ఆంధ్రప్రదేశ్‌

పూడుకుపోతున్న కాటన్ బ్యారేజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: కాటన్ బ్యారేజీ తటాకం పూడుకుపోతోంది. దశాబ్దాలుగా పూడిక తీయకపోవడంవల్ల ఏటికేడాది బ్యారేజీ గర్భం లోతు పూడుకుపోతోంది. బ్యారేజీలకు ఎప్పటికపుడు పూడిక తీసే సాధన సంపత్తి కాస్తా తెలంగాణకు తరలిపోవడంతో ప్రస్తుతం ఆ సామర్థ్యం కొరవడింది. ఏపీ ఇంజినీరింగ్ ప్రయోగశాల ఈ పూడిక తీత చేయల్సివుంది. విభజన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఇంజినీరింగ్ ప్రయోగశాల పరిమితమైంది. వరదల సమయంలో ఎగువ నుంచి వచ్చే నీటితో పాటు పెద్ద ఎత్తున మట్టి, ఇసుక కొట్టుకువస్తుంది. ఇదంతా బ్యారేజి వద్ద మేటలుగా పేరుకుపోతుంటుంది. దీనిని ఎప్పటికపుడు సెడిమెంటేషన్ విధానం ద్వారా గుర్తించి నివేదిక రూపొందిస్తారు. ఈ అధ్యయన నివేదిక ఆధారంగా జల వనరుల శాఖ బ్యారేజివద్ద నదీ గర్భం లోతు పూడుకుపోకుండా ఎప్పటికపుడు పూడికతీత చేయిస్తుండాలి. ఇంజినీరింగ్ ప్రయోగశాల రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని నదులు, బ్యారేజిలకు కూడా సెడిమెంటేషన్ చేసి నివేదిక సమర్పించాల్సివుంది. విభజనకు ముందు నుంచే సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజి సెడిమెంటేషన్ మరుగునపడింది. ఇపుడు ఏకంగా ఆ శక్తి సామర్ధ్యాలే మనకు అందుబాటులో లేకుండా పోయాయి. హిమాయత్‌నగర్‌లో ఈ ప్రయోగశాల మిగిలిపోవడంతో పూడికకు సంబంధించిన నివేదికలు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో గత దశాబ్దానికి పైగా కాటన్ బ్యారేజి వద్ద పూడిక తీయలేదు. దీంతో లోతు తగ్గిపోయింది. ఎప్పటికపుడు పూడికతీత జరిగి వుంటే నిర్దేశిత లోతు ప్రకారం నీరు నిల్వ ఉండటానికి అవకాశముంది.
కాటన్ బ్యారేజి వద్ద కేవలం సుమారు 3 టీఎంసీలు మాత్రమే నిల్వ సామర్ధ్యంవుంది. ఇది కేవలం అడ్డుకట్ట మాత్రమే. రిజర్వాయర్ కాదు. కాబట్టివచ్చిన నీటి ప్రవాహాన్ని బ్యారేజి వద్ద 3 టీఎంసీల వరకు ఆపుకుని ఆపై ప్రవాహాన్ని దిగువకు విడిచిపెట్టాల్సిందే. అందుకే వరదల సమయంలో రోజుకు లక్షలాది క్యూసెక్కుల వరద జలాలు సముద్రం పాలవుతాయి. ఒక్క సీజన్‌లో బ్యారేజికి చేరుకునే నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం వుంటే కేవలం ఒక్క సీజన్ జలాలతోనే రాష్ట్ర ఆయకట్టు అంతటికీ సాగు జలాలను అందించవచ్చు. నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంవల్ల ఏటికేడాది లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రం పాలవుతున్నాయి. బ్యారేజి వద్ద పూడిక తీయకపోవడం వల్ల ఏటికేడాది లోతు తగ్గిపోతోంది. దీంతో రబీ పంట సీజన్ సమయంలో బ్యారేజి నుంచి సాగునీటిని శివారు ప్రాంతాలకు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి కాలంలో నది నీటి లభ్యత క్షీణించడం, ఇసుక దిబ్బలు పెరిగిపోవడం, బ్యారేజి వద్ద పూడికవల్ల లోతు తగ్గిపోవడంతో సామర్ధ్యం మేరకు నీటి నిల్వ చేయడం వీలుపడ్డం లేదు. బ్యారేజి వద్ద లోతు నిర్దేశిత 3 టీఎంసీలు గానీ వుంటే రబీ సమయంలో నది నీటి లభ్యత తక్కువగా వున్నప్పటికీ సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు అవకాశం వుంటుందని అంటున్నారు. దీనికి తోడు బ్యారేజి ఎగువ ప్రాంతంలో కూడా ఇసుక దిబ్బలు పేరుకుపోయాయి. ప్రస్తుతం బ్యారేజి వద్ద లోతు సుమారు 2 టీఎంసీల వరకు మాత్రమే వుంటుందని అంచనా వేస్తున్నారు.
బ్యారేజి ఎగువన ఏడాది కాలంలో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల వరకు ఇసుకను తీశారు. మళ్ళీ ఈ సీజన్‌లో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక పేరుకుపోయి వుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా బ్యారేజి వద్ద పూడిక కూడా పెరిగిపోయింది. ఏదేమైనప్పటికీ బ్యారేజి ఎగువ, బ్యారేజి వద్ద సెడిమెంటేషన్ ప్రక్రియ నిర్వహించే అవకాశం లేకపోవడం వల్ల గోదావరి డెల్టాలకు గుండె వంటి బ్యారేజి పాండ్ లోతు ఏటికేడాది తగ్గిపోతోంది. ఈ వ్యవస్థను పునరుద్ధరించుకుని కాటన్ బ్యారేజి లోతును పెంచుకునేందుకు పూడిక తీత పనులు చేయాల్సి వుంది.
చిత్రం...కాటన్ బ్యారేజీలో నీరు నిల్వ వుండే తటాకం