ఆంధ్రప్రదేశ్‌

సందట్లో సడేమియా...తవ్వినంతా దోచుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 20: ఎన్నికలు ముగిసి, ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండటంతో ప్రస్తుత సంధి కాలాన్ని ఆసరాగా చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పేరుకు తూర్పు గోదావరి జిల్లా అయినా సరిహద్దులను చెరిపేసి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గోదావరి లంక భూముల్లో ఇసుకను సైతం తవ్వేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా యంత్రాలతో వందలాది లారీలతో ఇసుకను దోచేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేలోపు అవకాశమున్నంత మేరకు తవ్వేసి దోచుకోవడానికి ప్రణాళిక ప్రకారం కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు వారం ముందు వరకూ ఇసుక మాఫియా హడావుడి తగ్గగా, పోలింగ్ ముగిసిన మర్నాటి నుండే రంగంలోకి దిగిపోయాయి. చకచకా ర్యాంపులు తెరిచేసి, వేలాది లారీల్లో ఇసుకను తవ్వి, తరలించేస్తున్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రోజుకు సుమారు రూ.2 కోట్ల రూపాయల మేర ఇసుక వ్యాపారం జరుగుతుందంటే అక్రమ వ్యాపారం ఏ రీతిలో సాగుతుందో ఊహించవచ్చు. రాజకీయ నేతలు, వివిధ శాఖల అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందిస్తూ తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నకిలీ బిల్లులతో పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సైతం నిత్యం వందలాది లారీల్లో ఇసుకను సరఫరా చేస్తూ, ఆంధ్రా ప్రభుత్వ పనితీరును అవహేళన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... గోదావరి నది కిలోమీటర్ల మేర విస్తరించివుండటంతో నిర్మాణాలకు అవసరమైన సహజసిద్ధమైన ఇసుకకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక మాఫియా సభ్యులు అధికారులను లోబరుచుకుని, ప్రజాప్రతినిధులకు కమిషన్లు ఇచ్చి, ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని సీతానగరం, ఆలమూరు, కొత్తపేట, కొవ్వూరు, తాళ్లపూడి, యలమంచిలి తదితర మండలాల్లో అక్రమ ఇసుక వ్యాపారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం రెండు జిల్లాల్లో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలు అంతా ఒక ఎత్తయితే, ఒక్క తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్-డివిజన్ పరిధిలోని సీతానగరం మండలంలో జరిగే అక్రమ తవ్వకాలు ఒక ఎత్తు. తమ పట్ట్భాముల్లో గోదావరి ఇసుక మేటలు వేసిందని దాన్ని తొలగించి, వ్యవసాయానికి అనువుగా చేసుకోవడానికి అనుమతి ఇప్పించమని అధికార్లకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా సీతానగరం మండలంలో నాలుగేళ్ల నాడే అక్రమ ఇసుక దందాకు తెరలేచింది. ఇలా అనుమతి పొందిన భూమిలో ర్యాంపును నెలకొల్పి, నిత్యం వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలించడం నిత్యకృత్యంగా మారింది. రాజమహేంద్రవరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి సమీప బంధువు పేరుతో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ అక్రమ దందా, ఇంతలింతలుగా కొనసాగుతూనేవుంది. వాస్తవానికి ఈ భూములన్నీ కోతకు గురై గోదావరిలో కలిసిపోయివుంటాయి. ఆ భూముల్లో ఇసుక తొలగించడం, వ్యవసాయం చేయడం బూటకమే. అయినా ఈ భూములను పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాల్సిన అధికార్లు కళ్లుమూసుకుంటుండటంతో పదుల సంఖ్యలో ఈ అనుమతులు మంజూరవుతున్నాయి. రైతు పేరిట అనుమతి పొందిన భూమిలో ర్యాంపు ఏర్పాటుచేసి, విక్రయాలు జరగడమేమిటనే కనీస సందేహం అధికార్లకు కలగకపోవడం వెనుక మర్మమేమిటో బహిరంగ రహస్యమే. సీతానగరం మండలంలోని కాటవరం, మునికూడలి, రఘుదేవపురం కేంద్రంగా ఈ తరహా వ్యవహారం సాగిపోతోంది. ఇక్కడి భూములకు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలానికి చెందిన భూములు సరిహద్దుగా ఉంటాయి. అయితే తూర్పు గోదావరి జిల్లా వైపునుండి ఆ సరిహద్దులను దాటేసి ఇసుకను దోచేస్తున్నారు.
మరికొందరు ప్రభుత్వ పనులకు ఇసుక తోలుతున్నట్టు రికార్డులు సృష్టించి, దందా కొనసాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు రూపొందించింది. అయినా ఏ ఒక్క నిబంధనా షమలుకావడంలేదు. వాటిని పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, వ్యవసాయ, భూగర్భ జలనవనరుల, పర్యావరణ, పోలీసు శాఖలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ దందాలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు అధికారుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇసుక ర్యాంపుల్లో యంత్రాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించరాదని నిబంధనలు ఉన్నా యథేచ్ఛగా భారీ పొక్లయినర్లు ఉపయోగించి ఇసుకను తవ్వేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఇసుక తవ్వరాదని నిబంధన ఉన్నా 24 గంటలు ఇసుకను తవ్వేస్తున్నారు. అలాగే మైనింగ్ అధికార్లు నిర్ణయించిన జియోట్యాగ్ ప్రాంతంలోనే ఇసుకను మూడు అడుగుల లోతు మించకుండా తవ్వాల్సివుంది. అయితే ఈ నిబంధనలు అన్నిటినీ గుట్టగా పాతరేసి, గోదావరి నదిలో భారీ కందకాలను తలపించే రీతిలో ఇసుకను తవ్వేస్తున్నారు.
పది ఎకరాలకు డీ కాస్టింగ్ అనుమతి పొంది, కాటవరం, మునికూడలి, రఘుదేవపురం, ఇసుక ర్యాంపుల్లో వందలాది ఎకరాలు హద్దులు దాటి మరీ తొలిచేస్తున్నారు. ఇక వంగలపూడి, కాటవరం, వేమగిరి, జొన్నాడ, గోపాలపురం, కోరుమిల్లి ప్రభుత్వ ఇసుక రీచ్‌లలో అయితే అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కాటవరం ఇసుక రీచ్‌లో పంపింగ్ హౌస్ డీసిల్టింగ్ పేరిట ఇసుకను తవ్వేస్తున్నారు. పనులు ఎప్పుడో ముగిసినా, ఇసుక కోసం గోదావరిని అగాధంగా మార్చేస్తున్నారు. వంగలపూడి ఇసుకకు మార్కెట్లో భారీ డిమాండు ఉండటంతో ఒక ప్రజాప్రతినిధి అనుచరులు కొందరు సిండికేట్‌గా మారి ప్రభుత్వ పనులకు ఇసుక తవ్వుతున్నట్టు రికార్డులు చూపి, యూనిట్ ఇసుకను రూ.1400కు విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వ ర్యాంపుల్లో బాట చార్జీలు, ఎగుమతి ఛార్జీలు మినహా ఎటువంటి రుసుము వసూలు చేయరాదు. అయితే వంగలపూడి ఇసుక ర్యాంపుల్లో రోజుకు 200 లారీలు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీలో 7 నుండి 10 యూనిట్లు ఇసుకను ఎగుమతి చేస్తుంటారు. అంటే లారీకి రూ.9800 నుండి రూ.14వేలు వసూలు చేస్తుంటారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.25 లక్షల మేర ఇసుకను దోచేస్తున్నారు. అలాగే రఘుదేవపురంలో కొందరు బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి రోజుకు 100 లారీలు ఇసుకను విక్రయిస్తున్నారు. ఇక్కడ రోజుకు సుమారు రూ.10 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది. ఇక మునికూడలిలో ఈ దందాకు అదుపు అనేది లేకుండాపోయింది. గత మూడేళ్లుగా ఈ ర్యాంపుల్లో రెండు జిల్లాల హద్దులు చెరిపేసి, రోజుకు రూ.20 లక్షల మేర ఇసుకను దోచేస్తున్నారు.
చిత్రాలు.. సీతానగరం మండలం కాటవరం ర్యాంపులో గోదావరి గర్భంలో బారులు తీరిన ఇసుక లారీలు, పొక్లయినర్‌తో లారీల్లోకి ఇసుక తవ్విపోస్తున్న దృశ్యం