ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 54 శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 45.95 శాతం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో 89.6 శాతం మేర ఓట్ల పోలింగ్ జరిగింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలిరావడం కనిపించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు శుక్రవారం భారీగా వేసేందుకు వివిధ పార్టీల నేతలు సిద్ధమయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి తాడేపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో కొన్ని పోలింగ్ బూత్‌ల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించడంతో ఓటర్లు తమ బ్యాలెట్ పేపరును ఫోటో తీసుకుని ఇతరులకు చూపించడం కనపించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తూర్పు గోదావరిలో 1,72,415 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,21,379 మంది, కృష్ణా జిల్లాలో 1,06,829 మంది, గుంటూరు జిల్లాలో 1,41,970 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళంలో 5691 మంది, విజయనగరంలో 5208, విశాఖలో 8694 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మై ఓటు క్యూ యాప్‌కు విశేష స్పందన
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన మై ఓట్ క్యూ యాప్‌కు విశేష స్పందన లభించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్లు తాము వేసే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్‌లో ఓటర్ల రద్దీని తెలుసుకుని ఓటు వేసేందుకు బయలుదేరినట్లు వివిధ జిల్లాల కలెక్టర్ల ద్వారా తనకు సమాచారం అందిందని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా ఈ యాప్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్ని వర్గాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గోదావరి జిల్లాల్లో 66.5 శాతం పోలింగ్
రాజమహేంద్రవరం: ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాఫీగా సాగింది. మొత్తం రెండు జిల్లాల్లో 66.5 శాతం పోలింగ్ జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 2 లక్షల 93వేల మంది ఓటర్లు బరిలో నిలబడిన 46 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాధారణ ఎన్నికల హోరులో ఎమ్మెల్సీ ఎన్నికల జోరు అంతగా కనిపించకపోయినా అభ్యర్ధులు మాత్రం ఎవరికి వారు తమ తమ రంగాలను ముందు నుంచే సిద్ధం చేసుకుని వ్యూహాత్మక కార్యాచరణతో ప్రచారం చేసుకుని తమ భవిష్యత్‌ను ఎదుర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియ జిల్లాలో 332 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ విధానంలో కొనసాగింది. జిల్లాలో పురుషులు లక్షా 79వేల 523 మంది, మహిళలు ఒక లక్షా 14వేల 243 మంది, ఇతరులు 28 మంది ఉన్నారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో ఒక లక్షా 72వేల 415 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక లక్షా 21వేల 379 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 332 పోలింగ్ కేంద్రాలుండగా అందులో తూర్పు గోదావరి జిల్లాలో 193 పోలింగ్ కేంద్రాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 139 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా సాగింది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎటువంటి జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఓటరు సహాయక కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం పోలింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాలను ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 26న ఇదే కాలేజి ప్రాంగణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రాజమహేంద్రవరం, రంపచోడవరం, రామచంద్రపురం, ఎటపాకలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు సిబ్బందిని, సామాగ్రిని తరలించారు. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి సామాగ్రిని, సిబ్బందిని తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అత్యవసర మందుల కిట్లు కూడా ఏర్పాటు చేశారు.
పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కంప్యూటర్ పర్యవేక్షక పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో మినహా మిగిలిన అన్ని చోట్లా కంప్యూటర్ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుగా ఓటరు గుర్తింపు కార్డుతో పాటు తొమ్మిది రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తూ అవకాశం కల్పించారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, విద్యా సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డు, డిగ్రీ, డిప్లమో ఒరిజనల్ ధ్రువపత్రాల పత్రాలు, దివ్యాంగులకు జారీ చేసిన ధ్రువపత్రాల ఒరిజనల్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు ఇండస్ట్రియల్ హౌసెస్ జారీ చేసిన సర్వీసు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులు కలిగిన వారిని అనుమతించారు. చాంతాడంత బ్యాలెట్ పత్రంలోని మొత్తం 46 మంది అభ్యర్ధులు తమకు మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని హోరాహోరీగా తలపడ్డారు. ప్రాధాన్యతా ఓటు ప్రక్రియలో ఓటు వేసే విధానం కాబట్టి ఎవరికి వారే తమకు అనూహ్యంగా కలిసి రావొచ్చేమోననే ధీమాతో ఎవరి అంచనాలు వారు వేసుకున్నారు. అభ్యర్ధులు ఓటర్లను కేంద్రాలకు రప్పించే విధంగా చైతన్య పరిచే విధానాలను అవలంభించారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా శుక్రవారం పోలింగ్ కేంద్రాల వద్ద స్లిప్‌లు తీసుకుంటూ ఓటేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది.
ఉత్తరాంధ్రలో ప్రశాంతం
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మొత్తం 19,593 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో 90.39 శాతం, విజయనగరం జిల్లాలో 90.61 శాతం, విశాఖ జిల్లాలో 87.81 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు విశాఖలో ఈ నెల 26న చేపట్టనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.