ఆంధ్రప్రదేశ్‌

భగీరథుడి వారసులం... జల సంరక్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 22: భగీరథుడు పట్టుదలకు మారుపేరని ఆయనే మన ఆంధ్రుల ఆరాధ్య దైవమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. ఉండవల్లి ప్రజావేదిక సమావేశపు హాలులో సోమవారం భగీరథ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అన్నివర్గాల ప్రజలు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అనుకున్న కార్యాలు సిద్ధించే వరకు పట్టువదలకుండా పోరాడే వ్యక్తులను భగీరథుడితో పోలుస్తామని అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయటాన్ని భగీరథయత్నంగా నానుడిలో ఉందని గుర్తుచేశారు. లోక కళ్యాణం కోసం ఆయన ఒంటికాలుపై కఠోర తపస్సుచేసి దివి నుంచి భువికి పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చిన మహనీయుడన్నారు. ఆయనకు నివాళిగానే తెలుగుదేశం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తోందని చెప్పారు. ఐదేళ్లలో రూ. 70 వేల కోట్లు ప్రాజెక్టుల పూర్తి కోసమే ఖర్చు చేశామని తెలిపారు. 23 ప్రాజెక్ట్‌లను ఐదేళ్లలో పూర్తిచేయటం ఓ చరిత్ర అని చెప్తూ మరో 22 ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్నాయని వివరించారు. మొత్తం 69 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. కొత్తగా మరో 14 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 70 శాతం పూర్తికావటం ప్రపంచ రికార్డని చెప్పారు. పట్టిసీమను అనతికాలంలోనే పూర్తిచేసి మూడేళ్లలో రూ 40వేల కోట్ల దిగుబడులు సాధించ గలిగేలా చూశామన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం కనుకే భగీరథ వారసులమని అభివర్ణించారు. ఆయన స్ఫూర్తితోనే నీరు- చెట్టు, జలసంరక్షణ ఉద్యమం, జలసిరికి హారతి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కరవు సీమ రాయలసీమ భూములను కృష్ణాజలాలతో పునీతం చేయటం తనకు సంతృప్తి నిచ్చిందన్నారు. గ్రామగ్రామాన రైతులు జలాలకు హారతులిచ్చి సంబరాలు చేసుకున్నారని చెప్పారు. వందలాది చెరుపులను నింపి రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచగలిగామన్నారు. పులివెందులలో ఎండిపోయిన చీని చెట్లకు పునర్జీవం కల్పించామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి, గ్రామీణ జీవన ప్రమాణాలు పెంచామని, పల్లెటూళ్లు భారత దేశానికే భాగ్యసీమలుగా చేస్తున్నామని తెలిపారు. ఇకపై కూడా జలసంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతి నీటి చుక్కను ఒడిసిపడతామని స్పష్టం చేశారు.
జాగ్రత్త..లెక్కింపురోజే కీలకం
ఏ మాత్రం అశ్రద్ధ వహించినా నష్టం తప్పదు
గెలుపుపై అతి ధీమా వద్దు.. ఈ నెలరోజులే కీలకం.. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా నష్టం తప్పదని పార్టీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆంతరంగికంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ముందుగా పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులపై ఎమ్మెల్యే అభ్యర్థులతో మంతనాలు జరిపారు. ఎన్నికల్లో బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, మహిళలు, వృద్ధులు ఎంత శాతం మంది ఓటేశారు.. సంబంధిత పోలింగ్ కేంద్రం పరిధిలో ఆరోజు చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ప్రొఫార్మా అందజేసినట్లు తెలిసింది. ఓటింగ్ సరళి టీడీపీకి అనుకూలంగా ఉంటుందా.. వైసీపీకి ఓటేసిన కేంద్రాల వివరాలపై నిశితంగా ఆరా తీసినట్లు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు, తరువాత జరిగిన ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తిచేసిన డేటా ఆధారంగా ఓ నిర్ణయానికి రావచ్చని చెప్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పార్టీ అభ్యర్థులు అధినేత దృష్టికి తీసుకువచ్చినట్లు తెలియవచ్చింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి అనుమానంగా మారిందని, చివరిక్షణంలో ప్రత్యర్థి పార్టీలకు కొందరు నాయకులు కొమ్ము కాసిన వైనాన్ని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకరవు పెట్టినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా కింది స్థాయి అధికారులు, పోలీసులు కొందరు దురుసుగా ప్రవర్తించారని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరోపించినట్లు సమాచారం. జూన్ వరకు గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ నియోజకవర్గాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. అదేమని ప్రశ్నిస్తే ఎన్నికల నియమావళిని సాకుగా చూపుతున్నారని అధినేత వద్ద వాపోయారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీని టార్గెట్ చేసిందని, ప్రధానమంత్రి మోదీ చెప్పు చేతల్లో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగరాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలున్నప్పటికీ ఏ మాత్రం ఆదమరచి వ్యవహరించరాదని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలను నిశతంగా పరిశీలించాలని ఫారం-17(ఏ,బీ,సీ)ల్లో పోలైన ఓట్లను సరిచూసుకోవాలని నిర్దేశించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు రాయలసీమ జిల్లాల్లో పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఓట్లు ఎవర్ని ప్రభావితం చేస్తాయనే విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ 120 స్థానాలకు పైగా గెలుస్తుందనే భావనతో ఉన్నామని, ఎంపీ సీట్లు అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయ పడినట్లు చెప్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు జిల్లాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై ఎడతెగని చర్చలు జరిపారు. కౌంటింగ్ సమయం ముగిసే వరకు సంయమనం పాటించాలని, ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు దిగే అవకాశాలు ఉన్నందున ఏది జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచనలు చేశారు. కష్టపడిన అభ్యర్థులకు గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎదురీతలో ఉన్న నియోజకవర్గాల పరిస్థితిపై మరోసారి సమీక్షించాలని భావిస్తున్నారు. ఓటింగ్ శాతం ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.