ఆంధ్రప్రదేశ్‌

నల్లచొక్కాలు వేసుకుని.. నల్లబెలూన్లు ఎగురవేసి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. వామపక్షాలతో పాటు అధికార తెలుగుదేశం, యువజన, విద్యార్థి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విభిన్న రీతిలో నిరసనలు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి పొడవునా మోదీకి వ్యతిరేక ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి. నల్లబెలూన్‌లు గాలిలో ఎగిరాయి. పలు ప్రాంతాల్లో మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి విఫలయత్నాలు జరిగాయి. అయితే పోలీసు కమిషనర్ ద్వారకాతిరుపలరావు నేతృత్వంలో పోలీసులు తెల్లవారుజాము నుంచి మోదీ తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదిలావుండగా సోమవారం ఢిల్లీలో సీఎం చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సారథ్యంలో వివిధ సంఘాల నేతలు, వందలాది మంది ఉద్యోగులు ప్రత్యేక రైళ్లు, విమానాలలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అలమయ్యే వరకు ప్రజల పక్షాన ఉద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బొప్పరాజు అన్నారు. ధర్మపోరాట దీక్ష తర్వాత మంగళవారం సీఎం చంద్రబాబుతో రాష్టప్రతిని కలిసి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని విశదీకరించి తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరతామన్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి చలసాని శ్రీనివాసరావు కార్యాచరణ అమలుకు మద్దతుగా గత 10రోజులుగా తమ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు, బైక్‌ర్యాలీలు, గాంధీ మార్గంలో వీధుల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
కనకదుర్గమ్మ వారథి వద్ద ఉద్రిక్తత
తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు నల్లచొక్కాలు ధరించి నల్లబెలూన్‌లు ఎగురవేస్తూ విజయవాడ, గుంటూరు జాతీయ రహదారిపై కనకదుర్గ వారథి వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘గోబ్యాక్.. గోబ్యాక్ నరేంద్ర మోదీ’ అని నినదిస్తూ గుంటూరు సభకు వెళుతున్న బీజేపీ కార్యకర్తల వాహనాలు, కార్యకర్తలను అడ్డుకోవటంతో పలుసార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల జోక్యంతో వాహనాలు సాఫీగా ముందు కొనసాగాయి. ఆంధ్రకు తీరని అన్యాయం చేస్తున్న మోదీ సిగ్గులేకుండా ఏ మొఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారంటూ అవినాష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో లారీ యజమానులు సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు బెంజి సర్కిల్‌లో వౌనదీక్ష చేయనున్నారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అఫ్సర్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో యువకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
శివాజీ జలదీక్ష
ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ సినీహీరో శివాజీ కృష్ణానది దుర్గాఘాట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు జలదీక్ష చేశారు. మొత్తం 20 నుంచి నడుంలోతు నీటిలో నిలబడ్డారు. ఈసందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధాని మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టి తెలుగువారిని మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
చిత్రం.. మోదీ రాకను వ్యతిరేకిస్తూ విజయవాడలో జరిగిన నిరసన ప్రదర్శన