ఆంధ్రప్రదేశ్‌

బ్యూరోక్రాట్లు వర్సెస్ ఏపీ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 20: సీనియర్ ఐఏఎస్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా చల్లారలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈనెల 23న సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని రిటైర్డ్, వర్కింగ్ ఐఏఎస్‌లను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఎల్వీని సీఎస్‌గా నియమించి అప్పటి వరకు పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అనిల్‌చంద్ర పునేఠాను ఎన్నికల విధులతో సంబంధంలేని విధంగా బదిలీ చేయటం, రాష్ట్రంలోని మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో జోక్యం చేసుకోవటాన్ని ఏపీ సర్కార్ తప్పుపట్టిన సంగతి విదితమే. ముఖ్యమంత్రిని కూడా సంప్రతించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చటంలో రాజకీయ కోణం లేకపోలేదనే ఆరోపణలు వినవచ్చాయి. దీనికితోడు ఎల్వీకి ప్రతిపక్షనేత జగన్ అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉందని, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సీఎస్‌లు ఎప్పుడైనా డీజీపీని కలిసిన సందర్భాలు ఉన్నాయా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాదు ఎన్నికల ముందురోజు ఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ తీరుపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనంతో మండి పడ్డారు. దీంతో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సారథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్‌లు చంద్రబాబు బ్యూరోక్రాట్లపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయటంతో పాటు ఎల్వీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఈనెల 23న సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్‌ల ఆహ్వానాన్ని బాధ్యతల నిర్వహణలో ఉన్న ఐఏఎస్‌లు కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎన్నికల సంఘం ఆగమేఘాలపై తొలగించిన మాజీ సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా కూడా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అనేది గుర్తుంచుకోవాలని, శ్రీకాకుళం కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే ఆయన్ను కూడా తొలగించటాన్ని కొందరు ఐఏఎస్‌లు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే అధికారులపైనా ఈసీ బదిలీ వేటు వేసిందనే భావన వ్యక్తమవుతోంది. దీంతో రిటైర్డ్ ఐఏఎస్‌ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఒకరిద్దరు ఐఏఎస్‌లు వ్యాఖ్యానించటం గమనార్హం. ఇదిలా ఉండగా ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. మార్కెటింగ్ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఆ శాఖ కార్యదర్శికి మధ్య ఎన్నికల చివరి నిమిషం వరకు మాటామంతీ లేకపోవటమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. అంతేకాదు సాంఘిక సంక్షేమం, వ్యవసాయం, మరికొన్ని శాఖలకు చెందిన మంత్రులతో కూడా ఆయాశాఖల కార్యదర్శులతో సత్సంబంధాలు కొనసాగలేదనేది బహిరంగ రహస్యం. అయితే వీరంతా నేరుగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేశారని అందువల్లే మంత్రుల జోక్యాన్ని పట్టించుకోలేదనే వాదనలు లేకపోలేదు. కాగా తాజాగా ఎల్వీ వివాదం ఐఏఎస్ వర్గాల్లో ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందనేది వేచి చూడాల్సిందే.