ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఫిబ్రవరి 20: దేశాభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలని , కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల నేపథ్యంలో త్వరలో ప్రపంచదేశాల్లో భారతదేశం అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని, ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో విమానాశ్రయంలో 177.10కోట్ల రూపాయలతో చేపట్టనున్న రన్‌వే విస్తరణ పనులకు ఉపరాష్టప్రతి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారతదేశం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇందుకు ప్రధాన కారణం మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో జాతీయ రహదారుల అనుసంధానంతో ప్రారంభమై ప్రస్తుత ప్రధాని మోదీ పాలనలో విమానాశ్రయాల అభివృద్ధేనన్నారు. రాష్ట్రంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలు పూర్తిగా అభివృద్ధి చెందాయని, నేడు తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి చెందనుందన్నారు. అంతర్జాతీయ విమానాలు దిగడం కోసమే ఈ విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇందుకు సహకరించిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సురేష్‌ప్రభు, జయంత్ సిన్హాతో పాటు పూర్వపు మంత్రి అశోక్‌గజపతిరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ విమానయాన రంగం అభివృద్ధికి పరిపూర్ణ సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అభివృద్ధి జరగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా పరస్పరం సహకారం అందించుకోవాలన్నారు. టీమిండియాగా పనిచేయాలన్నారు. రాజకీయాలు మరిచిపోవాలన్నారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా చివరగా అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ఆ దిశగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారన్నారు. అలాగే రిఫార్మ్స్, ఫెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్... ట్రాన్స్‌ఫార్మ్ ది నేషన్... ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ ఉపరాష్టప్రతి తన సహజశైలిలో ప్రసంగించారు. ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాలంటే వారు భాగస్వాములు కావాలంటే వేగవంతంగా సాగుతున్న నేటి ప్రపంచ అభివృద్ధిని అందుకోవాలంటే మనదేశంలో కూడా సంస్కరణలు వేగవంతంగా అమలు పరచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఒక మార్గం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యమేనన్నారు. ఇప్పటివరకు నిధుల్లేక విమానాశ్రయాల విస్తరణ చేసుకోలేకపోయామన్నారు. వాజ్‌పేయి కనెక్టివిటీ విప్లవాన్ని తీసుకురావడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యాయన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణలతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పాత విమానాశ్రయాల పునరుద్ధరణ అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు విమానాశ్రయాలు అభివృద్ధిలో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న కాలంలో ఇతర విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చేయాలన్నారు. కడప విమానాశ్రయం కూడా అభివృద్ధి చెంది ఎక్కువ మంది ప్రయాణిలకు సేవలందించాలన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణ వలన మరింత ఎక్కువమంది ప్రయాణికులకు అనువుగా ఉంటాయన్నారు. తద్వారా పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అంతేకాకుండా ఎక్కువమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోనికి వస్తాయన్నారు. ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు శాతం అన్నారు. భారతదేశానికి అతిపెద్ద పొరుగుదేశమైన చైనా 6.8 శాతం మాత్రమే ఉందన్నారు. అయితే భారతదేశం 7.3గ్రోత్ రేటుతో వేగంగా ముందుకు వెళుతోందన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో అమలవుతున్న సంస్కరణల కారణంగా మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. రోడ్డు, రైలు, నౌక, విమానయానాలు విస్తరించినపుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రజల రాకపోకలు పెరిగి వాణిజ్యరంగం అనూహ్యంగా అభివృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న 20సంవత్సరాల్లో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 50.5శాతం పైగా పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌ఫోర్ట్ అసోసియేషన్ (ఐ ఏ టి ఏ) చెబుతోందన్నారు.
ప్రజల ఆర్థికి స్థితిగతులు మెరుగుపడుతుండడంతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం ఒక కారణమన్నారు. ఇది ఒక శుభపరిణామమన్నారు. విమానాశ్రయాల విస్తరణకు సంబంధించి ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఉడాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి కేవలం 2,500రూపాయలతో పరిసర ప్రాంతాల్లో ఒక చోటు నుండి మరొక చోటకు విమానాల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారన్నారు. రానున్న నాలుగేళ్లలో 4500కోట్ల రూపాయలు విస్తరణ పనులకు వెచ్చించనున్నట్లు భావిస్తున్నామన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ నివేదిక ప్రకారం గత యేడాది 13.9కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో 11.5కోట్ల మంది మాత్రమే ప్రయాణించేవారన్నారు.తిరుపతి గత ఐదు సంతవ్సరాల్లో ఎంతో అభివృద్ధి చెంది అకర్షణీయ నగరాల సరసన చేరిందన్నారు. తిరుపతి రైల్వేస్టేసన్ దేశంలోనే అత్యాధునికంగా త్వరలో రూపుదిద్దుకోనున్నదని, టెండర్ల ప్రక్రియలో సాంకేతిక కారణాల వలన ఆలస్యం అయ్యిందన్నారు. గురువారం నెల్లూరు నుండి ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నానన్నారు. ఎన్ బీ సీ సీ ద్వారా రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐజర్, ట్రిపుల్ ఐటీ, కలినరీ విద్యాసంస్థలు తిరుపతికి వచ్చాయన్నారు. తిరుపతి నుండి దేశంలోని పలు ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉండేలా కొత్త రైళ్లను వేశామన్నారు. కొల్హాపూర్‌కు మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామన్నారు. శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆయన ఆశీస్సులతో అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.

చిత్రం.. రేణిగుంట విమానాశ్రయం అభివృద్ధి పనుల శంకుస్తాపనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటైన సభలో వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు తదితరులు