ఆంధ్రప్రదేశ్‌

అణువణువూ నిబంధనల ఉల్లంఘనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 21: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అణువణువూ చట్ట నిబంధనల ఉల్లంఘనే కనిపిస్తోంది. ప్రధానంగా జీవోనే పక్కన బెట్టేసి నిధులను మళ్ళించిన వైనం వెలుగులోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూముల్లో ఇటు భూమికి భూమిగా గానీ, హెడ్ వర్క్సు, కాల్వల నిర్మాణానికి గానీ అవసరమైన భూమిలో సింహభాగం వైఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన భూసేకరణలో 75 శాతం భూసేకరణ ముందే పూర్తికావడంతో టీడీపీ వచ్చిన తర్వాత పనులు సజావుగా జరిగేందుకు అవకాశం ఏర్పడిందంటున్నారు. అంతకు మించి భూసేకరణ గానీ, పునరావాస కల్పన గానీ పెద్దగా జరగలేదు. భూసేకరణ సమస్య పెద్దగా లేదు కాబట్టి హెడ్ వర్క్సు పనులు వేగంగా జరిగేందుకు అవకాశం కలిగిందంటున్నారు. వాస్తవానికి ఇటు నిర్మాణ పనులు, అటు పునరావాస పనులు సమాంతరంగా జరగాల్సి వుందని, కేంద్ర నిధులతో ఆ విధంగా సమాంతరంగా పనులు జరగలేదని కాగ్ నివేదికలో కూడా రాష్ట్రాన్ని తప్పు పట్టింది. పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు చట్ట ప్రకారం కనీసం ఎకరానికి రూ.19 లక్షల 50 వేలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనీసం ఎకరానికి రూ.15 లక్షలు ఇవ్వాల్సి ఉంది. డి-్ఫరం పట్టాలకు, కొండపోడు భూములకు, ఆదివాసీల ఆక్రమణలో వున్న ఏ భూమి ప్రభుత్వానికి అవసరమైనా ఈ విధంగానే చెల్లించాల్సి ఉంది. కొన్ని చోట్ల డి-్ఫరం పట్టాకు రూ.2 లక్షలే చెల్లిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఈ సందర్భంగా చెప్పారు.
నిర్వాసితులు గ్రామం ఖాళీ చేసి ప్రభుత్వం నిర్మించిన పునరావాస కాలనీలోకి వెళ్లిన రోజు నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ, యువకులందరు చట్ట ప్రకారం ప్యాకేజీ పొందేందుకు అర్హులు. ఈ ప్యాకేజీలో గిరిజనులకు రూ.6 లక్షల 86 వేలు, గిరిజనేతరులకు రూ.6 లక్షల 36 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్యాకేజీ పొందిన యువతీ, యువకులందరికీ ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే గృహనిర్మాణం చేయాల్సి ఉంది. వివాహమయిన యువతీ, యువకులకు సైతం గృహనిర్మాణం చేపట్టేందుకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఉంచాల్సిందిగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు వివాహమయిన యువతులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించాల్సి ఉంది. ప్యాకేజీ తక్కువ పొందిన వారు మిగిలిన మొత్తానికి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని పొందాల్సి ఉంది. కానీ ఈ చట్ట నిబంధనలేవీ పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. నిర్వాసితులు అడ్డంగా అన్యాయమయ్యారనే చెప్పొచ్చు.
మరో ప్రధాన విషయమేమిటంటే జిల్లాలో గిరిజన నిర్వాసితుల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూసేకరణ విభాగం 2016 సెప్టెంబర్ 14న జీవో ఆర్‌టీ నెంబర్ 641 జారీ చేసింది. దీని ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన నిర్వాసితుల గృహనిర్మాణానికి రూ.4 లక్షల 55 వేలు ఖర్చు చేయాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లక్షా 16 వేల 348 ఎకరాల భూమిని మొదటి విడతగా సేకరించాల్సి ఉంది. మొదట్లో అనుకున్నట్టుగా 276 గ్రామాలు నిర్వాసితులవుతున్నట్టు నివేదిక రూపొందించారు. ఇందులో 80 వేల 496 ఎకరాలను సేకరించారు. ఇందులో గత వైఎస్ హయాంలోనే 75 వేల 766 ఎకరాలు సేకరించారు. టీడీపీ వచ్చిన తర్వాత పరిశీలిస్తే కేవలం 4730 ఎకరాలు మాత్రమే సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 గ్రామాలు ఖాళీ చేయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన గృహ నిర్మాణ కాలనీలు తప్ప కొత్తగా చేపట్టిందేమీ లేదు. ఒక వైపు ఆర్ అండ్ ఆర్, మరో వైపు ప్రాజెక్టు నిర్మాణం సమాంతరంగా జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నిర్మాణంపై దృష్టి పెట్టింది తప్ప ఆర్ అండ్ ఆర్ పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని చెప్పొచ్చు.
జీవో నెంబర్ 641 ప్రకారం ఇంటి నిర్మాణానికి రూ.4.55 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ప్రభుత్వం చట్టాన్ని బహిరంగంగానే ఉల్లంఘించిందని తెలుస్తోంది. కేవలం రూ.2.80 లక్షలు మాత్రమే ఇస్తామని, మిగిలినదంతా పునరావాస ప్యాకేజీలో నిర్వాసితులే భరించాల్సి ఉందని సహాయ పునరావాస అధికారులు బాహాటంగానే టెండర్లు పిలిచి మరీ పునరావాస కాలనీల నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని బట్టి చట్టాన్ని బహిరంగంగానే ఉల్లంఘించినట్టుగా నిర్ధారణ అవుతోంది. ఈ మేరకు గ్రామ సభలు కూడా పెట్టకుండా, గ్రామ సభలు పెట్టినట్టుగా రికార్డులు తయారుచేసేసి గ్రామస్థుల పేర్లతో సంతకాలు పెట్టేసి ఆఖరికి అధికార యంత్రాంగం నిర్వాసితుల పేరిట ఫోర్జరీలకు సైతం పాల్పడినట్టు తెలుస్తోంది. 2018లో గృహ నిర్మాణానికి టెండర్లు పిలిచి నిర్వాసితుల చేత లిఖితపూర్వక ఒప్పందాలు తీసుకున్నారు. దీనికి తోడు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్ళించడానికి వీల్లేదు. అయినప్పటికీ ప్రభుత్వం బాహాటంగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నిర్వాసితుల ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మళ్ళించింది. జీవో ప్రకారం రూ.4.55 లక్షలు ఇవ్వాల్సిన దానికి ఎస్టీ సబ్ ప్లాన్‌కు సంబంధించిన రూ.1 లక్ష వెరసి రూ.5.55 లక్షలు కాగా అందులో రూ.2.80 లక్షలే ఇంటి నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు ఇంటి నిర్మాణాల్లో భారీ అవినీతికి ఆస్కారం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే మరిన్ని వ్యవహారాలు బయటకొస్తాయని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోంది.