రాష్ట్రీయం

విభజన చట్టంలో 90 శాతం హామీలు నెరవేర్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఏపీ విభజన బిల్లులోని 14 కీలకమైన అంశాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలుచేసిందని, పదేళ్ల వ్యవధిలో వీటిని అమలుచేయాల్సి ఉన్నప్పటికీ ఐదేళ్లలోపే అమలుచేసిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. ఎన్‌ఐఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్శిటీ వంటి ఇరవై ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏపీకి తీసుకొచ్చామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన మేళ్లను వివరించారు.
అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే, రాష్ట్రం అవినీతికి పాల్పడుతోందని అమిత్‌షా ఆరోపించారు. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర పలు పథకాలపై ప్రజల అభిప్రాయాలను రాజమహేంద్రవరంలో తాను పరిశీలించానన్నారు. మోదీ వల్లే ఏపీలో విశేష అభివృద్ధి సాధ్యమన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టును రూ.182 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏపీలోని తీర ప్రాంత అభివృద్ధికి వేల కోట్లు నిధులు ఇచ్చామన్నారు. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్ పెట్రో కెమికల్ కేంద్రాన్ని స్థాపిస్తున్నామని, గెయిల్, హెచ్‌పీసీఎల్ దాదాపు రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కాకినాడ పోర్టులో రూ.4500 కోట్ల నిధులతో లాజిస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామన్నారు.
కోస్తాలోనూ, ఏపీలోనూ ఇప్పటి వరకు రూ.55వేల 475 కోట్లను అభివృద్ధికి, పెట్టుబడుల నిమిత్తం ఇచ్చిందని అమిత్‌షా వివరించారు. ఇలా ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా సహకరిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ బీజేపీకి అధికారం అందిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఎన్టీఆర్ బాహుబలి... చంద్రబాబు కట్టప్ప!
ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ బాహుబలి అయితే, చంద్రబాబునాయుడు కట్టప్ప వంటి వ్యక్తని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ ధియోదర్ వ్యాఖ్యానించారు. బాహుబలి ఒకటిలో కట్టప్ప ఎందుకు వెనుక నుంచి కత్తితో పొడిచాడో తెలుసుకోవడానికి ఏడాది తర్వాత బాహుబలి రెండో పార్టు వచ్చేంత వరకు తెలియలేదన్నారు. అయితే కట్టప్ప వంటి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు గురించి తెలుసుకోవడానికి ఎనే్నళ్లు వేచిచూడాలో తెలియదని వచ్చీరాని తెలుగులో చమత్కరించారు. గురువారం రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల బీజేపీ శక్తికేంద్రాల సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులో అనువదించారు. చంద్రబాబునాయుడు తన అసమర్ధ, అవినీతిని దాచిపెట్టడానికి బీజేపీపై దొంగ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజమన్నారు. బాబుకు, జగన్‌కు భావసారూప్యత వుందని, వారిద్దరు కుటుంబం కోసమే పాలన సాగిస్తారని ఆరోపించారు. ఏపీలో ముఖ్యమంత్రి పదవిని ఆకాంక్షించే ఒక నాయకుడు జైలు నుంచి బయటకు వస్తే, మరో నాయకుడు జైలుకెళ్ళేందుకు సిద్ధంగా వున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు ఒక చేత్తో పసుపు డబ్బా, మరో చేత్తో చంద్రన్న స్టిక్కర్లు ఉంటాయని, కేంద్రం నుంచి వచ్చే ఏ పథకానికైనా పసుపు రంగు వేసేసి, చంద్రన్న స్టిక్కర్లు అంటిస్తారని ఎద్దేవాచేశారు. రానున్న రోజుల్లో బీజేపీ సహకారం లేకుండా ఏ ప్రభుత్వమూ ఉండకూడదని, ఆ దిశగా కార్యకర్తలంతా కృషిచేయాలన్నారు. అంతకు ముందు దగ్గుబాటి పురంధ్రేశ్వరి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తుందన్నారు. మార్చి 2వ తేదీ వరకు బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. 26వ తేదీన కమల్ జ్యోతి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. 28న గిన్నీస్ బుక్ రికార్డుగా కోటి మంది బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ మాట్లాడతారని, ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో సుమారు ఐదేసి వందల మందిని పెద్ద పెద్ద స్క్రీన్ల ముందు కూర్చోబెట్టాలని, ప్రధాని నేరుగా కార్యకర్తలతో మాట్లాడతారన్నారు. మార్చి 3న కోటి మోటారు బైక్‌లతో ర్యాలీ నిర్వహించే కార్యక్రమం ఉంటుందని, ఒక్కో బైక్‌పై ఇద్దరేసి చొప్పున కూర్చుని దాదాపు 150 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించాల్సి వుందన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ఇమేజ్‌తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు తన మీడియాతో దుష్ప్రచారం చేస్తూ మోదీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తోందని, పోలవరం కొత్త డీపీఆర్‌ను ఆమోదించిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక, అసమర్ధ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ మోదీ హీరో, చంద్రబాబు జీరో అన్నారు.
మోదీ లేకుండా చంద్రబాబు లేడన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును శంకరగిరి మాన్యాలు పట్టించాలన్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నాయకులు మానేపల్లి అయ్యాజీ వేమా, మైనార్టీ నాయకుడు షేక్ బాజీ, సత్యగోపీనాధ్ దాస్ మాట్లాడారు.
చిత్రం.. బహిరంగ సభలో మాట్లాడుతున్న అమిత్‌షా