ఆంధ్రప్రదేశ్‌

ఖనిజాలు గుల్ల.. ఖజానా డొల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: గోదావరి జిల్లాల్లో ఖనిజాలు గుల్లవుతున్నాయి. దీనితో పాటు మట్టి, ఇసుక అక్రమ మైనింగ్, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. మైనింగ్ మాఫియా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల గండిపడుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ప్రభుత్వానికి సమర్పించిన మైనింగ్ నేరాల నివేదికలకు కాలదోషం పట్టింది. అక్రమ మైనింగ్, ఇసుక, మట్టి అక్రమాలు జోరుగా సాగుతున్నా సంబంధిత మైనింగ్ శాఖ కళ్ళు మూసుకుంటోంది. దీనితో పాటు ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ మైనింగ్ యధేచ్ఛగా సాగిపోతోంది.
గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ, సబ్-ప్లాన్ ఏరియాల్లో గనుల కొండలు హరించుకుపోతున్నాయి. అక్రమ మైనింగ్‌వల్ల జీవ వైవిధ్యం దెబ్బతినడంతోపాటు పర్యావరణం కాలుష్యంతో నిండిపోతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ తదితరాలను అక్రమంగా తరలిస్తూ మైనింగ్ మాఫియా జేబులు నింపుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాల్లో గనులను కొల్లగొడుతున్న ఘనుల ఉదంతాలు పెరిగిపోయాయి. ఒకవైపు అసైన్డ్ భూములను లీజుకు తీసుకుని, అక్రమ మైనింగ్ జరుగుపున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పెద్దాపురం మండలం రామేశ్వరం సొసైటీ భూముల్లో పలు సర్వే నెంబర్లలోని 850 ఎకరాల భూమి 40 సంవత్సరాల క్రితం సమీపంలోని వాలుతిమ్మాపురం, ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం గ్రామాలకు చెందిన ఎస్సీ కులస్థులకు ప్రభుత్వం కేటాయించి పట్టాలిచ్చింది. ఈ భూముల్లో అధికార ప్రభుత్వం అండతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు జరపడంతో పర్యావరణ సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ మద్దతుతో ఈ అక్రమ తవ్వకాలు ప్రైవేటు వ్యక్తులు కొనసాగిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (టి) రాష్ట్ర కన్వీనర్ అయినాపురపు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో వంతాడకు మించిన మైనింగ్ కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు మండలం వంతాడలో గనుల అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటీషన్ నెంబర్ 3808బై 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకు లీజుదారుడు రూ.14.9 కోట్లు రాయల్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంది. మరో రెండు మూడు కేసుల్లో రూ.100 కోట్ల వరకు రాయల్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సివుంది. అపరాధ రుసుం చెల్లించకపోవడం ఒకత్తయితే మరోవైపు యధేచ్ఛగా మైనింగ్ జరిగిపోతోంది. ప్రభుత్వంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని వంతాడ అక్రమ మైనింగ్ రాయల్టీ నుంచి ఎప్పటికపుడు తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గోదావరి జిల్లాల్లోని అక్రమ మైనింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించితే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.
అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ యంత్రాంగం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించింది. లేఅవుట్లలో అక్రమంగా గ్రావెల్‌ను నింపినందుకు సుమారు రూ.16.86 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడిందని, ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ అపరాధ రుసుం వసూలు చేయనందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసినా ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. ప్రత్తిపాడు మండలంలోని కొండ తిమ్మాపురం నుంచి చిన వంతాడ వరకు రిజర్వు ఫారెస్టులో అక్రమంగా రోడ్డును వేసి అడవిని ధ్వంసం చేసి రోడ్డును నిర్మించి లేటరైట్ ఖనిజాన్ని అక్రమంగా ఎటువంటి యూజర్ ఛార్జీలు చెల్లించకుండా తరలించినందుకు సంబంధిత లీజుదారులు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించి అప్పట్లోనే సుమారు రూ.5 కోట్లు అపరాధ రుసుం విధించారు. లీజుదారుకి క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందిగా విజిలెన్స్ సిఫార్సు చేశారు. అయినా ఈ నివేదిక మరుగున పడింది.