ఆంధ్రప్రదేశ్‌

స్ట్రాంగ్‌రూంలవద్ద పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 13: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. స్ట్రాంగ్‌రూముల పర్యవేక్షణ, భద్రత తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూంలకు డబుల్‌లాక్ వ్యవస్థ ఉండాలని, రెండు తాళాల్లో ఒకటి జిల్లా ఎన్నికల అధికారి, రెండవది సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద ఉంచాలన్నారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల దరిదాపులకు ఇతరులెవరూ రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతను కేంద్ర పోలీస్ బలగం (సీపీఎఫ్) చేపట్టాలని, మిగిలిన ప్రాంతమంతా రాష్ట్ర పోలీస్ బలగాల భద్రతా పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పరిరక్షణకు ఒక ప్లాటూన్ భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఓ లాగ్‌బుక్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. భద్రతా ఏర్పాట్లను దగ్గరగా గమనించేందుకు తమ ప్రతినిధులను నియమించాల్సిందిగా పోటీచేస్తున్న అభ్యర్థులందరికీ రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూం ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపించేలా వారు వెలుపల ప్రాంతంలో ఉండేందుకు అనుమతించాలని ఆదేశించారు. స్ట్రాంగ్‌రూములను నేరుగా చూసే అవకాశంలేని చోట సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, తగిన నీడ, తాగునీరు వంటి ప్రాథమిక వసతులు కల్పించాలన్నారు. అంతర్ పరిధి ప్రాంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులను తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు వారిలో భరోసా కల్పించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్లు నిరంతరం గమనించేందుకు వీలుగా అనువైన ప్రదేశంలో సీసీ టీవీ దృశ్యాలను టీవీ స్క్రీన్లలో ప్రదర్శించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. స్ట్రాంగ్‌రూంకు చేరువలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక గెజిటెడ్ అధికారిని నియమించాలన్నారు. లోపల, వెలుపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మూడంచెల భద్రతా వలయంలో మధ్య ప్రాంతం దాటే ప్రతి వ్యక్తి పేరు, తేదీ, సమయం, గడిపిన సమయాలను సీపీఎఫ్ నిర్వహించే లాగ్‌బుక్‌లో నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నిబంధన జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఇతర వ్యక్తులందరికీ వర్తిస్తుందని వివరించారు. స్ట్రాంగ్‌రూంలకు దారితీసే అన్ని ప్రవేశ ద్వారాలను వెబ్ కెమెరా, ల్యాప్‌టాప్ ద్వారా నిరంతరం వీడియో చిత్రీకరణ జరపాలన్నారు. వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే అనుమతించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూంను అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరవాలన్నారు. స్ట్రాంగ్‌రూం తెరిచిన అనంతరం కంట్రోల్ యూనిట్‌ను వెలుపలకు తీసుకుని వచ్చేందుకు, తిరిగి తీసుకువెళ్లే సమయంలో పూర్తి స్థాయి వీడియోగ్రఫీ ఉండాలన్నారు. అభ్యర్థుల ఏజెంట్లు సీసీ టీవీ కవరేజ్ ద్వారా స్ట్రాంగ్‌రూంను గమనించేందుకు అనుమతించాలని సూచించారు. లెక్కింపు ముగిసిన అనంతరం అమలులో ఉన్న ఎన్నికల సంఘం సూచనల మేరకు కంట్రోల్ యూనిట్లకు సీల్ వేయాలని, ఈ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్‌రూంలో భద్రపరచాలని వివరించారు.