ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీలో సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: అపరిష్కృత డిమాండ్ల సాధన కోసం ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు గుర్తింపు యూనియన్ ఈయూ సహా ఎనిమిది కార్మికసంఘాలు ప్రకటించాయి. గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఇక ఆర్టీసీలో అతి పెద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రం ప్రస్తుతానికి సమ్మెలో పాల్గొనేందుకు సంసిద్ధత తెలుపనప్పటికీ వెలుపల నుంచి సంఘీభావం తెలుపుతామని సంఘ ఉపాధ్యక్షుడు డీ సూర్య ప్రకాశరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఇక నిరవధిక సమ్మెలో భాగంగా జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు కో కన్వీనర్ సీహెచ్ సుందరరావు, వై వరహాల నాయుడు, ఈయు రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు ఈ నెల 25వ తేదీ నుంచి తాము చేపట్టబోయే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 128 డిపోలు, జోనల్ వర్క్ యూనిట్ల వద్ద 25వ తేదీ నుంచి సమ్మె సన్నాహక ధర్నాలు జరుగుతాయన్నారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విధులకు హాజరయ్యే కార్మికులందరూ తమ డిమాండ్లతో కూడిన నల్లబాడ్జీలు ధరిస్తారు. 28న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజు సామూహిక నిరహారదీక్షలు, 30వ తేదీ 13 జిల్లాల రీజనల్ మేనేజర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున ధర్నాలు జరుగుతాయని, అదే రోజున తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎంవి టాక్స్‌ను రద్దు చేయాలని, నష్టాలను ప్రభుత్వమే భరించాలని, ప్రజా అవసరాల కనుగుణంగా మరో వెయ్యి బస్సులను రోడ్డెక్కించాలని, 21 నెలలుగా జాప్యం జరుగతున్న వేతనాల సవరణ 50 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు చేయాలని, కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ తక్షణం రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులందరినీ తక్షణం రెగ్యులర్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ బకాయిలను తక్షణం చెల్లించాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కు పెంచాలని, మహిళా కండక్టర్‌లకు కార్గోలో పని చేసే అవకాశం కల్పించాలని కోరారు. అద్దె బస్సు డ్రైవర్‌లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ మజ్దూర్ యూనియన్ నాయకులు సీబీఎస్ రెడ్డి, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ నేతలు జీ శ్రీనివాస్, ఓస్వా నేత ఎంవీ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే..
ఇప్పటికే నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని పరిరక్షించడమే తన ముందున్న ఏకైక లక్ష్యంగా సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ తక్షణం 20 శాతం ఐఆర్‌కు తాను అంగీకరించానని అన్నారు. ఇక ముఖ్యమంత్రితో చర్చించిన పిదప పెంపు విషయం ఆలోచిస్తామన్నారు.