగలకుండా ఉద్యోగుల బాగోగులు చూడాలని కోరారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో కొనసాగుతున్న హెల్త్‌కార్డు పథకం ఏమాత్రం అమలు కావడం లేదని, దీన్ని నిర్లక్ష్యం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ సాధారణంగా ప్రతిఒక్కరూ ఉన్నత పదవులు ఆశిస్తారని, ఎన్నికల్లోనూ పోటీలుంటాయని, తర్వాత కలిసి పనిచేయడం ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. విద్యాసాగర్ ఏమాత్రం అసంతృప్తికి గురికాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అంబరాన్నంటిన సంబరాలు
ఎన్జీఓ హోం సమీపంలోని ఒక ప్రైవేటు కల్యాణ మంటపంలో ఆదివారం ఉదయం సమావేశం జరుగుతున్నంత సేపూ వెలుపల ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. అధికారిక ప్రకటన వెలువడిన తరువాత ఉద్యోగులు ఉత్సాహంగా బాణసంచా కాలుస్తూ రోడ్లపై నృత్యాలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షునిగా, నీటి పారుదల సంఘం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అత్యధిక జిల్లా కమిటీలు వెన్నంటి నిలవడంతో ఆయన ఎన్నిక సుగమమైంది.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖరరెడ్డి