ఆంధ్రప్రదేశ్‌

జడలు విప్పిన సంక్రాంతి జూదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ)/ కంకిపాడు, జనవరి 16: తెలుగువారి సంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో జూద క్రీడలు జడలు విప్పాయి. కోడిపందాలు, పొట్టేళ్ల పందాలు, కోసాట, చిత్తూ-బొమ్మా, గుండాట.. ఇలా వినోదం పేరిట జూదాలు హద్దులు దాటాయి. కోడి పందాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతిచ్చే ప్రసక్తే లేదని ముందస్తు హెచ్చరికలు చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు చివరిక్షణంలో చేతులెత్తేయడంతో పందెంరాయుళ్లు తమ పంతం నెగ్గించుకున్నారు. చిన్నా, పెద్దా.. ముసలీ, ముతకా అనే తేడాలేకుండా పాల్గొన్న పందాల్లో తామేమీ తక్కువ కాదంటూ మహిళలూ హాజరయ్యారు. ఆతిథ్యంలో కోనసీమను తలపించేలా నిర్వాహకులు సకల ఏర్పాట్లు బరుల వద్దే చేయడంతో ఈ ఏడాది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవిదేశాల నుండి పెద్దసంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు. మూడురోజులు కృష్ణా జిల్లాలోని ముఖ్యమైన మండల కేంద్రాల్లో సంక్రాంతి సంబరాల పేరిట రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఆధ్వర్యంలోనే వివిధ పోటీలు నిర్వహించారు. ఈడుపుగల్లు ప్రాంతంలో సుమారు 60ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బరులు రాష్ట్రంలోనే పెద్దవిగా నిలిచాయి. కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీసు అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా వాటన్నిటినీ భోగి మంటల్లో వేసిన పందెంరాయుళ్లు.. కోళ్లకు కత్తులు కట్టి మరీ బరిలోకి దించారు. పందాల కోసం భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు పేరుకి సంక్రాంతి సంబరాలు అంటూనే వాటిమాటున ఎక్కడా జరగని విధంగా పెద్దఎత్తున జూద క్రీడలు నిర్వహించారు. రాత్రీ పగలు తేడాలేకుండా ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ పోటీలు నిర్వహించారు. ఇందుకోసం భారీగా జనరేటర్లు ఏర్పాటు చేశారు. పందాలు జరిగే ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లేందుకు వీల్లేకుండా కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేశారు. జూదం కోసం వచ్చేవారికి అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి అంతరాయాలకు తావివ్వకుండా చూసేందుకు సుమారు 200 మంది వరకు ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరిగిన ఈ పోటీలను కొన్ని ప్రాంతాల్లో వారే ప్రారంభించడం, అక్కడే ఉండి సజావుగా జరిగేలా పర్యవేక్షించడం కనిపించింది. గత రెండేళ్లు నోట్ల రద్దు, జీఎస్టీ కొంత ప్రభావం చూపినా, ఈ ఏడాది మాత్రం ఆ ఛాయలు ఎక్కడా కనిపించలేదు. 500, 2వేల రూపాయల నోట్ల చలామణీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ, ఎవరి చేతిలో చూసినా పెద్దనోట్లే దర్శనమిచ్చాయి. అయితే కోసాటలో మాత్రం నిర్వాహకులు కాయిన్లు ఏర్పాటు చేసి పందెంరాయుళ్లకు చిల్లర ఇబ్బందుల్లేకుండా చూశారు. ఇక కోడి పందాలు చూసేందుకు మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, దేశవిదేశాల నుండి కూడా పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఈడుపుగల్లు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బరికి ఈ మూడురోజులు సుమారు 5లక్షల మంది వరకు వచ్చారని నిర్వాహకులే చెబుతున్నారు. ప్రతిరోజు లక్ష మంది వరకు ఈ ప్రాంతానికి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మహిళలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. పందాల కోసం వచ్చినవారికి భోజనాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక మద్యం విషయం చెప్పనే అక్కర్లేదు. చీప్‌లిక్కర్ దగ్గర నుండి చలచల్లని బీరు, ఖరీదైన స్కాచ్ వరకు మందుబాబుల కోసం ప్రత్యేక కౌంటర్లు వెలిశాయి. ఇక పందాలు జరిగే ప్రాంతంలోకి వెళ్లాలంటే మాత్రం ప్రత్యేక పాసులు తప్పనిసరి. పందాలు జరిగిన మూడురోజులూ ఏరోజుకారోజు వైవిధ్యంగా పాసులు ముద్రించి పంపిణీ చేశారు. పాస్ లేకుండా బరిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం ప్రైవేటు సైన్యం చేతిలో కొరడా దెబ్బలు తీనాల్సిందే! ఇంత జరుగుతున్నా పోలీసులు అటుగా కనె్నత్తి చూసిన పాపానపోలేదు.

చిత్రం..ఈడుపుగల్లులో జూద క్రీడ వద్ద జనసందోహం