ఆంధ్రప్రదేశ్‌

లోక్‌సభకు 548.. అసెంబ్లీకి 3925

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 548 మంది, 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 3,925 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ స్థానానికి సంబంధించి కర్నూలు జిల్లా నంద్యాలలో అత్యధికంగా 38 మంది, అతి తక్కువగా చిత్తూరు నుంచి 17మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 15కు పైగా నామినేషన్లు అందాయని చెప్పారు. శాసనసభకు సంబంధించి కూడా నంద్యాలలోనే అత్యధికంగా 68 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు పది చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. 118 స్థానాల్లో 15 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయని, పోటీచేసే అభ్యర్థులు 15 మంది, ఒక నోటాతో కలుపుకుని 16 వరకు ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుందని తెలిపారు. 16 దాటితే రెండవ యూనిట్, 32 దాటితే మూడవ యూనిట్, 48 దాటితే నాలుగవ యూనిట్‌ను అనుసంధానించాల్సి ఉంటుందన్నారు.
చట్టప్రకారం నిబంధనలకు అనుగుణంగా సంబంధిత రిటర్నింగ్ అధికారి నామినేషన్లను పరిశీలిస్తారని అక్కడే పరిశీలకులు కూడా ఉంటారన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని ప్రజా ప్రాతినిథ్య చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
మొత్తం ఓటర్లు 3,93,45,717
ఈనెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3కోట్ల 93లక్షల 45వేల 717 ఉన్నట్లు సీఈఒ తెలిపారు. వీరిలో పురుషులు కోటీ 94 లక్షల 62వేల 339 మంది కాగా, మహిళలు కోటీ 98లక్షల 79వేల 421 మంది ఉన్నారని వివరించారు. ట్రాన్స్ జెండర్లు 3957 మంది, దివ్యాంగులు 5లక్షల 27వేల 734 మందిలో అంధులు 82వేల 748 మంది ఉన్నారన్నారు. మొత్తం 5323 మంది ప్రవాసాంధ్రులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలకు 18 నుంచి 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన యువ ఓటర్లు 10లక్షల 15వేల 219 మంది చేరారని కొత్త ఓటర్లకు అవగాహన కల్పించటంలో వారిని ఓటర్లుగా చేర్చటంలో, దరఖాస్తులు పరిష్కరించటంలో సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందన్నారు. ఒకేరోజు 4.5 లక్షల దరఖాస్తులు పరిశీలించినట్లు చెప్పారు. 45వేల మంది బూత్ లెవల్ అధికారులు, కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు బృందాలుగా ఏర్పడినందునే పరిష్కారం లభించిందన్నారు. ఎన్నికల్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా 3635 సీ విజిల్ బృందాలు పనిచేస్తున్నాయని ఇప్పటి వరకు 2614 ఫిర్యాదులు రాగా, వాటిలో 1014 వాస్తవమైనవిగా గుర్తించామన్నారు.
వంద నిమిషాల్లో 66 శాతం స్పందించి వాటిపై తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంకా 40 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటి వరకు 17 కేసులు నమోదుచేసి రూ 12.13 కోట్ల విలువైన నగదు, 92 లక్షల విలువైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నగదు, బంగారం, వెండి, చీరెలు, డ్రెస్ మెటీరియల్స్ ఇతర వస్తువులన్నీ కలిపి రూ 30.66 కోట్ల విలువ ఉంటుందని వాటిని స్వాధీన పరచుకున్నామని తెలిపారు. రూ 17 కోట్ల విలువైన 467లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ఇంత వరకు 20 వాహనాలను సీజ్ చేశామని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోని ఎన్నికల స్క్వాడ్, సిబ్బంది, అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఎన్నికల ప్రవర్తన, నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు 367 నోటీసులు జారీచేశామన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి, అభ్యర్థులు ఖరారైనందున ఇకపై అభ్యర్థుల ఉల్లంఘనకు సంబంధించిన నోటీసులు కూడా పంపుతామన్నారు. ఓటర్లకు, ఓటింగ్ శాతం పెంచేందుకు మై క్యూ ఓట్ యాప్ ఉపకరిస్తుందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు యాప్ చెక్‌చేస్తే క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే వీలుందన్నారు. ప్రతి 15 నిమిషాలకు బూత్ సిబ్బంది యాప్‌ను అప్‌డేట్ చేస్తారన్నారు.
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం పూర్తవుతుందని సీఈఒ ద్వివేది తెలిపారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయటం వల్ల బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉందని అందువల్ల సమయం పట్టిందన్నారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మంగళవారం సాయంత్రానికి విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ పూర్తయిందని మొత్తం 17,293 ఓట్లు లెక్కించగా రఘువర్మకు 7834 ఓట్లు, శ్రీనివాసులు నాయుడుకు 5232 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. అదనపు సీఈఒలు, సుజాత శర్మ, వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.