ఆంధ్రప్రదేశ్‌

చలమల నీరే శరణ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 20: ఆదివాసీ గిరిజన ప్రజల బాగోగులు పట్టించుకుని వారి సమగ్రాభివృద్ధి కోసం ఏర్పడిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఎ) ఆవిర్భవించి నాలుగు దశాబ్ధాలు దాటుతోంది. నేటికీ ఆదివాసీలకు పూర్తిస్థాయిలో రక్షిత మంచినీరు ఇవ్వలేక పోయింది ప్రభుత్వం. వేసవి వచ్చిందంటే మంచినీటికి ఆదివాసీలు అల్లల్లాడాల్సిందే. ఏటికేడాది గిరిజనుల అభివృద్ధికి రూ.కోట్ల బడ్జెట్. ఈ నిధులన్నీ ఏమైపోతున్నాయో తెలియదు గానీ ప్రజల కనీస ప్రాధమిక హక్కుగా రాజ్యాంగం కల్పించిన మంచినీటి సదుపాయం కూడా నేటికీ ఆదివాసీలకు పూర్తి స్థాయిలో దక్కలేదంటున్నారు.
మన్యంలో శబరి, సీలేరు, గోదావరి, సోకులేరు, పాములేరు, జడేరు, మడేరు, ఏలేరు, సీతపల్లి వాగులు ఎన్ని ఉన్నప్పటికీ గిరిజనులకు చలమనీరే దిక్కవుతోంది. వాగులు, ఉపనదుల నీటిని నిల్వ చేయడం, రక్షిత నీటి పధకాలు ఏర్పాటులో ప్రభుత్వం విఫలమవ్వడంతో వేసవిలో నీటి లభ్యత గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా కొండ కోనల్లో చుక్క నీటి కోసం వాగులు, చలమలను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. చలమనీరు తాగి టైఫాయిడ్, మలేరియా, డయేరియా, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అభయారణ్యంలో చుక్కనీటి మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఆదివాసీలే కాదు మూగజీవాలూ దప్పికతో అల్లాడిపోతున్నాయి. మారేడుమిల్లి, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం, దేవీపట్నం మండలాలతోపాటు ముంపు మండలాలైన కూనవరం, చింతూరు, విఆర్ పురం, ఎటపాక మండలాల్లో 183 గ్రామ పంచాయతీలు, 977 అటవీ ఆవాసాలు ఉన్నాయి. మన్యంలో ఆదివాసీల దాహార్తిని తీర్చడానికి గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా 417 రక్షిత మంచినీటి పథకాలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మన్యంలో 6343 చేతి పంపులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు, వాస్తవానికి మన్యంలో సుమారు 4వేలకు పైగా చేతి పంపులు పని చేయడం లేదని అంచనా. చేతి పంపులు మరమ్మతులు చేసేందుకు 15 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. మన్యంలోని చేతి పంపులు, రక్షిత నీటి పధకాలు పని చేయకపోవడంతో గిరిజనులు చెలమ నీటి కోసం పరుగులు తీస్తున్నారు.
ముంపు మండలాలైన ఎటపాక, కూనవరం, చింతూరు, విఆర్ పురం మండలాల్లో 2,200 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో సుమారు 1500 చేతి పంపులు పని చేయడం లేదని అంచనా. కూనవరం మండలంలో 18 తాగునీటి పథకాలు ఉండగా టేకుబాక, కూటూరు పథకాలు చాలా ఏళ్ల తరబడి పనిచేయడం లేదు. విఆర్ పురం మండలంలో 37 పథకాలకు 22 పథకాలు పనిచేయడం లేదు. ఎటపాక మండలంలో 41 పథకాలకు 23 పథకాలు, చింతూరు మండలంలో 29 పథకాలకు 12 పథకాలు పని చేయడం లేదు. రంపచోడవరం మండలం కాకవాడ గ్రామంలో గతంలో నిర్మించిన రక్షితనీటి పథకం మూల పడింది. దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గ్రామంలో 60 కుటుంబాలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. తమ గ్రామానికి రక్షిత మంచినీటి పథకం లేకపోవడం వల్ల వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని మన్య ప్రాంతాల్లో 13 లక్షల 42వేల 441 మంది ఆదివాసీలు ఉన్నారు. ఈ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఎ)లు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 14132.56 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో గిరిజన ప్రాంతం విస్తరించింది. ఏటికేడాది పెరుగుతోన్న గిరిజన జనాభాకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు కావడం లేదు. రంపచోడవరం ఐటీడీఎ పరిధిలోని ఏడు మండలాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,18,385 మంది గిరిజనులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం నేటికీ మంచినీటి సదుపాయం దక్కలేదు. కనీస స్థాయిలో కూడా మంచినీరు అందడం లేదు. వందలాది గ్రామాల్లో రక్షిత తాగునీటి పథకాలు లేవు. ఉన్న మంచినీటి పధకాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. చేతి పంపుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వేసవిలో భూగర్భజలాలు మరింత లోతుకు పోవడం వల్ల చేతి పంపులు పని చేయక గిరిజనులు చలమనీటిపై ఆధారపడుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలంలో రెండు రోజుల నుంచి పంచాయతీకి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.