ఆంధ్రప్రదేశ్‌

తేలని ‘సేన’ టికెట్ల పంచాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 18: జెట్ పవర్‌తో దూసుకొస్తుందనుకున్న పవన కల్యాణ్ పార్టీ నామినేషన్ల ఘట్టానికి తెరలేచినప్పటికీ టికెట్ల ఖరారులో వెనుకబడిపోతోంది. జిల్లాలో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో మిత్ర పక్షాలకు కేటాయించిన సీట్లను మినహాయిస్తే కేవలం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసుకోగలిగింది. అరకు, అనకాపల్లి, విశాఖ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ముందుగానే కేటాయించగా, విశాఖ అధ్యర్థి పార్టీ ఫిరాయించడంతో అభ్యర్థుల కోసం గాలిస్తోంది. అధికార టీడీపీ 10 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగా, రెండు రోజులు ఆలస్యమైనా విపక్ష వైసీపీ రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించింది. జిల్లా నుంచి మూడు లోక్‌సభ స్థానాలకు అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని, అసెంబ్లీ స్థానాల ప్రకటనలో ధైర్యం చేయలేకపోతున్నారు. జిల్లాలో రెండు ఎస్టీ, ఒక ఎస్సీ స్థానాలతో కలిపి 15 అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉండగా కేవలం ఐదింటికి మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. మరో రెండు స్థానాలను మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంకు కేటాయించారు. అరుకు (ఎస్టీ) స్థానాన్ని సీపీఎం, విశాఖ పశ్చిమ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. జనసేన తరపున పోటీకి పీ బాలరాజు (పాడేరు), నక్కా రాజబాబు (పాయకరావుపేట), సుందరపు విజయకుమార్ (యలమంచిలి), పరుచూరి భాస్కరరావు (అనకాపల్లి), చింతలపూడి వెంకటరామయ్య (పెందుర్తి) స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. కొత్తగా బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో కూడా జనసేన పొత్తు కుదుర్చుకుని కొన్ని సీట్లను కేటాయించేందుకు అంగీకారం కుదిరింది. దీంతో అభ్యర్థుల జాబితా మరికొంత ఆలస్యమైనట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ఇంకా కీలక అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా గాజువాక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కనీసం తాను పోటీ చేసే స్థానాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని పరిస్థితిలో జనసేన చిక్కుకుందని పార్టీ నేతలే వ్యాఖ్యానించుకుంటున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకూ జనసేన కేంద్ర కార్యాలయంలో జిల్లా నాయకులతో అధినేత పవన్ కల్యాణ్ సమాలోచనలు జరుపుతునే ఉన్నారు. అర్ధరాత్రి తరువాతే క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక విశాఖ లోక్‌సభకు అభ్యర్థిగా ప్రకటించిన గేదేల శ్రీనుబాబు రెండు రోజుల్లోనే వైసీపీలోకి ఫిరాయించడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అధినేత లోతుగా ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. మిగిలిన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసుకుంటుండగా, జనసేనాని మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు.