ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.83 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకిచ్చే వ్యవసాయ రుణాల మొత్తాన్ని భారీగా పెంచింది. 2016-17 సంవత్సరానికి గాను మొత్తం 83 వేల కోట్ల రూపాయల రుణాలు అందజేయాలని నిర్ణయించింది. వీటిలో ఖరీఫ్ కోసం రూ.36 వేల కోట్లు, రబీ కోసం రూ.24 వేల కోట్ల రూపాయలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక రుణాలకోసం మరో రూ.23 వేల కోట్ల రూపాయలు వెరసి రూ.83 వేల కోట్ల రూపాయలు రుణాలుగా అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కౌలు రైతుల్ని ఆదుకోవడం కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం రుణాలు పొందడంతో పాటు, రాయితీలు అందుకోవడం, పంటల బీమా చేయించుకోవడం, నష్టపరిహారం పొందడానికి రుణ అర్హత కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్డుల కింద ఈ ఏడాది 10 లక్షల మంది కౌలు రైతులకు రుణాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది ప్రతి బ్యాంకు శాఖ నుంచి ఇప్పటివరకు రుణం పొందని 150 మంది కొత్త రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. పంటల వారీగా నిర్ణయించిన రుణ పరిమితిని, పంటకాలం ప్రారంభానికి ముందే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరెవరికి ఎంతెంత రుణాలు మంజూరు చేసింది ఆయా బ్యాంకు శాఖల నోటీసు బోర్డులో ఉంచాలని కూడా బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. రైతు సమావేశాలు, పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాల్లో బ్యాంకర్లు పాల్గొని తాము అందజేసే రుణ సదుపాయాల గురించి వివరించడంతో పాటు రైతులు రుణాలు తీసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే పంట రుణం తీసుకున్న రైతులు నిర్ణీత కాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకే రుణాలిచ్చేలా ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయాలని కూడా బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది.పంట రుణాల కింద లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు పావలా వడ్డీకింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన 270వ నెంబరు జీవో చెబుతోంది. ఈ ప్రకారం ఈ ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయల మేరకు రుణాలు అందజేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.