ఆంధ్రప్రదేశ్‌

సామాన్యుడికి అధికారమిస్తే ఏం చేస్తాడో చేసి చూపిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 24: కసి మీదున్న సామాన్యుడికి అధికారమిస్తే ఏంచేస్తాడో చేసి చూపిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుకృష్ణాలో సుడిగాలి పర్యటన జరిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆద్యంతం అధికార, ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని తన గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్ అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క వార్డు మెంబర్ పదవి కూడా లేని జనసేన పాలకుల మెడలు వంచి అనేక సమస్యలకు పరిష్కారం చూపితే, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం పాదయాత్రల పేరిట కాలయాపన చేశాడని ఎద్దేవా చేశారు. చిన్న కోడికత్తి గాటుకే నానాయాగీ చేసిన జగన్ స్వయానా చిన్నానను ఆయన ఇంట్లోనే గొడ్డళ్లతో నరికిచంపితే ఎందుకు మిన్నకుండిపోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మీ ఇంట్లోనే శాంతిభద్రతలకు రక్షణ లేనప్పుడు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమేర రక్షణ కల్పిస్తాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కిరాయి గూండాలు, రౌడీలు ఇష్టారీతిన నడిరోడ్లపై తిరుగుతుంటే పాలకులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేస్తానన్నారు. పేపర్లు, చానళ్లు ఉన్నాయని విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనన్నారు. పులివెందుల వేషాలు తనదగ్గర సాగవన్నారు. తాను అన్నింటికీ తెగించిన వ్యక్తినన్నారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలు ఎలాచేయాలో చూపించిన విజయసాయిరెడ్డి వంటివారికి గుణపాఠం చెప్పేందుకే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ పార్లమెంట్ బరిలో నిలిపానన్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రతిపక్ష నేత జగన్ అనర్హుడన్నారు. జగన్‌లో ఏంచూసి ఓటువేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మీకు పెట్టుబడి పెడతానన్నందుకా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చంద్రబాబు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్రజలను బలిచేసేందుకేనా అని ప్రశ్నించారు. రిటర్న్ గిఫ్ట్ సంగతి పక్కనపెడితే అసలు మీరు ప్రజలకు ఏం ఇస్తారో చెప్పాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే తన తొలి సంతకం రైతులకు రూ. 5వేలు పింఛన్ ఫైల్ మీదేనని ప్రకటించారు. తర్వాత రెండో సంతకంగా ఆడపడుచులకు రేషన్ బాధలు లేకుండా చేసి కుటుంబ సభ్యులను సంఖ్యను బట్టి నెలకు రూ.2500 నుండి రూ.3500లు వరకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా నగదు బదిలీ పథకం ఫైలుపై పెడతానన్నారు. యువత కోసం 3లక్షల ఉద్యోగాలు భర్తీచేసే ఫైలుపై మూడో సంతకం పెడతానని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలెండర్లు అందిస్తామని పవన్‌కళ్యాణ్ వివరించారు. పవన్ ప్రచార సభల్లో ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థులు పుల్లారావు, బండ్రెడ్డి రామకృష్ణ, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు బీవీ రావు, అంకెం లక్ష్మీశ్రీనివాస్, బండి రామకృష్ణ, ముత్తంశెట్టి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కైకలూరు ప్రచార సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్