ఆంధ్రప్రదేశ్‌

విశ్వరూపంతో పార్టీల నిజస్వరూపం తేలుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 18: ఫిబ్రవరిలో నిర్వహించనున్న మాదిగల విశ్వరూప మహాసభ నాటికి ఏపీలో పార్టీల నిజ స్వరూపం తేలనుందని, మాదిగల పట్ల పార్టీల కుట్రపూరిత వ్యవహారం బయటపడుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. విభజన అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల ఉనికిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన మందా కృష్ణ మాదిగ స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడారు. ఏపీలో స్వార్ధపరుల వత్తిడికి తలొగ్గిన కొన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎస్సీ వర్గీకరణ పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.
ఏపీలో మాదిగలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎక్కడైతే మాదిగల ఉనికిని రాజకీయ పార్టీలు స్వార్ధపూరితం చేస్తున్నాయో, అక్కడే తామేంటో చూపించడానికి ఫిబ్రవరి 19న అమరావతిలో మాదిగల విశ్వరూప మహాసభ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో మాదిగలు లేరనే వాదనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ కంటే ఏపీలోనే మాదిగల జనాభా ఎక్కువన్నారు. తెలంగాణలో మాదిగల జనాభా 35 లక్షలు వుంటే, మాలల జనాభా 15 లక్షలు మాత్రమేనన్నారు. ఏపీలో మాదిగల సంఖ్య 39 లక్షలు కాగా, మాలల సంఖ్య 41 లక్షలు ఉంటుందన్నారు.
మాలలతో పోల్చుకుంటే ఏపీలో మాదిగల జనాభా కేవలం 2 లక్షలు మాత్రమే తక్కువన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకై నిర్వహించిన సర్వే అనంతరం జారీచేసిన జీవో నెంబర్ 25 ద్వారా ఈ గణాంకాలు తేటతెల్లమయ్యాయన్నారు. మాదిగలు రెండు లక్షలు మాత్రమే తక్కువ ఉన్నప్పటికీ లేరని, దుష్ప్రచారం చేస్తూ అవకాశాలకు గండి కొడ్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మాల మాదిగలు ఉమ్మడిగా అనుభవించాల్సిన సంక్షేమ పథకాలను మొత్తం అధికార పార్టీ మాలల చేతిలోనే పెట్టడమే ఇందుకు ప్రబల సాక్ష్యమన్నారు.
ఈ మేరకు దళితుల సంక్షేమ శాఖకు మంత్రిగా నక్కా ఆనందబాబును, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌ను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా కారెం శివాజీని నియమించారన్నారు. ఈ విధంగా చేయడం వల్ల మాదిగలు సంక్షేమ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. అదే సమయంలో దళిత క్రైస్తవులకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో మాల మాదిగలు ఇద్దరూవుంటే నతానియేల్‌ను నియమించారన్నారు. సంక్షేమం అందకుండా చేస్తున్న ఆ సామాజికవర్గ కుట్రకు అధికార ప్రతిపక్ష పార్టీలు వత్తాసు పల్కుతూ మాదిగల ఉనికిని ప్రశ్నార్ధకం చేశారన్నారు. చంద్రబాబునాయుడు ఏపీలో ఒక విధంగా, తెలంగాణాలో మరో విధంగా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా అసెంబ్లీలో తీర్మానం జరిగిందని, ఆయన కూడా ప్రధానికి లేఖలు రాసారని, ఆయన కుమారుడు జగన్ కూడా వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాశారన్నారు. అదే ప్రతిపక్ష నేత జగన్ వర్గీకరణకు అవకాశం లేదని వ్యతిరేకిస్తూ ఏపీలో మాట్లాడుతున్నట్టు రుజువులు కనిపిస్తున్నాయన్నారు. విశ్వరూప సభకు ముందుగా జిల్లాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విపక్ష నేత వైఎస్ జగన్, వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా తదితరులందరినీ కలసి ఆహ్వానిస్తామన్నారు. ఈ సభ కంటే ముందే తమ శత్రువులెవరో, మిత్రులెవరో తేలనుందన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు చిన సుబ్బారాయుడు, వైరాల అప్పారావు, కొత్తపల్లి రఘు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.