ఆంధ్రప్రదేశ్‌

వడగళ్లు, ఈదురుగాలులతో పండ్ల తోటలకు అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, ఏప్రిల్ 21 : వడగండ్ల వాన, ఈదురుగాలులు కడప జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచాయి. జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో 617 హెక్టార్లలోని ఉద్యాన పంటలకు రూ. 8.5 కోట్ల నష్టం వాటిల్లిందని ఉద్యాన పంటల జిల్లా డైరెక్టర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో అనూహ్యంగా ఉపరితలద్రోణి ప్రభావంతో వడగండ్ల వానతో పాటు ఈదురుగాలులు వీచడంతో జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలి, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, పులివెందుల, వేంపల్లె, వీరబల్లి మండలాల్లో రైతులు సాగు చేసిన అరటి, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు ఉద్యాన పంటలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రొద్దునే్న పొలాలకు వెళ్లిన రైతులకు నేలకొరిగిన అరటి తోటలు, ఎడాపెడగా విరిగిపోయిన అరటిగెలలు, మామడి చెట్ల కింద కోత దశకు వచ్చిన కాయలు రాలిపోయి పడి ఉండడం, చేతికందిన బొప్పాయి పంట కాయలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపించడంతో వారి కళ్లలో కడగండ్లు తన్నుకొచ్చాయి. వీరబల్లి బేనీషా మామిడి ధర టన్ను రూ. 50వేలు పలుకుతున్న తరుణంలో గాలుల తాకిడికి నేలకొరిగి పగిలిపోయాయి. ఎండ తీవ్రతతో వేడెక్కిన భూమికి అకాల వర్షం ఉపశమనం ఇచ్చిందేకానీ ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల పాలిట శాపంగా మారింది. అప్పు చేసి పెట్టుబడులు పెట్టి, పంట దిగుబడి వచ్చే సమయంలో జిల్లాలోని 836 మంది రైతుల జీవితాలతో ఈ అకాల వర్షాలు, ఈదురుగాలులు చెలగాటమాడాయి. వారి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టాయి. ఇక జిల్లా యంత్రాంగం, ఉద్యానవన శాఖ క్షేత్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు నష్టపోయిన పంట పొలాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
అలాగే ఎప్పటికప్పుడు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతుల వివరాలను జిల్లా యంత్రాంగం తెప్పించుకుంటుంది. ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కళ్లెదుటే మట్టిలో కలిసిపోతున్న పంటలను చూసి అన్నదాతలు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. వేల ఎకరాల్లో ఉద్యానపంటలు తీవ్రంగా నష్టపోవడంతో జిల్లా యంత్రాంగం నివేదికలు తయారుచేసే పనిలో పడింది.
చిత్రం... ప్రకృతి ప్రకోపానికి గురై నేలకొరిగిన అరటిపంట